'సెక్షన్ - 26 సవరణపై కేంద్రమంత్రితో చర్చించా' | karimnagar MP B. vinod kumar meet with sadananda gowda | Sakshi
Sakshi News home page

'సెక్షన్ - 26 సవరణపై కేంద్రమంత్రితో చర్చించా'

Published Thu, Apr 21 2016 12:46 PM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM

karimnagar MP B. vinod kumar meet with sadananda gowda

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలు...హైకోర్టు ఏర్పాటు...  హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తుల వాటా.. తదితర అంశాలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడతో చర్చించినట్లు కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి సదానందగౌడతో వినోద్కుమార్ భేటీ అయ్యారు. అనంతరం వినోద్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.... విభజన చట్టంలోని సెక్షన్ - 26లో చేయవలసిన చిన్నపాటి సవరణపై కూడా మంత్రితో చర్చించినట్లు చెప్పారు. ఈ సెక్షన్లో చేసే సవరణ ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో స్థానాలు పెంచేందుకు అవకాశం ఉందన్నారు. ఇదే సవరణపై సదానందగౌడకు గతంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు లేఖ రాసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  

తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే దశలో ఉందన్నారు. ఈ బిల్లు తయారీపై కేంద్ర హోంశాఖ, న్యాయశాఖకు తమ అభిప్రాయాలను పంపించిందని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ సవరణ బిల్లు వచ్చేలా అందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని మంత్రి సదానంద గౌడని కోరినట్లు చెప్పారు. ఒకటిరెండు రోజుల్లో తమ శాఖ నుంచి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తనకు హామీ ఇచ్చారన్నారు.

అలాగే దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో 450 మంది న్యాయమూర్తులు ఉన్న విషయాన్ని కూడా ఆయనతో ప్రస్తావించారన్నారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఉన్నందున న్యాయమూర్తుల ఎంపికలో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై చర్చించినట్లు చెప్పారు. ఉమ్మడి హైకోర్టులో 42 శాతం తెలంగాణ న్యాయమూర్తుల ఎంపిక జరగాలని కోరినట్లు తెలిపారు. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో న్యాయ శాఖలో జరిగిన అన్యాయం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక జరుగవద్దు అన్నదే తమ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి   కేసీఆర్ ఆలోచన అని సదానంద గౌడ ఎదుట వివరించినట్లు చెప్పారు. ఇదే విధంగా లోయర్ జ్యూడిషియరీ నుంచి జరిగే ఎంపికలో తెలంగాణ వాటా ఉండాలని మంత్రికి వివరించానన్నారు.

ఈ అంశాలపై హైకోర్టు చీఫ్ జస్టిస్తో తప్పకుండా మాట్లాడుతానని మంత్రి హామీ ఇచ్చారు హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టులో అప్పిల్ చేస్తే బాగుంటుందని మంత్రి సూచించారన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement