భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల ఆలయ ప్రధాన దారి
సాక్షి, అమరావతి/శ్రీకాళహస్తి రూరల్/శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా)/శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి వేడుకలకు రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఉత్సవాల నేపథ్యంలో దేవదాయ శాఖ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఉత్సవ మూర్తులతో పాటు ఆలయాలను పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, ప్రత్యేక కమిషనర్ అర్జునరావు వారం రోజుల్లో రెండు విడతలు ఆలయాల ఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి, చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పారిశుధ్యం, కరోనా నియంత్రణ చర్యలపై ఆలయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దర్శనాలకు వచ్చే భక్తులు మాస్కు ధరించడం తప్పనిసరి చేశారు. పండుగ రోజున 25 వేల మందికి భక్తులు వచ్చే అవకాశం ఉన్న ఆలయాల్లో ప్రత్యేకించి అదనపు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క ఆలయంలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించారు. భక్తుల మధ్య భౌతికదూరం, తాగునీటి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆలయాల వద్ద కోనేరుల్లో పూర్తి స్థాయి క్లోరినేషన్ చేశారు.
హంసవాహనంపై ఆదిదేవుడు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ బహుళ ద్వాదశిని పురస్కరించుకుని బుధవారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంసవాహనంపై విహరించారు. ఉదయం హంస–చిలుక వాహనాల్లో పార్వతీపరమేశ్వరులు పురవీధుల్లో విహరించారు. రాత్రి కైలాసపతి శేష వాహనంపై చిది్వలాసంతో భక్తులకు ఆభయ ప్రదానం చేశారు.
శివరాత్రి జాగరణకు జంగమయ్య క్షేత్రం సిద్ధం
వాయులింగక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని జాగరణకు ఏర్పాట్లను పూర్తి చేశారు. మూగజీవాలైన సాలెపురుగు, సర్పం, ఏనుగు శివుని ప్రార్ధించి ముక్తిని పొందిన క్షేత్రమే శ్రీ–కాళ–హస్తి. దక్షిణ కైలాసంగా ప్రాచుర్యం పొందిన ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తారు.
శివయ్యకు పట్టువ్రస్తాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి దంపతులు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు బుధవారం పట్టువ్రస్తాలను సమర్పించారు. ఆయనకు ఆలయ అధికారులు త్రినేత్ర అతిథి గృహం వద్ద స్వాగతం పలికారు. అతిథి గృహం నుంచి పట్టు వ్రస్తాలను తలమీద పెట్టుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. వ్రస్తాలను మంత్రి ఆలయ అలంకార మండపంలో ప్రధాన అర్చకులకు అందజేయగా, వారు ఉత్సవమూర్తులకు అలంకరించారు. కాగా, ఆలయ ఏకశిలా ధ్వజస్తంభంపై ఉన్న సూక్ష్మ నందికి ఎమ్మెల్యే బియ్యపుమధుసూదన్‌రెడ్డి బంగారుతాపడం వేయించారు. బుధవారం ఆలయంలో బంగారు సూక్ష్మనందికి మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి ఆలయానికి అందజేశారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శివయ్యను వేడుకున్నానని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. పట్టు వస్త్రాలు సమర్పించాక విలేకరులతో మాట్లాడుతూ.. వర్షాలు బాగా కురిసి ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నానన్నారు.
గజ వాహనంపై మల్లన్న దర్శనం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు బుధవారం రాత్రి శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబదేవి సమేతంగా గజవాహనంపై ఊరేగారు. స్వామిఅమ్మవార్ల వైభవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో ఉత్సవమూర్తులను గజవాహనంపై ఆశీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజవాహనా దీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్నకు గురువారం రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ, 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి లక్షల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతం గుండా తరలివస్తున్న శివస్వాములతో పాటు ఇప్పటికే క్షేత్రానికి చేరుకున్న భక్తులతో శ్రీగిరి కిటకిటలాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment