ఏలూరు : ప్రజలు అప్రమత్తమై కిడ్నాపర్ల బారి నుంచి ఓ వ్యక్తిని రక్షించారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... రాజమండ్రికి చెందిన ఎ.సతీశ్ అనే వ్యక్తి ఓఎన్జీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో నిందితుడు. అయితే అతడు కోర్టులో పని నిమిత్తం మంగళవారం ఉదయం ఏలూరుకు పయనమైయ్యాడు. ఆ క్రమంలో ఏలూరు నగరంలోని ఆశ్రమ్ జంక్షన్ బస్స్టాప్ వద్ద సతీశ్ బస్సు దిగాడు.
అప్పటికే అక్కడ కాపు కాసి ఉన్న కిడ్నాపర్లు సతీశ్ను బెదిరించి కారులో ఎక్కించారు. అనంతరం కారులో వెళ్తున్న అతడు బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై... కారును బైక్లతో వెంబడించారు. అంతలో దెందులూరు మండలం కొవ్వలి గ్రామస్తుల సాయంతో గ్రామస్తులు కారును అడ్డుకున్నారు. దీంతో కిడ్నాపర్లు కారు వదిలి పరారైయ్యారు. గ్రామస్తులు కిడ్నాపర్లను వెంబడించారు. ఓ కిడ్నాపర్ని గ్రామస్తులు పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన కిడ్నాపర్ని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.