krishna pushakaralu
-
పుష్కరాలంటూ..రోడ్డున పడేశారు
‘గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట వల్ల 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కూడా అలాంటి ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే మీ ఇళ్లు తొలగించాలి. ప్రతి ఇంటికీ పరిహారం, స్థలాలు ఇస్తాం’ 2016 కృష్ణా పుష్కరాల సందర్భంగా మంత్రులు, అధికారులు చెప్పిన మాటలివి. ఆ ఏడాది జూన్‌లో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో సుమారు 300 కుటుంబాలకు చెందిన ఇళ్లను అధికారులు తొలగించారు. ఆ ప్రాంతంలో ‘సాక్షి’ పర్యటించగా.. నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘ఉన్నపళంగా ఇంటిని పీకేశారయ్యా. అప్పట్లో కనీసం సామగ్రి తరలించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. న్యాయం కోసం మూడేళ్లుగా తిరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు’ అని సరోజని వాపోయింది. లక్ష్మీదేవి అనే మహిళ మాట కలుపుతూ.. ‘కాళ్లరిగేలా తిరిగినా కూసింత జాగా కూడా ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడు ఎలక్షన్లు రావడంతో తగదునమ్మా అంటూ ఓట్లగడానికి వస్తున్నారు’ అంటూ నిట్టూర్చింది. అటుగా వెళుతున్న పార్వతి మాట్లాడుతూ.. ‘పేదోళ్ల ఓట్లతో గెలిచిన నాయకులంతా తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఈసారి ఆయనే వస్తే చుట్టుపక్కల కొండలను పర్యాటకంగా తీర్చిదిద్దుతా అంటున్నాడే... ఆ కొండలపై ఉన్న వాళ్లందరినీ మనలాగే రోడ్డున పడేస్తారేమో’ అంటూ తన మనసులోని సందేహాన్ని బయటపెట్టింది. మరికొందరు ఏమన్నారంటే..... నా వయసు డెబ్భై ఏళ్లు. ఏడుగురు కొడుకులు. వారికి పిల్లలున్నారు. అంతా కృష్ణా నదిలో చేపలు పట్టుకుని జీవిస్తున్నారు. మా ఇంటితోపాటు నా పిల్లల ఇళ్లూ తొలగించారు. తాత్కాలికంగా 30 గజాల స్థలం ఇచ్చారు. అందులో ఆరుగురు ఉంటున్నారు. నాకు పాక వేసుకునే స్థోమత లేకపోవడంతో వినకొండ అంకమ్మ ఆలయంలో వండుకుని తింటున్నా. ఈ వయసులో ఇలాంటి దుర్భర జీవితం అనుభవించాల్సి వస్తుందనుకోలేదు. – మల్లాడి సీతామహాలక్ష్మి, నిర్వాసితురాలు అమ్మ ఇంట్లో తలదాచుకుంటున్నా భర్త లేడు. ఇద్దరు పిల్లలు. అబ్బాయి పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. అమ్మాయి పదో తరగతి చదివింది. కూలి పనులు చేసుకుంటున్నాం. 2016 జూన్‌లో మా ఇల్లూ తొలగించారు. ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. తాత్కాలికంగా స్థలాలు చూపించి చేతులు దులుపుకున్నారు. ఇళ్లు కట్టే శక్తి లేక మా అమ్మ గారింట్లో తలదాచుకుంటున్నాం. – బలగం భాగ్యలక్ష్మి, నిర్వాసితురాలు ఆవేదనతో నా భర్త మరణించాడు ‘మూడేళ్ల కిందట అధికారులంతా వచ్చి ఇళ్లు తొలగించారు. మేం ఖాళీ చేయబోమని చెప్పినా వినిపించుకోలేదు. పోలీసులొస్తారు.. లాఠీచార్జి చేస్తారంటూ భయపెట్టి ఖాళీ చేయించారు. ఈ ఆవేదనతో నా భర్త మంచాన పడ్డాడు. చివరకు గుండెపోటుతో చనిపోయాడు. ప్రస్తుతం నా కుమార్తె ఇంట్లో తలదాచుకుంటున్నా. – గాడి దుర్గ, నిర్వాసితురాలు రూ.2 వేల అద్దె కడుతున్నాం నాకు ఐదుగురు పిల్లలు. భర్త చనిపోయారు. నలుగురికి పెళ్లిళ్లు చేశా. నేను నా కుమారుడు ఉంటున్నాం. నాకొచ్చే పింఛన్ రూ.2 వేలు ఇంటి అద్దెకు సరిపోతోంది. మూడేళ్లుగా తిరగని కార్యాలయం అంటూ లేదు. అక్కడ చిన్నపాకలు వేసుకుంటే రెండు నెలలు కూడా నివశించలేకపోయాం. చిన్నపాటి వర్షానికే మోకాలులోతు నీరు వచ్చేది. – సి.శివకుమారి, బాధితురాలు తాత్కాలిక స్థలాలే సీతానగరంలో 300 కుటుంబాలు, రోడ్ల విస్తరణ పేరుతో మరో వంద ఇళ్లను తొలగించారు. మూడేళ్లలో ఏ ఒక్క కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయలేదు. పోలకంపాడు సమీపంలో కుటుంబానికి 45 గజాల స్థలమిచ్చారు. సీతానగరం బోటు యార్డు సమీపంలో 30 గజాల చొప్పున ఇచ్చారు. కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు బాధితులు ముందుకు రావడం లేదు. కేటాయించిన స్థలాలు కూడా తాత్కాలికమే కావడం గమనార్హం. -
పుష్కర కృష్ణవేణి
మొదలైన కృష్ణా పుష్కర సంరంభం.. నదీ తీరాన ఆధ్యాత్మిక శోభ ► జోగుళాంబ సన్నిధిలో కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ పుణ్యస్నానం ► తొలిరోజు పలుచగా భక్తజన సందోహం ► మహబూబ్‌నగర్ జిల్లాలో 2 లక్షలు, ► నల్లగొండలో 1.39 లక్షల మంది స్నానాలు ► మూడు రోజుల వరుస సెలవులతో నేటి నుంచి జనం పోటెత్తే అవకాశం సాక్షి, హైదరాబాద్/నల్లగొండ/మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కర సంరంభం మొదలైంది. నదీ తీరంలోని ఆలయాల్లో వేదమంత్రాలు, నదీమతల్లి ఒడిలో భక్తజన జయజయ ధ్వానాలు.. వేద పండితుల మంగళహారతులు... సాయంత్రం సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు.. వెరసి కృష్ణవేణి కొత్త శోభను సంతరించుకుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి కృష్ణా పుష్కర వేడుక భక్తిప్రపత్తుల మధ్య ఘనంగా ప్రారంభమైంది. పుష్కరుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో శుక్రవారం ఉదయం 5.58 గంటలకు పుణ్యస్నానాలు మొదలయ్యాయి. ఆ ముహూర్తంలో నదిలో స్నానమాచరించి క్షేత్రంలోని దైవ దర్శనం చేసుకుంటే అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందనే నమ్మకంతో భక్తులు తరలివచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ సన్నిధిలోని గొందిమళ్ల ఘాట్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుటుంబసమేతంగా పుణ్య స్నానమాచరించారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా కుటుంబంతో కలసి పవిత్రస్నానం చేశారు. అనంతరం వారు జోగుళాంబ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత సాధారణ భక్తులను అనుమతించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని 79 పుష్కర ఘాట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు తీరం వెంట ఉన్న పుణ్య క్షేత్రాలలో దైవ దర్శనాలు చేసుకున్నారు. దీంతో యావత్తు కృష్ణా తీరం ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోంది. తొలిరోజు పలుచగా.. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలు జరగగా ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారి జరుగుతున్నాయి. గతేడాది కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాలను నిర్వహించిన ప్రభుత్వం ఈసారీ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది. గోదావరి పుష్కరాల సమయంలో తొలిరోజే భక్తులు పోటెత్తారు. దాదాపు 20 లక్షల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరించారని ప్రభుత్వం లెక్కలేసింది. కానీ కృష్ణా పుష్కరాల తొలిరోజు భక్తుల రాక పలచగా కనిపించింది. 51 ఘాట్లు ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 2,03,782 మంది, 28 ఘాట్లు ఉన్న నల్లగొండ జిల్లాలో 1,39,739 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం కావటంతో చాలామంది ఇళ్లల్లో వ్రతాలు ఆచరించారు. ఆ కారణంగానే జనం తక్కువగా వచ్చారని, శనివారం నుంచి వరసగా మూడ్రోజులపాటు సెలవులు ఉండటంతో సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇంకా కొనసాగుతున్న పనులు కృష్ణా పుష్కరాలకు 13,500 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నదిలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచడంతోపాటు అన్ని ఘాట్ల వద్ద ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. రైళ్లు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయటంతో ప్రయాణాలకు కూడా ఎక్కడా అవాంతరాలు ఏర్పడలేదు. ప్రత్యేక బస్సుల్లో 11,170 మంది ప్రయాణించారని ఆర్టీసీ ప్రకటించింది. అయితే మహబూబ్‌నగర్ జిల్లాలో చాలాచోట్ల ఘాట్ల వద్ద భక్తులు ఒకవైపు పుష్కర స్నానాలు ఆచరిస్తుంటే మరోవైపు ఘాట్ల వద్ద పనులు చేపట్టారు. పాతాళగంగ వద్ద మహిళల కోసం ఇప్పటికీ డ్రెస్సింగ్ రూమ్‌లు ఏర్పాటు కాలేదు. ఇంకా ఘాట్ల వద్ద షవర్ల ఏర్పాటు, రోడ్డు పనులు కొనసాగుతుండడం గమనార్హం. నల్లగొండ జిల్లా పరిధిలో 28 ఘాట్లకు గాను 10 చోట్ల నీళ్లు లేక భక్తులు ఇబ్బంది పడ్డారు. నాగార్జున సాగర్ వద్ద ఉన్న రెండు ఘాట్లలో నీటి ప్రవాహం లేదు. జిల్లాలో మట్టపల్లిలోని ప్రహ్లాద ఘాట్‌లో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి కుటుంబ సమేతంగా స్నానాలాచరించారు. ఇక్కడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పుష్కర స్నానమాచరించారు. చందంపేట మండలం పెదమునిగల్లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పుష్కర స్నానం చేశారు. జిల్లాలోని వీఐపీ ఘాట్లయిన మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్‌లలో కూడా పెద్దగా జనసందోహం లేకుండానే తొలిరోజు పుష్కరస్నానాలు ముగిశాయి. అన్నింటికంటే ఎక్కువగా నాగార్జునసాగర్‌లోని శివాలయం వీఐపీ ఘాట్‌లో దాదాపు 25 వేల మంది స్నానమాచరించినట్లు అంచనా. పోలీసుల అతి.. పోలీసులు తొలిరోజు అక్కడక్కడా హడావుడి చేశారు. ప్రధాన ఘాట్ల 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ్నుంచి ఆర్టీసీ ఉచిత బస్సుల్లో వారిని తరలించాలనే సూచనలున్నాయి. అయితే ఆయా ప్రాంతాలకు పెద్దగా ఉచిత బస్సులను పంపలేదు. పోలీసులు మాత్రం 5 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆపటంతో భక్తులు నడుచుకుంటూ ఘాట్ల వరకు నడిచి వెళ్లాల్సి వచ్చింది. దీంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడ్డారు. నడవలేని కొందరు పుణ్యస్నానాలు చేయకుండానే వెనుదిరిగారు. నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 7 వేల మంది మాత్రమే భక్తులే వచ్చినా.. దేవాలయానికి తాళం వేయించి వెలుపల ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాల వద్దనే దర్శనం చేసుకోవాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా ఘాట్ సమీపంలో దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద ప్రసాదం అందించేందుకు సిబ్బంది ఉపక్రమించగా పోలీసులు అడ్డుకుని లడ్డూలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కూడా ఆలయ దర్శనం విషయంలో ఆంక్షలు విధించటంతో భక్తులు సహా అర్చకులు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత పోలీసులు లడ్డూలను తిరిగి అందజేశారు. -
కార్పొరేషన్ ఖాళీ
పుష్కరాల విధులకు తరలిన ఉద్యోగులు 152 మందిలో 86 మంది విధులకు ఇన్చార్జి కమిషనర్‌గా ఎస్ఈ శ్రీనివాసులు నెల్లూరు సిటీ: కృష్ణా పుష్కరాల విధుల్లో పాల్గొనేందుకు నగరపాలక సంస్థ ఉద్యోగులు తరలివెళ్లడంతో కార్పొరేషన్ ఖాళీ అయింది. కార్పొరేషన్‌లోని వివిధ విభాగాల్లో మొత్తం 152 మంది అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా, వీరిలో 86 మంది పుష్కర విధులకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో కమిషనర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ కమిషనర్ గుర్రం రవి కూడా ఉన్నారు. రెవెన్యూ, హెల్త్, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగాల నుంచి సూపరింటెండెంట్లు పుష్కర విధుల్లో ఉన్నారు. మేనేజర్ రాజేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, ఏఈలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పలువురు సిబ్బంది కూడా వెళ్లారు. మరోవైపు ఇన్చార్జి కమిషనర్‌గా ఇంజినీరింగ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులును నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 27 వరకు ఇన్చార్జి కమిషనర్‌గా శ్రీనివాసులు విధులు నిర్వర్తించనున్నారు. డీఈ సస్పెన్షన్‌తో ఉలిక్కిపడ్డ కార్పొరేషన్ ఉద్యోగులు ఇంజినీరింగ్ విభాగ డీఈ శేషగిరిరావును సస్పెండ్ చేస్తూ బుధవారం ఈఎన్సీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పటి వరకు హెల్త్ లీవుల పై పుష్కర విధులకు హాజరుకాకుండా ఉండేందుకు కొందరు ఉద్యోగులు ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషంలో హెల్త్ లీవులు పెట్టకుండా విధులకు హాజరుకావడం విశేషం. కీలకాధికారులు పుష్కరాల విధుల్లో ఉండటంతో ఉన్న సిబ్బందితో పాలన కొనసాగించడం కష్టమని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. కార్పొరేషన్లో పనిచేసే మహిళలు, వికలాంగులకు మాత్రం పుష్కర విధుల నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
పుష్కరాల కోసం 1150 బస్సులు
పనులను పరిశీలించిన మంత్రి దామరచర్ల : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా పుష్కర పనులను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. పుష్కర పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీనాక్షి అగస్తేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేకంగా 1,150 ఆర్టీసీ బస్సులను నడుపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. పుష్కరాల కోసం కొత్తగా 2,500 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.