సాక్షిప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన కోలాహలం మరో ఆరు నెలల పాటు కొనసాగనుంది. పంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో మొదలై ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తి కానున్నాయి. ఆ వెంటనే వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు కూడా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు సైతం పార్లమెంట్ ఎన్నికలు టార్గెట్‌గా పావులు కదుపుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్‌లో అత్యధిక స్థానాలను సాధించుకున్న టీఆర్‌ఎస్ జోష్‌తో వెళ్తోంది. కాంగ్రెస్ కూటమి, బీజేపీ తదితర పార్టీలు సైతం పార్లమెంట్ బరిలో నిలిచేందుకు సన్నద్ధం అవుతుండగా, ఆయా పార్టీల నుంచి ఎవరెవరు పోటీలో ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా ఒక్కో ఎన్నికల్లో ఒక్కో రకంగా ఓటు వేసి తీర్పు చెప్పే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ఓటర్లు.. ఈసారి ఎలా వ్యవహరి స్తారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈసా రి అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరు ఉంటారనేది చివరి నిమిషం వరకు చెప్పలేని పరిస్థితి రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా.. అన్ని పార్టీల లక్ష్యం పార్లమెంట్ ఎన్నికలే కానున్నాయి.
ఉద్ధండుల కేరాఫ్.. కరీంనగర్ పార్లమెంట్ స్థానం..
కరీంనగర్ స్థానానికి రెండు ఉప ఎన్నికలతో సహా మొత్తం పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరుగగా, రెండుసార్లు ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. ఎస్‌సీఎఫ్ ఒకసారి, పీడీఎఫ్ ఒకసారి, ఐదుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు కాంగ్రెస్(ఐ), టీఆర్‌ఎస్ నాలుగుసార్లు, బీజేపీ రెండుసార్లు, టీడీపీ, తెలంగాణ ప్రజా సమితి ఒక్కోసారి గెలిచాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇక్కడ ఒకే టర్మ్‌లో మూడుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. ఆయన 2004లో గెలిచిన తర్వాత రెండుసార్లు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలలో పోటీ చేసి కేంద్ర మంత్రి బాధ్యతలు కూడా చేపట్టిన ఆయన తెలంగాణ ఇవ్వడంలో జాప్యం జరగడంపై నిరసనగా మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అలాగే మరోసారి ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా చేసి ఉప ఎన్నికలలో పోటీ చేశారు. 2009లో మహబూబ్‌నగర్ నుంచి, 2014లో మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
రెండుసార్లు లోక్‌సభకు, శాసనసభకు పోటీ చేసి అన్నిసార్లు గెలిచిన నేతగా కూడా కేసీఆర్ రికార్డుకు ఎక్కారు. ఎంఆర్ కృష్ణ ఇక్కడ రెండుసార్లు, పెద్దపల్లిలో రెండుసార్లు గెలిచారు. జె.చొక్కారావు మూడుసార్లు, ఎం.సత్యనారాయణరావు మూడుసార్లు (ఒకసారి టీపీఎస్, రెండుసార్లు కాంగ్రెస్), బి.వినోద్‌కుమార్ రెండుసార్లు హన్మకొండలోనూ, ఇక్కడ ఒక్కసారి, చెన్నమనేని విద్యాసాగర్‌రావు రెండుసార్లు గెలిచారు. అలాగే మరోనేత జె.రమాపతిరావు రెండుసార్లు నెగ్గారు. బద్దం ఎల్లారెడ్డి, ఎం.శ్రీరంగారావు, ఎల్.రమణ, పొన్నం ప్రభాకర్ ఒక్కోసారి గెలిచారు. కాగా 2014లో కరీంనగర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి టీఆర్‌ఎస్ సీనియర్ నేత బి.వినోద్‌కుమార్ విజయం సాధించారు. ఆయన అంతకు ముందు హన్మకొండ నుంచి రెండుసార్లు నెగ్గగా, 2009లో ఆ నియోజకవర్గం రిజర్వుడు కావడంతో కరీంనగర్‌కు మారి ఓటమిపాలైనా, 2014 ఎన్నికల్లో 2,04,652 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
వినోద్‌కుమార్‌కు 5,05,358 ఓట్లు రాగా, 2009లో గెలిచి, తిరిగి 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌కు 3,00,706 ఓట్లు వచ్చి ఓడిపోయారు. తెలుగుదేశం మద్దతుతో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌రావుకు 2,54,828 ఓట్లు వచ్చి మూడో స్థానంలో ఉన్నారు. వినోద్‌కు 2,04,652 ఓట్ల అధిక్యత లభించింది. కాగా ఈసారి అధికార పార్టీ నుంచి మళ్లీ వినోద్ పేరు ఉన్నప్పటికీ, సీఎం కేసీఆర్ కూడా పోటీ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రముఖంగా పొన్నం ప్రభాకర్ పేరుండగా, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి, చల్మెడ లక్ష్మీనర్సింహారావు తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీనియర్ నాయకుడు పి.సుగుణాకర్‌రావు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
1962 నుంచి రిజర్వుడ్ స్థానంగా ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ మూడుసార్లు, కాంగ్రెస్ (ఐ) ఆరుసార్లు, టీడీపీ నాలుగుసార్లు, తెలంగాణ ప్రజాసమితి ఒకసారి, తెలంగాణ రాష్ట్ర సమితి ఒకసారి గెలిచాయి. సీనియర్ కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి ఇక్కడ నుంచి నాలుగుసార్లు గెలవగా, సిద్దిపేటలో మరో మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎంఆర్.కృష్ణ ఇక్కడ రెండుసార్లు, కరీంనగర్ నుంచి రెండుసార్లు గెలిచారు. మరోనేత వి.తులసీరామ్ ఇక్కడ రెండుసార్లు, నాగర్‌కర్నూల్‌లో ఒకసారి, గొట్టే భూపతి, చెల్లిమెల సుగుణకుమారి రెండేసిసార్లు గెలిచారు. కె.రాజమల్లు, వివేక్, సుమన్ ఒక్కోసారి గెలిచారు. వెంకటస్వామి కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రిగా పనిచేయగా, ఎంఆర్.కృష్ణ కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. రాజమల్లు రాష్ట్రమంత్రిగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో సుమన్ అత్యధిక మెజార్టీ తెచ్చుకున్న నేతగా రికార్డుకు ఎక్కారు. ఇక్కడ ఎనిమిది మంది ఎస్సీ నేతలు పదిహేనుసార్లు విజయం సాధించారు.
కాగా తెలంగాణ ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉన్న నియోజకవర్గంలో పెద్దపల్లి లోక్‌సభ స్థానం ఒకటి. అక్కడ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేతలలో ఒకరైన బాల్క సుమన్‌కు టీఆర్‌ఎస్ టిక్కెట్ ఇవ్వగా ఆయన ఏకంగా 2,91,158 ఓట్ల అధిక్యతతో సంచలన విజయం సాధించారు. 2009లో గెలిచిన జి.వివేక్ ఈసారి కూడా కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ తరుపున పోటీ చేసిన డాక్టర్ జె.శరత్‌బాబుకు కేవలం 63,334 ఓట్లే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. ఈసారి ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ పార్టీ తరపున మాజీ ఎంపీ జి.వివేక్‌తో పాటు మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ నుంచి ఎస్.కుమార్ పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ తరపున ఇటీవల చెన్నూరు నుంచి పోటీచేసి ఓడిపోయిన బి.వెంకటేశ్ నేత తదితరులు పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు.
కరీంనగర్ నుంచేఎంపీగా కేసీఆర్ పోటీ?
తెలంగాణ రాష్ట్ర సమితికి.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంట్ కరీంనగర్ జిల్లా. జాతీయ రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించేందుకు సమాయత్తమైన కేసీఆర్.. సెంటిమెంట్ గడ్డ కరీంనగర్ నుంచే భవిష్యత్ జాతీయ రాజకీయ వ్యవహారాలకు శ్రీకారం చుట్టేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఉద్యమం మొదలు అధికారం చేపట్టే వరకు అన్ని రకాలుగా కలిసొచ్చిన జిల్లాగా ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మళ్లీ దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి చేసే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని కోరినట్లు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment