స్థానికంపై గురి | All Parties Focus On ZPTC And MPTC Elections | Sakshi
Sakshi News home page

స్థానికంపై గురి

Published Wed, Apr 17 2019 1:15 PM | Last Updated on Wed, Apr 17 2019 1:15 PM

All Parties Focus On ZPTC And MPTC Elections - Sakshi

ప్రాదేశిక ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో అందరూ సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ క్రమంలో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మండల, జిల్లా పరిషత్‌ అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ముందస్తు వ్యూహాన్ని అమలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధంగానే అభ్యర్థులను అందరికంటే ముందుగానే ఖరారు చేసి.. ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తమవుతోంది.

హైదరాబాద్‌లో సోమవారం జరిగిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు ఆ పార్టీ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దిశానిర్దేశం కూడా చేశారు. ఈ మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మెదక్, సిద్దిపేట జిల్లాల సమన్వయ సారధిగా నియమితులైన మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ సైతం మండల స్థాయి సమావేశాలతో ముందుకు సాగుతోంది. బీజేపీ ఇప్పుడిప్పుడే ప్రాదేశిక ఎన్నికలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

సాక్షి, మెదక్‌ : మండలాలు, జిల్లా పునర్విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలు, 189 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ పురుటిగడ్డ అయిన మెతుకుసీమ మెదక్‌లో టీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లకు తీవ్రపోటీ నెలకొంది. ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు.. కొన్ని చోట్ల ఐదుగురు పోటీ పడుతున్నట్లు సమాచారం. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రిజర్వేషన్‌ బీసీ మహిళకు కేటాయించడంతో పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు తమ సతీమణులను పోటీకి దింపే ఆలోచనతో ఉన్నారు.

అభ్యర్థుల ఎంపికను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించిన కేసీఆర్‌.. స్థానిక నేతలతో సమన్వయం చేసుకోవాలని, ఉద్యమ వీరులు, పార్టీ అభ్యన్నతికి కృషిచేసిన వారికి ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు సమన్వయ సారధి హరీశ్‌రావు రంగంలోకి దిగారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది. అభ్యర్థులను త్వరగా ఖరారు చేసి ప్రజల్లోకి వెళ్లేలా రూపొందించుకున్న ముందస్తు వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ గెలుపును సొంతం చేసుకోవడంతోపాటు ఎంపీ ఎన్నికల్లో సైతం సత్తా చాటుతామనే ధీమా టీఆర్‌ఎస్‌ నేతల్లో కనపడుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి.  క్లీన్‌స్వీపే లక్ష్యమని.. ప్రాదేశిక ఎన్నికల్లోనూ ‘గులాబీ’ జెండా ఎగరడం ఖాయమని నేతలతోపాటు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సన్నాహక సమావేశాల్లో కాంగ్రెస్‌..
వరుస ఎన్నికల్లో డీలా పడ్డ కాంగ్రెస్‌లో నైరాశ్యం అలుముకుంది. ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటి.. శ్రేణుల్లో ఉత్సాహం నింపేదుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మెదక్‌ నియోజకవర్గంలోని హవేళిఘనాపూర్‌ మండల కేంద్రంలో ఈ నెల 15న కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు అధ్యక్షతన కాంగ్రెస్‌ కార్యకర్తలు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల పేర్లను సేకరించారు. వడబోత అనంతరం తుది జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఇలా ఒకటి, రెండు చోట్ల సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. వరుసగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలని ‘హస్తం’ నేతలు యోచిస్తున్నారు.

‘కమలం’లో కానరాని కసరత్తు?
ఒకప్పుడు మెదక్‌లో ప్రభావం చూపిన బీజేపీకి.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వరుస ఎన్నికల్లో ఓటమి ఎదురుకావడంతో కేడర్‌లో నిరుత్సాహం నెలకొంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీకి మంచి పట్టుంది. ఆ పార్టీలో ఇప్పటివరకు కసరత్తు మొదలుపెట్టిన దాఖలాలు కనిపిం చడం లేదు. ‘స్థానిక ఎన్నికల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయని.. ముందస్తుగా కసరత్తు చేపట్టి శ్రేణుల్లో జోష్‌ నింపితే మంచి ఫలితాలుంటాయని.. ఇప్పటికైనా నేతలు దృష్టి సారించాలి’ అని ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య కార్యకర్తలు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement