టార్గెట్‌ చైర్మన్‌! | KCR Focus On ZPTC And MPTC Elections | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ చైర్మన్‌!

Published Fri, May 10 2019 10:27 AM | Last Updated on Fri, May 10 2019 10:27 AM

KCR Focus On ZPTC And MPTC Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘ఎటు చేసి ఈసారి జెడ్పీ చైర్మన్‌ కావాల్సిందే... ఇందుకోసం ఎంత ఖర్చయినా ఫరవాలేదు’ అంటూ అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్లు పావులు కదుపుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడం.. హైదరాబాద్‌కు వెళ్లి అధిష్టానం పెద్దల ద్వారా హామీ తీసుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించారు. పూర్వ వరంగల్‌ జిల్లా ఇప్పుడు ఆరు జిల్లాలుగా విడిపోవడంతో ఆరు జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత పోలింగ్‌ 6వ తేదీన ముగియగా, రెండో విడత ఎన్నికలు శుక్రవారం, మూడో విడత ఎన్నికలు 14న జరగనున్నాయి. మూడు విడతల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 27న జరగనుండగా.. ఈలోగా జెడ్పీ చైర్మన్, ఎంపీపీల పేర్లను ఖరారు చేసేలా టీఆర్‌ఎస్‌ అధిష్టానం కమిటీలు నియమించింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలోని ఈ కమిటీకి ఒకటి, రెండు పేర్లతో కూడిన జాబితా తయారు చేయాలని సూచించినట్లు సమాచారం.

కేటీఆర్‌ ఆపై కేసీఆర్‌
ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆరు జెడ్పీలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా ఎంచుకున్న టీఆర్‌ఎస్‌ ఆ దిశగా ముందుకు సాగుతోంది. ఈ మేరకు జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలకు సంబంధించి రూపొందించనున్న జాబితాను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తొలుత పరిశీలిస్తారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ వచ్చిన తర్వాత ఫైనల్‌ చేసే అవకాశముందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆశావహులు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతూ జోరుగా పైరవీలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం హైదరాబాద్‌కు చేరడంతో త్వరలోనే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో సమావేశం ఉంటుందని ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలకు సమాచారం అందినట్లు తెలిసింది. మొత్తానికి మూడు విడతల పరిషత్‌ ఎన్నికలు ముగిసేలోగా కేసీఆర్, కేటీఆర్‌ నేతృత్వంలో కీలక భేటీలు నిర్వహించి జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీల విషయమై స్పష్టత ఇచ్చే అవకాశముందని సమాచారం.

ములుగు ఓకే.. మరి మిగతావి?
ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్‌ పదవికి కుసుమ జగదీష్‌ పేరును ప్రకటించిన అధిష్టానం మిగతా ఐదు స్థానాలపై సస్పెన్స్‌ కొనసాగిస్తుండడంతో ఆశావహుల మధ్యన పోటీ తీవ్రమవుతోంది. ఇక వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థుల విషయమై పరోక్షంగా కొందరికీ సంకేతాలు ఇచ్చినా... అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా ములుగు జెడ్పీ చైర్మన్‌ పదవిని పలువురు ఆశించారు. ఇందుకోసం మాజీ మంత్రి చందూలాల్‌ కోళ్ల స్వరూప వెంకన్నకు ములుగు జెడ్పీటీసీ టికెట్‌ హామీ ఇచ్చారు. అయితే, ఇటీవలే మృతి చెందిన పార్టీ జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ సకినాల శోభన్‌ కుమార్తె భవానీకి ఈ టికెట్‌ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఆమె వెంబడి గతంలో రెబల్స్‌గా గుర్తించబడిన నాయకులు తప్ప చందూలాల్‌ వర్గీయులు కనిపించడం లేదు.

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, జలవనరుల శాఖ చైర్మన్‌ వీరమల్ల ప్రకాశ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, ఎంపీ సీతారాంనాయక్‌ తదితరులు ప్రచారం చేసున్నా గ్రామ స్థాయి కేడర్‌ పాల్గొనకపోవడం అయోమయానికి దారి తీస్తోంది. కాగా, స్థానికేతర ప్రజాప్రతినిధులను ఇన్‌చార్జ్‌లుగా నియమించగా స్థానిక నేతలతో సమన్వయం కుదరడం లేదని చెబుతున్నారు.

అలాగే, గోవిందరావుపేట జెడ్పీటీసీగా యువనేత అంబటి వినయ్‌కు మాజీ మంత్రి చందూలాల్‌ మద్దతు ఇవ్వగా, లోక్‌సభ ఎన్నికల ముందు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల హరిబాబుకు టికెట్‌ ఇచ్చారు. దీంతో ఈ మండలంలోనూ కేడర్‌లో విభేదాలు పొడచూపాయి. ఏటూరునాగారం జెడ్పీటీసీ టికెట్‌ను స్థానిక సీనియర్‌ నేత లక్షణ్‌బాబు ఆశించారు. ఇక్కడి స్థానం జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో జెడ్పీ చైర్మన్‌ రేసులో ఉన్న ములుగు మండలం మల్లంపల్లికి చెందిన కుసుమ జగదీశ్‌కి కేటాయించడం వివాదస్పదమైంది. కానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో ఇది సద్దుమణిగి కేడర్‌ ప్రచారబాటలో సాగుతోంది.
 
భూపాలపల్లి, వరంగల్‌ రూరల్‌ నుంచి ఇద్దరు... అర్బన్‌ నుంచి ఒక్కరేభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్‌ రూరల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా జ్యోతికి అవకాశం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆమె శాయంపేట నుంచి జెడ్పీటీసీగా పోటీకి దిగారు. అంతకు ముందు చైర్‌పర్సన్‌ రేసులో ఉన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి సతీమణి స్వప్న సైతం చివరి నిముషంలో నల్లబెల్లి నుంచి నామినేషన్‌ వేయడంతో చైర్మన్‌ అభ్యర్థి ఎవరన్న చర్చకు తెరలేచింది.

ఎస్సీ మహిళకు కేటాయించిన భూపాలపల్లి జయశంకర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ కోసం పోటీ పడుతున్న జక్కు శ్రీహర్షిణి కాటారం నుంచి, రాదారపు ప్రమీల మహాముత్తారం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో ఉన్నారు. కాగా, ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ చేసిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఏడు జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇక్కడ జెడ్పీ చైర్‌పర్సన్‌ కోసం డాక్టర్‌ మారెపల్లి సు«ధీర్‌కుమార్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. భీమదేవరపల్లి మండలానికి సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు అనుచరుడు, కరీంనగర్‌ జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించిన సుధీర్‌కుమార్‌ పేరే దాదాపు ఖాయమైనట్లుగా చెబుతున్నారు.

జనగామ కోసం హంగామా.... మానుకోటకు పోటాపోటీ
జనగామ జెడ్పీ చైర్మన్‌ పదవి కోసం మొదటి నుంచి హంగామా జరుగుతోంది. ఇక్కడి నుంచి అధికార టీఆర్‌ఎస్‌ తరఫున పలువురు ఆశించినా.. జెడ్పీటీసీలుగా నామినేషన్లు వేసిన నలుగురు ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి ప్రేమలతారెడ్డి టికెట్‌ ఆశించి భంగపడి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. టీఆర్‌ఎస్‌ బీ ఫాంలతో జనగాం, చిల్పూరు, లింగాల గణపురం, తరిగొప్పుల నుంచి బరిలో ఉన్న నిమ్మతి దీపికారెడ్డి, గుడి వంశీధర్‌రెడ్డి, పాగాల సంపత్‌ రెడ్డి, ముద్దసాని పద్మజ చైర్మన్‌ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక మహబూబాబాద్‌ జిల్లాలో జెడ్పీ చైర్మన్‌ కోసం మొదటి నుంచి ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ కోడలు నిత్య రవిచంద్ర పేరు వినిపించగా అనూహ్యంగా తప్పుకున్నారు. ప్రస్తుతం గూడూరు, బయ్యారం, నర్సింహులపేట నుంచి జెడ్పీటీసీలుగా పోటీ చేస్తున్న గుగులోతు సుచిత్ర, అంగోతు బిందు, బి.సంగీత మహబూబాబాద్‌ జెడ్పీ పీఠంపై కన్నేశారు. నర్సింహులపేట స్థానం జనరల్‌కు కేటాయించినా జెడ్పీ చైర్మన్‌ కోసం సంగీత ఈ స్థానం నుంచి పోటీ పడుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement