సోమవారం టీఆర్‌ఎస్ భవన్‌లో పార్టీ కార్యవర్గ సభ్యుల భేటీలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే రాబోతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 175 సీట్లకు మించి రావని, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమికి గరిష్టంగా 120 సీట్లే వస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలోని 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ 100కు 100% గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల బలంతో కేంద్రంలో టీఆర్‌ఎస్‌కు 4 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌ల చైర్‌పర్సన్, అన్ని ఎంపీపీల అధ్యక్ష పదవులను గెలుచుకోవడం లక్ష్యంగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన.. పార్టీ రాష్ట్ర కార్యవర్గ కీలక సమావేశం సోమవారం తెలంగాణభవన్‌లో జరిగింది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులు కలిపి దాదాపు 450 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిషత్ ఎన్నికల్లో తిరుగులేని గెలుపు లక్ష్యంగా పని చేయాలని సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఐదేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన, అభివృద్ధిలో తెలంగాణ పురోగమనం, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ధీమా, అన్నిసార్లు అండగా నిలుస్తున్న ప్రజలకు చేయాల్సిన బాధ్యత, స్థానిక సంస్థలో సుపరిపాలన, అవినీతి వ్యవస్థల ప్రక్షాళన, టీఆర్‌ఎస్ నేతలందరికీ రాజకీయ అవకాశాలు.. ఇలా వివిధ అంశాలపై కేసీఆర్ రెండున్నర గంటలపాటు మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం అంశాలు ఆయన మాటల్లోనే..
సుస్థిరమైన ప్రభుత్వంతోనే!
ప్రభుత్వం బాగుంటేనే... మనం బాగుంటాం. ఉద్యమాలతో ఏర్పడిన కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రభుత్వ సుస్థిరతే ఇందుకు ప్రధాన కారణం. కరెంటు వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. శాంతిభద్రతల విషయంలోనూ ఇదే పరిస్థితి. గుడుంబా, పేకాట అనేవి పూర్తిగా లేకుండా పోయాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తే ఏదైనా సాధ్యమని స్పష్టమైంది. రాష్ట్రంలో ఇన్ని ఎన్నికలు జరిగినా ఎక్కడా చిన్న సమస్య కూడా రాలేదు. తెలంగాణలోని శాంతిభద్రల పరిస్థితికి ఇదే నిదర్శం. మిషన్ భగీరథ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం. దీనికోసం దాదాపు 7వేల రకాల అనుమతులు తీసుకున్నాం. వ్యవసాయరంగంలో అభివృద్ధి సాధించాం. జటిలమైన భూ–రికార్డుల ప్రక్షాళన పూర్తి చేశాం. దేశంలోనే ఆదర్శంగా నిలిచే రైతుబంధు, రైతుబీమా పథకాలు తెచ్చాం.
రాష్ట్రంలో 75 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశాం. అవి కోటిన్నరకు పెరిగాయి. పేదరికంతో ఉన్న ఒక సమాజానికి ఇది ఎంతో ఊరట ఇచ్చింది. మాంసాన్ని దిగుమతి చేసుకునే రాష్ట్రం ఇప్పుడు ఎగుమతి చేస్తోంది. మత్స్య పరిశ్రమలో గణనీయమైన అభివృద్ధి నమోదైంది. ఈ వృత్తిని నమ్ముకున్న జాతిని పైకి తీసుకొచ్చాం. ఆత్మహత్యలు చేసుకునే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాం. గతంలో నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులకు చేయూతనిచ్చాం. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అత్యంత వెనుకబడిన కులాల సంస్థ (ఎంబీసీ)ను ఏర్పాటు చేశాం. దీంతో వెనుకబడిన కులాల అభ్యున్నతి జరుగుతోంది. మిషన్ కాకతీయతో 35వేల చెరువులను అభివృద్ధి చేశాం. మిగిలిన చెరువుల అభివృద్ధి ప్రక్రియ కొనసాగుతుంది. మూడు వేలకుపైగా తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి ఎస్టీ వర్గాలకు స్వపరిపాలన కల్పించాం. ఇలా అన్ని వర్గాలకు కోసం మనం చేస్తున్న ప్రయత్నాలతో ప్రజల ఆదరణ పొందుతున్నాం.
రాజకీయ ప్రక్షాళన జరగాలి
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి దీవించారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లనూ మనమే గెలుచుకోబోతున్నాం. ప్రజలు అన్నిసార్లూ మనల్నే గెలిపిస్తున్నారు. ఇక రాజకీయ ప్రక్షాళన జరగాలి. రాజకీయ వృత్తికి, రాజకీయ నేతలకు గౌరవం ఉండాలి. అందరం కలిసి ఇలాంటి పరిస్థితి తీసుకురావాలి. మంచివాళ్లకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలి. చాలా పదవులున్నాయి. పార్టీలో అందరికీ అవకాశాలొస్తాయి. రాజ్యసభ, ఎమ్మెల్సీ, 32 జెడ్పీ చైర్మన్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పదవులు చాలా ఉన్నాయి. అందరికీ అవకాశాలు వస్తాయి.
ఎమ్మెల్యేలకు ఎన్నికల బాధ్యతలు
రాజకీయాల్లో మంచివాళ్లను, ఉద్యమకారులను కాపాడుకుందాం. వీరికి అవకాశాలు కల్పిద్దాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీ–ఫారాలు ఇచ్చే అధికారాన్ని ఎమ్మెల్యేలకు ఇస్తున్నా. ఎమ్మెల్యేలను నేను ఒక్కటే కోరుతున్నా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచివాళ్లకు, పార్టీ విధేయులకు అవకాశం ఇవ్వాలి. ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీని జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నా. అన్ని సీట్లు గెలుచుకునేలా, పార్టీ కోసం పని చేసే వారికి అవకాశాలు ఇవ్వాలి.
లంచం బంద్ కావాలె!
ప్రజలకు ఎప్పుడూ గందరగోళం (కన్ఫూజన్) ఉండదు. రాజకీయ పార్టీలు వారిని గందరగోళానికి గురి చేస్తాయి. ప్రజలు పూర్తి స్పష్టతతో ఉన్నారు. మన ప్రభుత్వ పనితీరును ప్రజలు ఆదరిస్తున్నారు. వారికి ఇబ్బందిలేని పరిపాలన జరగాలి. రాజకీయ పార్టీలను, రాజకీయ నేతలను భ్రష్టుపట్టిస్తున్న వ్యవస్థలను మార్చాలి. స్థానికంగా రెవెన్యూ, మున్సిపల్ వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయి. ఈ రెండు శాఖలు.. పనుల కోసం వచ్చే ప్రజల్ని జలగల్ని పీల్చినట్లుగా చేస్తున్నాయి. వీటిని మచ్చలేని శాఖలుగా తీర్చిదిద్దాలి. రెవెన్యూ శాఖలో లంచాలు బంద్ కావాలె. అందు కోసం కఠినమైన చట్టాలను తీసుకువస్తున్నాం. పరిషత్ ఎన్నికలు ముగిశాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రెండు చట్టాలను తీసుకువస్తాం. ఎన్నికలు కోడ్ ముగిశాక పోడు భూముల సమస్యలను పరిష్కరించుకుందాం. నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి వీటిని పరిష్కరించేలా చేస్తా.
జూన్‌లో మున్సిపల్ ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుందాం. ప్రత్యేకంగా సమావేశాలు జరిపి పటిష్టమైన రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను అమల్లోకి వచ్చేలా చేద్దాం. కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చిన పదిహేను రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి.
పని చేయని సర్పంచ్‌లపై వేటు
కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకున్నాం. పటిష్టమైన ఈ చట్టంతో అక్రమాలకు ఆస్కారం ఉండదు. పనిచేయని సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటాం. ఎన్నికల కోడ్ ముగియగానే ఇలాంటి కొందరు సర్పంచ్‌ల పవర్‌ను తగ్గిస్తాం. ఇక్కడ అందరు ఉన్నారని చెబుతున్నా. పని చేయని సర్పంచ్‌లపై వేటేస్తే ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అడ్డురావద్దు. ప్రజలకు పూర్తి అవినీతి రహితపాలనను అందించాలి. దీని కోసం మీరంతా సహకరించాలి.
శ్మశాన వాటిక తప్పనిసరి
ఐదేళ్లలో అద్భుతమైన గ్రామాభివృద్ధి జరగాలి. గ్రామాలు మెరవాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా నిధులు ఇస్తాయి. గ్రామపంచాయతీ నిధులు, ఉపాధి హామీ, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నియోజకవర్గాల నిధులు వస్తాయి. ఇవన్నీ కలిపి ఐదేళ్లలో దాదాపు రూ.56 వేల కోట్ల నిధులు గ్రామీణాభివృద్ధి కోసం అందుబాటులోకి వస్తాయి. నాలుగు రకాల నిధుల వినియోగంలో సమన్వయం ఉండాలి. గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిధులను ప్రణాళికబద్ధంగా సమన్వయంతో అభివృద్ధి కోసం వినియోగించుకోవాలి. అన్ని స్థాయిల్లోని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి సాధించాలి. ప్రతి గ్రామ పంచాయతీలో కచ్చితంగా శ్మశానవాటికను నిర్మించాలి. ప్రభుత్వ స్థలం లేని గ్రామాల్లో.. గ్రామపంచాయతీ నిధులతో ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి నిర్మాణం పూర్తి చేయాలి. గ్రామ పంచాయతీల్లో మెరుగైన పాలన కోసం 10వేల మంది కార్యదర్శులను నియమించాం. మూడేళ్లపాటు అప్రెంటిస్ ఉంటుంది. మంచిగా పని చేసేవారే ఉంటారు. మిగిలిన వారిని పంపించేస్తాం.
కేంద్రంలో కీలకపాత్ర
ఎన్డీయే కూటమికి 175 సీట్లు దాటవు. కాంగ్రెస్ 100–120 సీట్ల మధ్య ఉంటుంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. 16 లోక్‌సభ స్థానాలను మనమే గెలుచుకుంటున్నాం. 100కు 100% ఇదే జరగబోతోంది. జేడీయూ, అకాలీదళ్ వంటి పార్టీలు ఇప్పటికే మనతో చర్చలు జరుపుతున్నాయి. లోక్‌సభ సభ్యులతోపాటు మొత్తం 7 రాజ్యసభ స్థానాలు త్వరలో మన పార్టీకే వస్తాయి. కేంద్రంలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషించబోతోంది. కేంద్రంలో 3,4 మంత్రి పదవులను తీసుకోబోతున్నాం. రెండు క్యాబినెట్, రెండు సహాయ మంత్రులు మనకొచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రాభివృద్ధి ఇంకా బాగా జరుగుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. రాష్ట్ర మంత్రివర్గంలోని సభ్యుల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుంది. పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు భర్తీ చేసుకోవచ్చు.
టీఆర్‌ఎస్ ప్లీనరీ లేదు
స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున ఈసారి టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం (ఏప్రిల్ 27) నాడు ఎలాంటి భారీ కార్యక్రమాలు ఉండవు. ఎన్నికలతో హడావిడి ఉంటుంది. ప్రతిఏటా నిర్వహించే టీఆర్‌ఎస్ ప్లీనరీ ఈసారి ఉండదు. ఏప్రిల్ 27న అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ జెండాలు ఎగురవేసి స్థానికంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.
ఎమ్మెల్యేలకు శిక్షణ
ప్రజలకు మంచి పాలన అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. అధికారులతోనే పూర్తిగా పాలన జరుగుతుందనేలా ఉండొద్దు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తాం. అన్ని అంశాలపై అందరికీ అవగాహన ఉండాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలన సాగించాలి.
ఇద్దరు చైర్‌పర్సన్ అభ్యర్థుల పేర్లు ప్రకటన
టీఆర్‌ఎస్ తరుపున రెండు జడ్పీలకు చైర్మన్ అభ్యర్థులపై కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీకి ఆ జిల్లా చైర్‌పర్సన్‌గా అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. సమావేశం అనంతరం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సీఎం దగ్గరికి వెళ్లి నమస్కారం చేశారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా మధుకు కేసీఆర్ చెప్పారు. ‘జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రచారం చేసుకో. ఇప్పటికే మంత్రి ఈటలకు చెప్పాను. మంచిగా పని చేసుకో’అని మధుకు సీఎం సూచించారు.
పరిషత్ ఎన్నికలకు ఇంచార్జీలు...
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో సమన్వయం కోసం అన్ని జిల్లాలకు పార్టీ ఇంచార్జీలను నియమిస్తున్నట్లు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మంత్రులకు, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు జిల్లా బాధ్యతలను అప్పగించారు. పలువురు మంత్రులకు రెండు, మూడు జిల్లాల బాధ్యులుగా నియమించారు. నిర్మల్/ఆసిఫాబాద్/మంచిర్యాల: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వరంగల్ అర్బన్/వరంగల్ రూరల్/మహబూబాబాద్: ఎర్రబెల్లి దయాకర్‌రావు, కరీంనగర్/పెద్దపల్లి: ఈటల రాజేందర్, జగిత్యాల/పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్, మహబూబ్‌నగర్/నారాయణపేట: వి.శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి/గద్వాల: ఎస్.నిరంజన్‌రెడ్డి, నిజామాబాద్/కామారెడ్డి: వేముల ప్రశాంత్‌రెడ్డి, మెదక్/సిద్దిపేట: తన్నీరు హరీశ్‌రావు, యాదాద్రిభువనగిరి/జనగామ: పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మేడ్చల్: సీహెచ్ మల్లారెడ్డి, సూర్యాపేట: జగదీశ్‌రెడ్డి, నల్లగొండ: తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఆదిలాబాద్: జోగు రామన్న, సంగారెడ్డి: శేరి సుభాష్‌రెడ్డి, నాగర్‌కర్నూల్: పి.రాములు, రంగారెడ్డి: అంజయ్యయాదవ్, ఖమ్మం: శ్రావణ్ కుమార్‌రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం: సత్యవతిరాథోడ్, భూపాలపల్లి/ములుగు: గ్యాదరి బాలమల్లు. వికారాబాద్: పట్నం మహేందర్‌రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment