కోడేరులో టీఆర్‌ఎస్ నాయకుల గెలుపు సంబరాలు
కొల్లాపూర్: ప్రాదేశిక ఎన్నికలు కొల్లాపూర్ నియోజకవర్గంలో పాత టీఆర్‌ఎస్ వర్సెస్ కొత్త టీఆర్‌ఎస్‌గా మారాయి. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అనధికారికంగా గులాబీ గూటికి చేరడంతో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నియోజకవర్గంలో రెండు విడతలుగా జరిగాయి. మొదటి విడతలో కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాల్లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పార్టీ బీఫారాలు ఎమ్మెల్యే సతీమణి బీరం విజయమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. జూపల్లి వర్గానికి రెండు ఎంపీపీలు, రెండు జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే వర్గానికి రెండు ఎంపీపీలు, రెండు జెడ్పీటీసీల చొప్పున బీఫారాలు ఇచ్చారు. ఎంపీపీలున్న చోట్ల ఆయా వర్గాలకు ఎక్కువ ఎంపీటీసీ స్థానాలు కేటాయించారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు పోటీచేసిన స్థానాల్లో జూపల్లి వర్గీయులు స్వతంత్రులుగా పోటీలో నిలిచారు.
మొదటి విడత ఎన్నికల ఫలితాల్లో కొల్లాపూర్, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి మండలాల్లో ఊహించిన విధంగా పార్టీ బీఫారాలు పొందిన అభ్యర్థులు గెలిచారు. కోడేరులో మాత్రం టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ గెలిచినప్పటికీ ఎంపీటీసీ ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. ఈ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థులు మూడు స్థానాల్లో గెలువగా, జూపల్లి వర్గీయులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. ఈ మండలంలో ఎంపీపీ పదవి దక్కించుకునేందుకు ఎమ్మెల్యే, మాజీమంత్రి ఇద్దరూ తమ వ్యూహాలకు పదును పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఎంపీపీ పదవులు మాజీమంత్రి వర్గానికి, కొల్లాపూర్ మండలం ఎమ్మెల్యే వర్గానికి దక్కనున్నాయి. జెడ్పీటీసీలుగా ఎమ్మెల్యే వర్గం నాయకులు రెండు చోట్ల, మాజీ మంత్రి వర్గం నాయకులు రెండుచోట్ల విజయాలు సాధించారు.
రెండో విడతల్లో ఎమ్మెల్యే వర్గం హవా..
పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో రెండోదశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మాజీ మంత్రి జూపల్లి వర్గీయులు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. మూడు మండలాల్లో ఎమ్మెల్యే వర్గానికి చెందిన టీఆర్‌ఎస్ అభ్యర్థులే జెడ్పీటీసీలుగా విజయం సాధించారు. పాన్‌గల్, చిన్నంబావి మండలాల్లో ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలిచారు. వీపనగండ్ల మండలంలో మాత్రం మాజీ మంత్రి వర్గం నాయకులు మెజార్టీ స్థానాల్లో ఎంపీటీసీలుగా గెలిచారు. ఈ మండలంలో కూడా పార్టీ అభ్యర్థినే ఎంపీపీ చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారు. కోడేరు, వీపనగండ్ల మండలాల్లో ఎంపీపీ పదవుల్లో తమ అనుచరులను కూర్చోబెట్టేందుకు రెండు వర్గాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మాజీమంత్రి వర్గం నాయకులు ఇప్పటికే పలువురు ఎంపీటీసీలను క్యాంపునకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment