శివాలయాల్లో కార్తీక శోభ
బద్వేలు అర్బన్ : కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని పట్టణ పరిధిలోని పలు శివాలయాలు భక్తులతో
కిటకిటలాడాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాలకు వెళ్లి కార్తీకమాస ప్రత్యేక పూజలు వైభవంగా
నిర్వహించారు. ఆయా ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు.
కార్తీకమాసంలో చేసే పూజాఫలం వలన భక్తులకు కష్టాలు తీరి కోరికలు నెరవేరుతాయనే నమ్మకం భక్తులలో
మెండుగా ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు శివాలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా రూపరాంపేట శివానందస్వామి ఆలయం, నాగులచెరువుకట్ట శివాలయం, దత్తసాయిబాబా ఆలయ
ప్రాంగణంలోని ఓంకారేశ్వరస్వామి ఆలయం, అనంతగిరి క్షేత్రంలోని మృత్యుంజయేశ్వర ఆలయం చెన్నంపల్లె
ఆదిచెన్నకేశవస్వామి, చింతలచెరువు సమీపంలోని అతి పురాతన మామిడికోనయ్య ఆలయాలు భక్తులతో
కిటకిటలాడాయి. ఆయా ఆలయకమిటి సభ్యులు భక్తులకు తీర్థ, ప్రసాదాలు పంపిణీ చేశారు.
కలసపాడు: ఆదివారం దీపావళి ..సోమవారం కార్తీక మాసం ప్రారంభం..కరువుతో అల్లాడి పోతున్న మండలంలో
దీపాల కాంతులత్తో దీపావళి..శివునికి అభిషేకాలతో కార్తీక సోమ వారం ఘనంగా నిర్వహంచారు. కార్తీక మాసం
ప్రారంభం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయ్యప్ప భక్తులు కార్తీక మాసం ప్రారంభమైన రోజుననే 40 మంది
వ్యక్తులు స్థానిక ఉమామహేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మాలధారణ
గావించారు. ఉదయం 6 గంటలకు భక్తులు శివాలయం తరలివెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు
చేశారు.గణపతి పూజ, రుద్రాభిషేకం, పార్వతీదేవికి కుంకుమార్చన తదితర కార్యక్రమాలు చేశారు. స్వామివారికి
కాయ కర్పూరం సమర్పించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.