కార్పొరేషన్ ఖాళీ
-
పుష్కరాల విధులకు తరలిన ఉద్యోగులు
-
152 మందిలో 86 మంది విధులకు
-
ఇన్‌చార్జి కమిషనర్‌గా ఎస్‌ఈ శ్రీనివాసులు
నెల్లూరు సిటీ: కృష్ణా పుష్కరాల విధుల్లో పాల్గొనేందుకు నగరపాలక సంస్థ ఉద్యోగులు తరలివెళ్లడంతో కార్పొరేషన్ ఖాళీ అయింది. కార్పొరేషన్లోని వివిధ విభాగాల్లో మొత్తం 152 మంది అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా, వీరిలో 86 మంది పుష్కర విధులకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో కమిషనర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ కమిషనర్ గుర్రం రవి కూడా ఉన్నారు. రెవెన్యూ, హెల్త్, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగాల నుంచి సూపరింటెండెంట్లు పుష్కర విధుల్లో ఉన్నారు. మేనేజర్ రాజేంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు, ఏఈలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, పలువురు సిబ్బంది కూడా వెళ్లారు. మరోవైపు ఇన్‌చార్జి కమిషనర్‌గా ఇంజినీరింగ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులును నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 27 వరకు ఇన్‌చార్జి కమిషనర్‌గా శ్రీనివాసులు విధులు నిర్వర్తించనున్నారు.
డీఈ సస్పెన్షన్‌తో ఉలిక్కిపడ్డ కార్పొరేషన్ ఉద్యోగులు
ఇంజినీరింగ్ విభాగ డీఈ శేషగిరిరావును సస్పెండ్ చేస్తూ బుధవారం ఈఎన్సీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పటి వరకు హెల్త్ లీవుల పై పుష్కర విధులకు హాజరుకాకుండా ఉండేందుకు కొందరు ఉద్యోగులు ప్రయత్నాలు చేశారు. చివరి నిమిషంలో హెల్త్ లీవులు పెట్టకుండా విధులకు హాజరుకావడం విశేషం. కీలకాధికారులు పుష్కరాల విధుల్లో ఉండటంతో ఉన్న సిబ్బందితో పాలన కొనసాగించడం కష్టమని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. కార్పొరేషన్లో పనిచేసే మహిళలు, వికలాంగులకు మాత్రం పుష్కర విధుల నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.