
కేటీఆర్ కు, అధికారులకు కేసీఆర్ ఆదేశాలు
నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు నేడు మూడో రోజుకు చేరుకుంది. నాలాలపై అక్రమ కట్టణాల కూల్చివేత, అభివృద్ధిపై సీఎం కేసీఆర్ బుధవారం రాత్రి సమీక్షించారు. నగర అభివృద్ధికి బ్యాంకర్ల నుంచి ఆర్థిక సహాయం తీసుకోవాలని, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పురపాలకశాఖ, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ను, సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ లో అత్యవసరంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపట్టిందని తెలిపారు. బ్యాంకర్లలో విశ్వాసం ఏర్పడి రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చారని వెల్లడించారు. హైదరాబాద్ నగరం వ్యాపార రంగంలో ఇంకా అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను రుణాల కోసం సంప్రదించి పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని కేటీఆర్ కు, అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఎప్పటికప్పుడూ మంత్రి కేటీఆర్ కూడా అధికారులతో సమీక్ష చేస్తూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.