వేడుకగా కోయిళ్‌ ఆళ్వార్‌ తిరుమంజనం | koil allvar tirumanjanam grandly | Sakshi
Sakshi News home page

వేడుకగా కోయిళ్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Published Tue, Sep 27 2016 6:13 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

ఆనంద నిలయ బంగారు గోపురాన్ని శుద్ధి చేస్తున్న చైర్మన్‌ , ఈవో , బోర్డు సభ్యులు

ఆనంద నిలయ బంగారు గోపురాన్ని శుద్ధి చేస్తున్న చైర్మన్‌ , ఈవో , బోర్డు సభ్యులు

– మహద్వారం నుంచి గర్భాలయం వరకు శుద్ధి
– సుగంధ పరిమళంతో గుభాళిస్తున్న  వెంకన్న ఆలయం
సాక్షి,తిరుమల:
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వేడుకగా సాగింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేసి ఆలయంలో భక్తిశ్రద్ధలతో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. అక్టోబరు 3 నుంచి∙11వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ సేవ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహద్వారం మొదలు, ప్రాకారాలు, గోడలు, పైకప్పు, పూజలకు వినియోగించే రాగి, వెండి, బంగారం.. వస్తువులను వైదికంగా శుద్ధి చేశారు. గర్భాలయంలోని మూలమూర్తిపై దుమ్ము, దూళి పడకుండా మలైగుడారం  అనే ప్రత్యేక శ్వేతవర్ణంలోని  పట్టు వస్రం కప్పారు. శుద్ధి పూర్తి చేసిన తర్వాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర మిశ్రమ తిరుమంజనాన్ని ఆలయం అంతటా లేపనంగా పూశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు  శ్రీవారికి కొత్త పరదాలు సమర్పించారు. చివరగా అర్చకులు గర్భాలయ మూలమూర్తిపై కప్పిన వస్త్రాన్ని తొలగించి ఆగమయోక్తంగా పూజలు, నైవేద్య కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఉదయం 11 గంటల నుంచి∙భక్తులను శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాదన ప్రత్యేక వారపు సేవను రద్దు చేశారు. కార్యక్రమంలో ట్రస్టుబోర్డు సభ్యులు పసుపులేటి హరిప్రసాద్, జి.భానుప్రకాష్‌రెడ్డి, డీపీ అనంత్‌ పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement