కోనసీమ అందాలపై శతకం అంకితం
కోనసీమ అందాలపై శతకం అంకితం
Published Tue, Aug 9 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
అంతర్వేది(సఖినేటిపల్లి) : అంతర్వేది పుణ్యక్షేత్రంలో మంగళవారం సాగరసంగమం వద్ద ప్రముఖ తెలుగు వేదకవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు స్వీయ రచన చేసిన కోనసీమ శతకాన్ని వాయుదేవునికి అంకితం చేశారు. గాలిపటంపై కోనసీమ గొప్పతనాన్ని వర్ణిస్తూ పటానికి ఒక వైపు 60, రెండోవైపు 48 పద్యాలు రాసి వశిష్టగోదావరి, సముద్రం సంగమం ప్రదేశంలో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వశాంతిని కలిగించు వేదఘోషను ప్రతిధ్వనించే సాగరసంగమం, పుణ్యతీర్థాల క్షేత్రాల ముక్తి సీమ–కోనసీమ, వేదాన్ని– వ్యవసాయాన్ని ప్రతిబింబించే కోనసీమ, గలగల పారే గోదావరి, పక్షుల కిలకిలరావాలతో పులకరించే కోనసీమ, సంప్రదాయం–సంపద కలిగియుండే కోనసీమ, సుఖశాంతులతో ధాన్యాగారంగా తులతూగే కోనసీమ లోగిళ్లు, రేయింబవళ్లు కష్టించి పనిచేసే రైతుల మధుర సీమ కోనసీమ, కదలి గౌతమీపై గాలి, కడలి గాలి, చెరువులోని కలువతామరుల కమ్మనిగాలి, పైరుగాలి–తోట గాలిల సమ్మేళనం మానససరోవరం కోనసీమ అంటూ తదితర వాటిపై ఆయన 108 పద్యాలను రాశారు. తొలుత శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆయన స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామలింగేశ్వరరావు కుటుంబ సభ్యులకు అర్చకులు ఆశీర్వచనాలు చెప్పి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా నిత్యాన్నదాన పథకంలో ఆయన భోజనం చేశారు. వెంట శతావధానులు పాలపర్తి శ్యామలానంద్‌ప్రసాద్, గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్, సాహతీవేత్త ధవేజీ పాల్గొన్నారు.
Advertisement