పుష్కర కృష్ణవేణి | krishna pushkaralu started in telangana, river banks with spiritual splendor | Sakshi
Sakshi News home page

పుష్కర కృష్ణవేణి

Published Sat, Aug 13 2016 1:03 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

పుష్కర కృష్ణవేణి - Sakshi

పుష్కర కృష్ణవేణి

మొదలైన కృష్ణా పుష్కర సంరంభం.. నదీ తీరాన ఆధ్యాత్మిక శోభ
జోగుళాంబ సన్నిధిలో కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ పుణ్యస్నానం
తొలిరోజు పలుచగా భక్తజన సందోహం
మహబూబ్‌నగర్ జిల్లాలో 2 లక్షలు,
నల్లగొండలో 1.39 లక్షల మంది స్నానాలు
మూడు రోజుల వరుస సెలవులతో నేటి నుంచి జనం పోటెత్తే అవకాశం

సాక్షి, హైదరాబాద్/నల్లగొండ/మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కర సంరంభం మొదలైంది. నదీ తీరంలోని ఆలయాల్లో వేదమంత్రాలు, నదీమతల్లి ఒడిలో భక్తజన జయజయ ధ్వానాలు.. వేద పండితుల మంగళహారతులు... సాయంత్రం సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు.. వెరసి కృష్ణవేణి కొత్త శోభను సంతరించుకుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి కృష్ణా పుష్కర వేడుక భక్తిప్రపత్తుల మధ్య ఘనంగా ప్రారంభమైంది. పుష్కరుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో శుక్రవారం ఉదయం 5.58 గంటలకు పుణ్యస్నానాలు మొదలయ్యాయి. ఆ ముహూర్తంలో నదిలో స్నానమాచరించి క్షేత్రంలోని దైవ దర్శనం చేసుకుంటే అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందనే నమ్మకంతో భక్తులు తరలివచ్చారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ సన్నిధిలోని గొందిమళ్ల ఘాట్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబసమేతంగా పుణ్య స్నానమాచరించారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా కుటుంబంతో కలసి పవిత్రస్నానం చేశారు. అనంతరం వారు జోగుళాంబ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత సాధారణ భక్తులను అనుమతించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని 79 పుష్కర ఘాట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు తీరం వెంట ఉన్న పుణ్య క్షేత్రాలలో దైవ దర్శనాలు చేసుకున్నారు. దీంతో యావత్తు కృష్ణా తీరం ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోంది.
 
తొలిరోజు పలుచగా..

2004లో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలు జరగగా ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారి జరుగుతున్నాయి. గతేడాది కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలను నిర్వహించిన     ప్రభుత్వం ఈసారీ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది. గోదావరి పుష్కరాల సమయంలో తొలిరోజే భక్తులు పోటెత్తారు. దాదాపు 20 లక్షల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరించారని ప్రభుత్వం లెక్కలేసింది. కానీ కృష్ణా పుష్కరాల తొలిరోజు భక్తుల రాక పలచగా కనిపించింది. 51 ఘాట్లు ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 2,03,782 మంది, 28 ఘాట్లు ఉన్న నల్లగొండ జిల్లాలో 1,39,739 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం కావటంతో చాలామంది ఇళ్లల్లో వ్రతాలు ఆచరించారు. ఆ కారణంగానే జనం తక్కువగా వచ్చారని, శనివారం నుంచి వరసగా మూడ్రోజులపాటు సెలవులు ఉండటంతో సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
 
ఇంకా కొనసాగుతున్న పనులు

కృష్ణా పుష్కరాలకు 13,500 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నదిలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచడంతోపాటు అన్ని ఘాట్ల వద్ద ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. రైళ్లు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయటంతో ప్రయాణాలకు కూడా ఎక్కడా అవాంతరాలు ఏర్పడలేదు. ప్రత్యేక బస్సుల్లో 11,170 మంది ప్రయాణించారని ఆర్టీసీ ప్రకటించింది. అయితే మహబూబ్‌నగర్ జిల్లాలో చాలాచోట్ల ఘాట్ల వద్ద భక్తులు ఒకవైపు పుష్కర స్నానాలు ఆచరిస్తుంటే మరోవైపు ఘాట్ల వద్ద పనులు చేపట్టారు. పాతాళగంగ వద్ద మహిళల కోసం ఇప్పటికీ డ్రెస్సింగ్ రూమ్‌లు ఏర్పాటు కాలేదు. ఇంకా ఘాట్ల వద్ద షవర్ల ఏర్పాటు, రోడ్డు పనులు కొనసాగుతుండడం గమనార్హం.

నల్లగొండ జిల్లా పరిధిలో 28 ఘాట్లకు గాను 10 చోట్ల నీళ్లు లేక భక్తులు ఇబ్బంది పడ్డారు. నాగార్జున సాగర్ వద్ద ఉన్న రెండు ఘాట్లలో నీటి ప్రవాహం లేదు. జిల్లాలో మట్టపల్లిలోని ప్రహ్లాద ఘాట్‌లో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి కుటుంబ సమేతంగా స్నానాలాచరించారు. ఇక్కడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పుష్కర స్నానమాచరించారు. చందంపేట మండలం పెదమునిగల్‌లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పుష్కర స్నానం చేశారు. జిల్లాలోని వీఐపీ ఘాట్లయిన మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్‌లలో కూడా పెద్దగా జనసందోహం లేకుండానే తొలిరోజు పుష్కరస్నానాలు ముగిశాయి. అన్నింటికంటే ఎక్కువగా నాగార్జునసాగర్‌లోని శివాలయం వీఐపీ ఘాట్‌లో దాదాపు 25 వేల మంది స్నానమాచరించినట్లు అంచనా.
 
పోలీసుల అతి..
పోలీసులు తొలిరోజు అక్కడక్కడా హడావుడి చేశారు. ప్రధాన ఘాట్ల 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ్నుంచి ఆర్టీసీ ఉచిత బస్సుల్లో వారిని తరలించాలనే సూచనలున్నాయి. అయితే ఆయా ప్రాంతాలకు పెద్దగా ఉచిత బస్సులను పంపలేదు. పోలీసులు మాత్రం 5 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపటంతో భక్తులు నడుచుకుంటూ ఘాట్ల వరకు నడిచి వెళ్లాల్సి వచ్చింది. దీంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడ్డారు. నడవలేని కొందరు పుణ్యస్నానాలు చేయకుండానే వెనుదిరిగారు.

నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 7 వేల మంది మాత్రమే భక్తులే వచ్చినా.. దేవాలయానికి తాళం వేయించి వెలుపల ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాల వద్దనే దర్శనం చేసుకోవాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా ఘాట్ సమీపంలో దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద ప్రసాదం అందించేందుకు సిబ్బంది ఉపక్రమించగా పోలీసులు అడ్డుకుని లడ్డూలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కూడా ఆలయ దర్శనం విషయంలో ఆంక్షలు విధించటంతో భక్తులు సహా అర్చకులు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత పోలీసులు లడ్డూలను తిరిగి అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement