‘ఖని’ ప్రభుత్వాస్పత్రి పరిశీలన
కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని కేంద్ర ‘కాయకల్ప’ కార్యక్రమం ప్రతినిధుల బSృందం మంగళవారం పరిశీలించింది. మెరుగైన వైద్య సేవలతోపాటు పరిశుభ్రత పాటిస్తున్న ఆస్పత్రులకు కేంద్రం ‘కాయకల్ప’ పథకం ద్వారా పోటీలు నిర్వహించి ఎక్కువ మార్కులు వచ్చిన వాటికి ప్రోత్సాహక బహుమతులు అందిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఏరియా ఆస్పత్రిని కాయకల్ప ప్రతినిధులు రవినాయుడు, నాగరాజు, తులసి రవీందర్, మారుతిరావు సందర్శించారు. ఐసీయూ, ఎస్‌ఎన్‌సీయూ, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ప్రసూతీ వార్డులు, లేబర్ రూం, ఎక్స్‌రే, ఏఆర్‌టీ, బ్లడ్‌స్టోరేజీ, బాత్‌రూంలు, ఆస్పత్రి పార్క్‌తోపాటు ఆవరణను పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి వైద్యసేవలు అందిస్తున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులతో కూడా మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆరు ఆస్పత్రులను పరిశీలించినట్లు చెప్పారు. ఈనెల 15లోపు నివేదికలను కేంద్ర కాయకల్ప విభాగానికి అందజేస్తామని వెల్లడించారు. గోదావరిఖని ప్రభుత్వాస్పత్రి నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యశ్రీరావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.