పరకాల: రెండేళ్ల హయాంలో తన పరిపాలనా దక్షతతో కేసీఆర్ దేశంలోనే బెస్ట్ సీఎం అనిపించుకున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో రూ.4.60 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కడియం మాట్లాడుతూ.. రూ. 25 వేల కోట్లతో మిషన్ కాకతీయ పనులను చేపట్టి కాకతీయులు, నిజాం కాలం నాటి చెరువులు, కుంటలను అభివృద్ధి చేస్తున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు.
మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామానికీ తాగునీరందించేలా కృషి చేస్తున్నారని చెప్పారు. 2018 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు అందుతుందని, లేకుంటే ఎన్నికల్లో ఓటు అడగబోమని కేసీఆర్ ధైర్యంగా చెప్పారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల వారు వీలైతే తెలంగాణకు వెళ్లి చూడాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆరు నెలల్లో 2.60 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు.