బుజ్జాయిని బలిగొన్న బకెట్
విజయవాడ (మధురానగర్) : తన బుజ్జిబుజ్జి మాటలతో ఆ ఇంట వెలుగులు పండించిన బుజ్జాయిని రక్కసి బకెట్ బలితీసుకుంది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ తిరిగిన తన మూడేళ్ల చిన్నారికి అంతలోనే నూరేళ్లు నిండిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. స్థానిక మధురానగర్ వీవీ నరసరాజు రోడ్డుకు చెందిన మజ్జి గణేష్ దంపతులకు ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె కీర్తనకు మూడేళ్లు. ఇటీవలే జన్మదిన వేడుకలు జరుపుకొంది. బుధవారం ఉదయం అందరూ పన్నుల్లో ఉండగా, కీర్తన ఇంటి బయట నీటితో నిండిన బకెట్ వద్దకు వెళ్లింది. అక్కడే ఆడుకుంటూ కొద్దిసేపటికి బకెట్‌లోకి వంగి పడిపోయింది. ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక కీర్తన చనిపోయింది. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు చెప్పడంతో తల్లిదండ్రులు గమనించారు. అయితే, కీర్తన అప్పటికే చనిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ఆత్కూరి రవికుమార్, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు పీవీఆర్, ఉపాధ్యక్షుడు మహాలక్ష్మయ్య తదితరులు కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించారు.