విలేకరులతో మాట్లాడుతున్న కోండ్రు మురళీమోహన్
పాత శ్రీకాకుళం : చంద్రబాబు ఆంధ్రరాష్ట్ర ప్రజల గొంతును నొక్కేస్తున్నారని మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్ దుయ్యబట్టారు. శనివారం ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంద్ విజయవంతమైతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదనే ఉద్దేశంతోనే చంద్రబాబు రాష్ట్రబంద్‌ను పోలీసులతో అణగదొక్కించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర విభజన జరగక ముందే యూపీఏ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని గుర్తు చేశారు. టీడీపీ నేతలు రోజుకో మాట, పూటకో అబద్ధం చెబుతూ ప్రత్యేక హోదాను పక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు అసెంబ్లీలో ఒకమాట, బయటకొచ్చాక మరోమాట మారుస్తూ రాష్ట్ర ప్రజలకు కుచ్చుటోపీ పెట్టారని చెప్పారు. బంద్‌ను పోలీసుల ద్వారా అడ్డుకునేందుకు కుటిల రాజకీయ అస్త్రాలను ప్రయోగించారని దుయ్యబట్టారు.
ఇందిరా విజ్ఞాన్ భవన్ వద్ద..
అరసవల్లిలోని ఇందిరా విజ్ఞాన్‌భవన్ వద్ద ప్రత్యేక హోదా కోరుతూ శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, విశాఖపట్నంను రైల్వేజోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోల జగన్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చౌదరి సతీష్, పీసీసీ అధికార ప్రతినిధి రత్నాల నర్సింహమూర్తి, కాంగ్రెస్ నేతలు గంజి.ఆర్.ఎజ్రా, నంబాల రాజశేఖర్, బాణ రాము, అల్లిబిల్లి రాధా, కేవీఎల్ ఈశ్వరి, వైశ్యరాజు మోహన్, ఎల్.నారాయణ రావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.