ఇక కిరోసిన్ కనుమరుగే
– జూన్ తర్వాత పంపిణీ నిలిపివేత
– వందశాతం గ్యాస్ కనెక‌్షన్లు
– మౌఖికంగా వెలువడిన ఆదేశాలు
– ఏడాదికి రూ.21.95 కోట్లు ప్రభుత్వానికి మిగులు
అనంతపురం అర్బన్ : చౌక దుకాణాల ద్వారా తెల్లకార్డుదారులకు పంపిణీ చేస్తున్న నీలి కిరోసిన్ కనుమరుగు కానుంది. ఈ ఏడాది జూన్ తరువాత పంపిణీ నిలిపివేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఈలోపు దీపం, సీఎస్‌ఆర్ (కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) ఉజ్వల పథకం ద్వారా ప్రతి కార్డుదారుడికీ వంట గ్యాస్ కనెక‌్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు మౌఖికంగా ఆదేశాలు వెలువడ్డాయి. కిరోసిన్ పంపిణీ నిలిపివేయడం ద్వారా జిల్లా నుంచి ఏడాదికి రూ.21.96 కోట్ల మేర ప్రభుత్వానికి మిగులుతుంది.
జిల్లాలో 9.63 లక్షల లీటర్లు పంపిణీ
జిల్లాలో 11.96 లక్షల కార్డులు ఉన్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో గ్యాస్ కనెక‌్షన్ లేని కార్డుదారులకు నాలుగు లీటర్ల కిరోసిన్ ఇస్తారు. సింగిల్ సిలిండర్ ఉంటే రెండు లీటర్లు ఇస్తారు, మునిసిపాలిటీలు, మండలాల్లో గ్యాస్ కనెక‌్షన్ లేకపోతే రెండు లీటర్లు, ఉంటే ఒక లీటరు ఇస్తారు. డబుల్ సిలిండర్ ఉంటే పూర్తిగా ఇవ్వరు. ప్రస్తుతం జిల్లాలో 9,63,143 లీటర్ల కిరోసిన్‌ను కార్డుదారులకు లీటరు రూ.19 ప్రకారం పంపిణీ చేస్తున్నారు. నీలి కిరోసిన్ పంపిణీ నిలిపివేస్తే రూ.21.96 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుంది.
జిల్లాలో 9.87 లక్షలు గ్యాస్ కనెక‌్షన్లు
జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం 9,87,236 కుటుంబాలకు వంట గ్యాస్ కనెక‌్షన్లు ఉన్నాయి. ఇందులో సాధారణ కనెక‌్షన్లు 5,24,294, దీపం కనెక‌్షన్లు 4,21,067, సీఎస్‌ఆర్ కనెక‌్షన్లు 39,225, ఉజ్వల కనెక‌్షన్లు 2,650 ఉన్నాయి. మరో 1.50 లక్షల కనెక‌్షన్లు ఇవ్వాల్సి ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
గ్యాస్ కనెక‌్షన్లు ఇవ్వలేకపోతే...
జూన్‌లోపు కిరోసిన్ పంపిణీని ప్రభుత్వం నిలుదపుదల చేస్తే... ఈ లోపు వంద శాతం గ్యాస్ కనెక‌్షన్లు ఇవ్వడంలో అధికార యంత్రాగం విఫలమైతే... కార్డుదారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గ్యాస్ లేక...అటు కిరోసిన్ అందని పరిస్థితి నెలకొంటుంది.
చర్యలు వేగవంతం చేశాం
ప్రతి కుటుంబానికీ గ్యాస్ కనెక‌్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. సీఎస్‌డీటీలు, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, డీలర్లను భాగస్వాముల్ని చేశాం. గ్యాస్ కనెక‌్షన్ లేని, ఉన్న కుటుంబాల వివరాలు, గ్యాస్ కనెక‌్షన్ ఉండి కార్డులో నమోదు కాని, గ్యాస్ కనెక‌్షన్ లేకపోయినా కార్డులో నమోదై ఉంటే... అలాంటి వారి వివరాలు సేకరించాలని చెప్పాం. ఒకే కుటుంబంలో రెండు కార్డులు ఉండి, ఒక కనెక‌్షన్ ఉంటే... రెండో కనెక‌్షన్ అవసరం లేదనుకునే వారి వివరాలను తీసుకోల్సి ఉంటుంది. కార్డు ఉన్న ఒంటరి పురుషుల వివరాలను తీసుకురావాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా ప్రతి ఒక్కరికీ కనెక‌్షన్ ఇస్తాం.
– శివశంకర్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి