తెరపైకి కొత్త ముఖాలు | 2019 Lok Sabha Election TRS MP Candidate Adilabad | Sakshi
Sakshi News home page

తెరపైకి కొత్త ముఖాలు

Published Thu, Feb 14 2019 8:25 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

2019 Lok Sabha Election TRS MP Candidate Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: పార్లమెంటు ఎన్నికలకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. రాజకీయ పార్టీల్లో కూడా సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల విషయంలో అధికార టీఆర్‌ఎస్‌లో కొత్త సమీకరణలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్‌లో సిట్టింగ్‌ ఎంపీ గోడం నగేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తుండగా, పెద్దపల్లి ఎంపీగా కొనసాగిన బాల్క సుమన్‌ ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ పదవికి రాజీనామా చేశారు.

ఈ పరిస్థితుల్లో వచ్చే ఏప్రిల్‌లో జరుగుతాయని భావిస్తున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తారక రామారావులకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం కూడా గెలుపు గుర్రాలు, వివాదరహితులైన మేధావుల కోసం పలు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్‌ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం కాగా, పెద్దపల్లి ఎస్సీకి కేటాయించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ రెండు స్థానాలపైనే కేంద్రీకృతమైంది.
 
పెద్దపల్లిలో వివేక్‌పై ఎమ్మెల్యేల వ్యతిరేకత 
మాజీ ఎంపీ గడ్డం వివేకానంద కోసమే పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌ను చెన్నూరుకు పంపించినట్లు టీఆర్‌ఎస్‌లో సాగిన ప్రచారం. కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగే వివేక్‌ 2013లో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి, 2014 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆ తరువాత 2017లో మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి వస్తూ, పెద్దపల్లి సీటుకు అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు.అందుకు అనుగుణంగానే చెన్నూరు సీటును బాల్క సుమన్‌కు ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు వివేక్‌కు ఆటంకంగా        మారుతున్నాయి. చెన్నూరు అసెంబ్లీ సీటును ఆశించిన వివేక్‌ సోదరుడు, మాజీ మంత్రి వినోద్‌కుమార్‌ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సందర్భంగా వివేక్‌ బెల్లంపల్లిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా తన యంత్రాంగాన్ని మోహరించారు.

అలాగే చెన్నూరు, మంచిర్యాలలో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఇక పెద్దపల్లి జిల్లా ధర్మపురిలో మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ వర్గం బాహాటంగానే వివేక్‌పై విమర్శలు చేశారు. మంథని, రామగుండంలో టీఆర్‌ఎస్‌ ఓడిపోగా, పెద్దపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయ రమణారావుకు ఆర్థిక సాయం అందించారన్న ఫిర్యాదులు వచ్చాయి. ఈ పంచాయతీ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దగ్గరకు వెళ్లగా, సుమన్, కొప్పుల ఈశ్వర్, వివేక్‌లతో సమావేశం ఏర్పాటు చేశారు కూడా. అయితే ప్రస్తుతం ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలతోపాటు ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన కోరుకంటి చందర్‌ కూడా వివేక్‌ను వ్యతిరేకిస్తున్నారు. వివేక్‌ తప్ప ఎవరికి సీటిచ్చినా గెలిపించుకు వస్తామని చెపుతున్నారు.

ఆదిలాబాద్‌లోనూ అదే తీరా..? 
ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బోథ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో నాలుగుసార్లు గెలిచిన గోడం నగేశ్‌ 2014 ఎన్నికల్లో పార్లమెంటుకు వెళ్లారు. అయితే బోథ్‌ నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలని భావించిన నగేశ్‌ గత రెండేళ్లుగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో పావులు కదిపారు. బోథ్‌ టికెట్టు కోసం చివరి వరకు ప్రయత్నించి విఫలమైన నగేశ్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాథోడ్‌ బాపూరావుకు సహకరించలేదు. ఆయన వర్గం కూడా దూరంగానే ఉంది.

దీంతో స్వల్ప మెజారిటీతో బాపూరావు గెలిచారు. ఆదిలాబాద్‌ ఎంపీగా తమ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో గానీ, కేంద్ర నిధులు తీసుకురావడంలో గానీ నగేశ్‌ ఏమాత్రం ప్రయత్నించలేదని మిగతా ఎమ్మెల్యేల్లో కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ టికెట్టు మార్చాలని రాథోడ్‌ బాపూరావుతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి సూచించినట్లు తెలిసింది. ఇందులో ఓ మాజీ మంత్రి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ ఎంపీ సీటును మారుస్తారనే ఊహాగానాలు లోక్‌సభ నియోజకవర్గంలో జోరందుకున్నాయి.
 
ఆదిలాబాద్‌ అభ్యర్థిత్వం కోసం కోవ లక్ష్మి  
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 సీట్లలో టీఆర్‌ఎస్‌ 9 గెలుచుకోగా, అనూహ్యంగా ఆసిఫాబాద్‌లో మాత్రం స్వల్ప తేడా తో ఓడిపోయింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎమ్మె ల్యే కోవ లక్ష్మి ఈసారి గెలిస్తే మంత్రి పదవి ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. ఓడిపోయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో కోవ లక్ష్మి తన బలాన్ని చాటుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్‌ లోక్‌సభ నుంచి పోటీ చేయాలనే యోచనలో లక్ష్మి ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి భీంరావు కూతురైన కోవ లక్ష్మి సర్పంచి స్థాయి నుంచి ఎంపీపీగా, ఎమ్మెల్యేగా ఎదిగిన క్రమంలో ఈసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ఓ ఆదివాసీని తొలిసారి పార్లమెంటుకు పంపే అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కాగా లక్ష్మి అభ్యర్థిత్వం పట్ల ఆదిలాబాద్‌ పార్లమెంటు పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా సానుకూలంగానే ఉన్నట్లు ఆమె అనుయాయులు చెపుతున్నారు.
 
పెద్దపల్లి ఆశావహులు ఎక్కువే! 
పెద్దపల్లిలో మాజీ ఎంపీ వివేక్‌ను ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తుండడంతో అధిష్టానం పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది. ఎమ్మెల్యేలను కాదని ఎంపీ టికెట్టు ఇవ్వడం రిస్క్‌తో కూడుకున్నదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో బెల్లంపల్లి టికెట్టు ఆశించి భంగపడ్డ ప్రవీణ్‌కుమార్‌ ఇప్పటికే తనకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ను కోరగా, చెన్నూరు సిట్టింగ్‌ సీటు నుంచి వైదొలిగిన మాజీ ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు కూడా కేసీఆర్‌ ఆశీస్సులు కోరారు. కుల సమీకరణల్లో మాదిగ వర్గానికి టికెట్టు ఇవ్వాలని పార్టీ యోచిస్తే తనకు సీటు ఖాయమని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం దళిత మేధావులుగా గుర్తింపు పొందిన వారిని పెద్దపల్లి నుంచి బరిలోకి దింపాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, సీనియర్‌ జర్నలిస్ట్‌ మల్లెపల్లి లక్ష్మయ్యల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement