
ప్రభుత్వాస్పత్రిలో కింగ్ కోబ్రా పిల్లలు!
చిత్తూరు: జిల్లాలోని ప్రధాన వైద్యశాలలోకి శనివారం తాచుపాములు రావడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రిలోని మెడికల్ వార్డులో గత మూడు రోజులుగా నల్లతాచుపాము(కింగ్ కోబ్రా) తిరుగుతోందని రోగులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. వారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారు. అయితే శనివారం మధ్యహ్నాం సమయంలో ఆసుపత్రిలోని టాయిలెట్ నుంచి తాచుపాము పిల్లలు బయటికివచ్చాయి.
దీంతో ఒక్కసారిగా హడలిపోయిన రోగులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమయిన ఆసుపత్రి సిబ్బంది పాము పిల్లల్ని చంపేశారు. మరికొద్దిసేపటి తర్వాత మరో నాలుగు తాచుపాము పిల్లలు వార్డులోకి వచ్చాయి. దాంతో అక్కడే పడకలపై ఉన్న వాళ్లంతా వార్డు నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న సిబ్బంది మళ్లీ పాము పిల్లల్ని చంపి, దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాములు, ఎలుకలు కారణంగా రోగులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.