ఇక కిరోసిన్‌ బంద్‌! | kirosin bundh | Sakshi
Sakshi News home page

ఇక కిరోసిన్‌ బంద్‌!

Published Sun, Jul 2 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

ఇక కిరోసిన్‌ బంద్‌!

ఇక కిరోసిన్‌ బంద్‌!

– జూన్‌లో రేషన్‌ డీలర్లకు కోటాలో 20 శాతం సరఫరా
– ఈ నెల నుంచి పూర్తిగా ఎత్తేస్తున్న వైనం


తెల్లకార్డులు– 11.92 లక్షలు
గులాబీ కార్డులు– 80 వేలు
మొత్తం కార్డులు– 12.72 లక్షలు
గ్యాస్‌ కనెక‌్షన్లు– 11.37 లక్షలు
గ్యాస్‌ కనెక‌్షన్‌ లేని వారు– 1.35 లక్షలు


అనంతపురం అర్బన్‌ : రేషన్‌ కార్డులకు నీలి కిరోసిన్‌ పంపిణీని జూలై నుంచి ప్రభుత్వం బంద్‌ చేసింది. జూన్‌కు సంబంధించి డీలర్లకు కేటాయించిన కోటాలో కేవలం 20 శాతం మాత్రమే సరఫరా చేసినట్లు తెలిసింది. అదీ కూడా మేలో కిరోసిన్‌ హోల్‌సేల్‌ డీలర్ల వద్ద మిగులు సరుకును డీలర్లకు అధికారులు సర్దుబాటు చేసినట్లు తెలిసింది. ఈ కొద్ది సరుకును కార్డుదారులకు ఎలా పంపిణీ చేయాలో దిక్కుతోచక పలువురు డీలర్లు ఇబ్బంది పడ్డారు. కాగా చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సరుకులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తున్న ప్రభుత్వం వైఖరిని గమనిస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ బాధ్యతల నుంచి తప్పుకో చూస్తోందనేది స్పష్టమవుతోంది.

ఒకొక్కటిగా కోత
తెల్లకార్డుదారులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు చౌక దుకాణాల నుంచి పంపిణీ చేస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి రాగానే ఒక్కో సరుకునూ కోత పెడుతూ వస్తోంది. గతంలో బియ్యంతో పాటు పామాయిల్, చక్కెర, కందిపప్పుతో పాటుగా చింతపండు, ఉప్పు, కారం, పసుపు కూడా పంపిణీ చేసేవారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిగా పామాయిల్, అటు తరువాత చింతపండు, ఉప్పు, కారం, పసుపు పంపిణీ నిలిపివేసింది. ఆ తరువాత కందిపప్పు, గత నెలలో చక్కెర, ఈ నెలలో కిరోసిన్‌... ఇలా ఒక్కొక్కటిగా మూడేళ్లలో తొలగించింది. ప్రస్తుతం బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తున్నారు. బియ్యానికి కూడా త్వరలో మంగళం పాడే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.

గ్యాస్‌ కనెక‌్షన్‌ లేనివారి పరిస్థితి?
కిరోసిన్‌ పంపిణీ బంద్‌ చేయడంతో గ్యాస్‌ కనెక్షన్‌ లేని పేదల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి వారు కట్టెల పొయ్యిపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. పొగరహిత జిల్లాగా మారుస్తామని చెబుతున్న అధికారులకు ఇదెలా సాధ్యమో తెలియాలి. జిల్లాలో గ్యాస్‌ లేని తెల్లకార్డుదారులకు దీపం పథకం కింద 1.50 లక్షల కనెక‌్షన్లు మంజూరు చేసి వంద శాతం లక్ష్యం పూర్తిచేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష మందికి గ్యాస్‌ కనెక‌్షన్‌ లేనట్లు సమాచారం. జిల్లాలో 11.92 లక్షలు తెల్ల కార్డులు ఉన్నాయి. పింక్‌ కార్డులు 80 వేలు ఉన్నాయి.

అంటే జిల్లాలో మొత్తం 12.72 లక్షల కార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో11,37,236 గ్యాస్‌ కనెక‌్షన్లు ఉన్నాయి. ఇందులో సాధారణ కనెక‌్షన్లు 5,24,294, దీపం కనెక‌్షన్లు (కొత్తగా మంజూరు చేసిన వాటితో కలిపి) 5,31,067, సీఎస్‌ఆర్‌ (కమ్యూనిటీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ) 39,225, ఉజ్వల పథకం కనెక‌్షన్లు 2,650 ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 12.72 లక్షల కార్డులు ఉంటే గ్యాస్‌ కనెక‌్షన్లు 11.37 లక్షలు ఉన్నాయి. అంటే 1.35 లక్షల మందికి గ్యాస్‌ కనెక‌్షన్లు లేవనేది స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement