kirosin bundh
-
ఇక కిరోసిన్ బంద్!
– జూన్‌లో రేషన్ డీలర్లకు కోటాలో 20 శాతం సరఫరా – ఈ నెల నుంచి పూర్తిగా ఎత్తేస్తున్న వైనం తెల్లకార్డులు– 11.92 లక్షలు గులాబీ కార్డులు– 80 వేలు మొత్తం కార్డులు– 12.72 లక్షలు గ్యాస్ కనెక్షన్లు– 11.37 లక్షలు గ్యాస్ కనెక్షన్ లేని వారు– 1.35 లక్షలు అనంతపురం అర్బన్ : రేషన్ కార్డులకు నీలి కిరోసిన్ పంపిణీని జూలై నుంచి ప్రభుత్వం బంద్ చేసింది. జూన్‌కు సంబంధించి డీలర్లకు కేటాయించిన కోటాలో కేవలం 20 శాతం మాత్రమే సరఫరా చేసినట్లు తెలిసింది. అదీ కూడా మేలో కిరోసిన్ హోల్‌సేల్ డీలర్ల వద్ద మిగులు సరుకును డీలర్లకు అధికారులు సర్దుబాటు చేసినట్లు తెలిసింది. ఈ కొద్ది సరుకును కార్డుదారులకు ఎలా పంపిణీ చేయాలో దిక్కుతోచక పలువురు డీలర్లు ఇబ్బంది పడ్డారు. కాగా చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సరుకులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తున్న ప్రభుత్వం వైఖరిని గమనిస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ బాధ్యతల నుంచి తప్పుకో చూస్తోందనేది స్పష్టమవుతోంది. ఒకొక్కటిగా కోత తెల్లకార్డుదారులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు చౌక దుకాణాల నుంచి పంపిణీ చేస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి రాగానే ఒక్కో సరుకునూ కోత పెడుతూ వస్తోంది. గతంలో బియ్యంతో పాటు పామాయిల్, చక్కెర, కందిపప్పుతో పాటుగా చింతపండు, ఉప్పు, కారం, పసుపు కూడా పంపిణీ చేసేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిగా పామాయిల్, అటు తరువాత చింతపండు, ఉప్పు, కారం, పసుపు పంపిణీ నిలిపివేసింది. ఆ తరువాత కందిపప్పు, గత నెలలో చక్కెర, ఈ నెలలో కిరోసిన్... ఇలా ఒక్కొక్కటిగా మూడేళ్లలో తొలగించింది. ప్రస్తుతం బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తున్నారు. బియ్యానికి కూడా త్వరలో మంగళం పాడే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. గ్యాస్ కనెక్షన్ లేనివారి పరిస్థితి? కిరోసిన్ పంపిణీ బంద్ చేయడంతో గ్యాస్ కనెక్షన్ లేని పేదల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి వారు కట్టెల పొయ్యిపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. పొగరహిత జిల్లాగా మారుస్తామని చెబుతున్న అధికారులకు ఇదెలా సాధ్యమో తెలియాలి. జిల్లాలో గ్యాస్ లేని తెల్లకార్డుదారులకు దీపం పథకం కింద 1.50 లక్షల కనెక్షన్లు మంజూరు చేసి వంద శాతం లక్ష్యం పూర్తిచేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష మందికి గ్యాస్ కనెక్షన్ లేనట్లు సమాచారం. జిల్లాలో 11.92 లక్షలు తెల్ల కార్డులు ఉన్నాయి. పింక్ కార్డులు 80 వేలు ఉన్నాయి. అంటే జిల్లాలో మొత్తం 12.72 లక్షల కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో11,37,236 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సాధారణ కనెక్షన్లు 5,24,294, దీపం కనెక్షన్లు (కొత్తగా మంజూరు చేసిన వాటితో కలిపి) 5,31,067, సీఎస్ఆర్ (కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) 39,225, ఉజ్వల పథకం కనెక్షన్లు 2,650 ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 12.72 లక్షల కార్డులు ఉంటే గ్యాస్ కనెక్షన్లు 11.37 లక్షలు ఉన్నాయి. అంటే 1.35 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు లేవనేది స్పష్టమవుతోంది. -
పేదల బతుకులతో చెలగాటం
– ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యానికి ప్రభుత్వం కుట్ర – నిత్యావసర వస్తువులు ఒక్కొక్కటిగా తొలగింపు – ఆహార భద్రత చట్టానికి తూట్లు పొడుస్తున్న వైనం – త్వరలో బియ్యం పంపిణీకీ మంగళం – ఉపాధి కోల్పోనున్న 2,962 మంది డీలర్లు ఆహార భద్రత చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా చర్యలు చేపడుతూ బాధ్యతల నుంచి తప్పుకోజూస్తోంది. తెల్లకార్డుదారులకు ఇస్తున్న నిత్యావసర వస్తువులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ పేదల బతుకులతో చెలగాటం ఆడుతోంది. జూన్ నుంచి చక్కెర, కిరోసిన్ పంపిణీ నిలిపివేసేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. త్వరలో బియ్యం పంపిణీకీ మంగళం పాడనున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. - అనంతపురం అర్బన్ పేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ఆసరాగా ఉంటోంది. అయితే దీనిపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. పేదలు ఆహారం కోసం ఇబ్బంది పడకూదని 2013, సెప్టెంబరు 12న అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని పకడ్బందీగా అమలు చేసి పేదలకు అండగా నిలవాల్సిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ముందుకు పోతోంది. చౌక దుకాణాల ద్వారా ప్రస్తుతం బియ్యంతో పాటు చక్కెర, కిరోసిన్‌ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 11.92 లక్షలు తెల్లకార్డుదారులకు అరకేజీ చక్కెర పంపిణీ చేస్తున్నారు. గ్యాస్ లేని వారికి రెండు లీటర్లు, గ్యాస్ కనెక్షన్ ఉంటే ఒక లీటరు పంపిణీ చేస్తున్నారు. జూన్ నుంచి చక్కెర, కిరోసిన్ పంపిణీ బంద్ చేస్తున్నట్లు జిల్లా యంత్రానికి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో జూన్‌కు సంబంధించి బియ్యం కోటాకు మాత్రమే డీడీలు తీయాలని డీలర్లకు మౌఖికంగా అధికారులు ఆదేశాలిస్తున్నారు. తాజాగా బియ్యం పంపిణీ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకునేందుకు సిద్ధపడుతోంది. బియ్యం బదులుగా నగదుని కార్డుదారుల ఖాతాలో జమ చేÄయాలనేది ప్రభుత్వం ఆలోచన. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 11.92 లక్షల కార్డులకు 1.81 లక్షల క్వింటాళ్ల బియ్యం అందజేస్తున్నారు. బియ్యం పంపిణీ నిలిపివేసి.. కార్డుదారులకు కిలోకు రూ.25 చొప్పున డబ్బుల్ని బ్యాంక్ ఖాతాలో జమ చేయాలనే దిశగా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికారవర్గాల సమాచారం. ఉపాధి కోల్పోనున్న డీలర్లు జిల్లావ్యాప్తంగా 2,962 చౌక ధరల దుకాణాలు (స్టోర్లు) ఉన్నాయి. బియ్యం పంపిణీ నిలిపివేస్తే డీలర్లు పూర్తిగా ఉపాధి కోల్పోతారు. వీరు ఇప్పటి వరకు కమీషన్ తీసుకుని దుకాణాలు నడుపుతున్నారు. ఇప్పటికే కొన్ని సరుకులు పంపిణీ నుంచి తొలగించారు. జూన్ నుంచి చక్కెర, కిరోసిన్ బంద్ చేయనున్నారు. దీంతో వీటిపై వచ్చే కమీషన్ని డీలర్లు కోల్పోనున్నారు. బియ్యం కూడా బంద్ చేస్తే ఇక డీలర్లకు కమీషన్ పూర్తిగా పోతుంది. ఒక రకంగా చౌక దుకాణం మూతపడుతుంది. దీంతో డీలర్లందరూ వీధి పడాల్సి దుస్థితి నెలకొంటుంది. బియ్యం కొనుగోలు పేదలకు భారమే పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం రకం బహిరంగ మార్కెట్లో లభ్యం కావు. కేవలం సన్న బియ్యం లభిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం రూ.35 వరకు ఉంది. మునుముందు కిలో రూ.40 నుంచి రూ.45 వరకు పెరుగుతాయి. ప్రభుత్వం కిలోకు రూ.25 చొప్పున డబ్బులు ఇస్తే కిలో మీద రూ.10 నుంచి రూ.15 అదనంగా వెచ్చించి లబ్ధిదారుడు బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. జిల్లాలో 11.92 లక్షల కార్డులు ఉండగా యూనిట్లు (సభ్యులు) 35.64 లక్షల మంది ఉన్నాయి. సభ్యునికి నాలుగు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. ఈ లెక్కన కిలో మీద నెలసరి రూ.10 అదనం వేసుకున్నా నాలుగు కిలోల మీద రూ.40 అదనంగా వెచ్చించాల్సి వస్తుంది. ఈ ప్రకారం కార్డుదారులపై నెలసరి 14.25 కోట్లు భారం పడుతుందనేది స్పష్టమవుతోంది. -
ఇక కిరోసిన్ కనుమరుగే
– జూన్ తర్వాత పంపిణీ నిలిపివేత – వందశాతం గ్యాస్ కనెక్షన్లు – మౌఖికంగా వెలువడిన ఆదేశాలు – ఏడాదికి రూ.21.95 కోట్లు ప్రభుత్వానికి మిగులు అనంతపురం అర్బన్ : చౌక దుకాణాల ద్వారా తెల్లకార్డుదారులకు పంపిణీ చేస్తున్న నీలి కిరోసిన్ కనుమరుగు కానుంది. ఈ ఏడాది జూన్ తరువాత పంపిణీ నిలిపివేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఈలోపు దీపం, సీఎస్ఆర్ (కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) ఉజ్వల పథకం ద్వారా ప్రతి కార్డుదారుడికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు మౌఖికంగా ఆదేశాలు వెలువడ్డాయి. కిరోసిన్ పంపిణీ నిలిపివేయడం ద్వారా జిల్లా నుంచి ఏడాదికి రూ.21.96 కోట్ల మేర ప్రభుత్వానికి మిగులుతుంది. జిల్లాలో 9.63 లక్షల లీటర్లు పంపిణీ జిల్లాలో 11.96 లక్షల కార్డులు ఉన్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో గ్యాస్ కనెక్షన్ లేని కార్డుదారులకు నాలుగు లీటర్ల కిరోసిన్ ఇస్తారు. సింగిల్ సిలిండర్ ఉంటే రెండు లీటర్లు ఇస్తారు, మునిసిపాలిటీలు, మండలాల్లో గ్యాస్ కనెక్షన్ లేకపోతే రెండు లీటర్లు, ఉంటే ఒక లీటరు ఇస్తారు. డబుల్ సిలిండర్ ఉంటే పూర్తిగా ఇవ్వరు. ప్రస్తుతం జిల్లాలో 9,63,143 లీటర్ల కిరోసిన్‌ను కార్డుదారులకు లీటరు రూ.19 ప్రకారం పంపిణీ చేస్తున్నారు. నీలి కిరోసిన్ పంపిణీ నిలిపివేస్తే రూ.21.96 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుంది. జిల్లాలో 9.87 లక్షలు గ్యాస్ కనెక్షన్లు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం 9,87,236 కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సాధారణ కనెక్షన్లు 5,24,294, దీపం కనెక్షన్లు 4,21,067, సీఎస్ఆర్ కనెక్షన్లు 39,225, ఉజ్వల కనెక్షన్లు 2,650 ఉన్నాయి. మరో 1.50 లక్షల కనెక్షన్లు ఇవ్వాల్సి ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్యాస్ కనెక్షన్లు ఇవ్వలేకపోతే... జూన్‌లోపు కిరోసిన్ పంపిణీని ప్రభుత్వం నిలుదపుదల చేస్తే... ఈ లోపు వంద శాతం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంలో అధికార యంత్రాగం విఫలమైతే... కార్డుదారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గ్యాస్ లేక...అటు కిరోసిన్ అందని పరిస్థితి నెలకొంటుంది. చర్యలు వేగవంతం చేశాం ప్రతి కుటుంబానికీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. సీఎస్డీటీలు, వీఆర్ఓ, వీఆర్ఏ, డీలర్లను భాగస్వాముల్ని చేశాం. గ్యాస్ కనెక్షన్ లేని, ఉన్న కుటుంబాల వివరాలు, గ్యాస్ కనెక్షన్ ఉండి కార్డులో నమోదు కాని, గ్యాస్ కనెక్షన్ లేకపోయినా కార్డులో నమోదై ఉంటే... అలాంటి వారి వివరాలు సేకరించాలని చెప్పాం. ఒకే కుటుంబంలో రెండు కార్డులు ఉండి, ఒక కనెక్షన్ ఉంటే... రెండో కనెక్షన్ అవసరం లేదనుకునే వారి వివరాలను తీసుకోల్సి ఉంటుంది. కార్డు ఉన్న ఒంటరి పురుషుల వివరాలను తీసుకురావాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా ప్రతి ఒక్కరికీ కనెక్షన్ ఇస్తాం. – శివశంకర్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి