పుష్కరాలంటూ..రోడ్డున పడేశారు | People Suffering With Tdp Governament | Sakshi
Sakshi News home page

పుష్కరాలంటూ..రోడ్డున పడేశారు

Published Sun, Mar 24 2019 11:04 AM | Last Updated on Sun, Mar 24 2019 11:06 AM

People Suffering With Tdp Governament - Sakshi

‘గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట వల్ల 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కూడా అలాంటి ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే మీ ఇళ్లు తొలగించాలి. ప్రతి ఇంటికీ పరిహారం, స్థలాలు ఇస్తాం’ 2016 కృష్ణా పుష్కరాల సందర్భంగా మంత్రులు, అధికారులు చెప్పిన మాటలివి. ఆ ఏడాది జూన్‌లో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో సుమారు 300 కుటుంబాలకు చెందిన ఇళ్లను అధికారులు తొలగించారు. ఆ ప్రాంతంలో ‘సాక్షి’ పర్యటించగా.. నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘ఉన్నపళంగా ఇంటిని పీకేశారయ్యా. అప్పట్లో కనీసం సామగ్రి తరలించుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. న్యాయం కోసం మూడేళ్లుగా తిరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు’ అని సరోజని వాపోయింది. లక్ష్మీదేవి అనే మహిళ మాట కలుపుతూ.. ‘కాళ్లరిగేలా తిరిగినా కూసింత జాగా కూడా ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడు ఎలక్షన్లు రావడంతో తగదునమ్మా అంటూ ఓట్లగడానికి వస్తున్నారు’ అంటూ నిట్టూర్చింది. అటుగా వెళుతున్న పార్వతి మాట్లాడుతూ.. ‘పేదోళ్ల ఓట్లతో గెలిచిన నాయకులంతా తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఈసారి ఆయనే వస్తే చుట్టుపక్కల కొండలను పర్యాటకంగా తీర్చిదిద్దుతా అంటున్నాడే... ఆ కొండలపై ఉన్న వాళ్లందరినీ మనలాగే రోడ్డున పడేస్తారేమో’ అంటూ తన మనసులోని సందేహాన్ని బయటపెట్టింది. 


మరికొందరు ఏమన్నారంటే..... 

                    
నా వయసు డెబ్భై ఏళ్లు. ఏడుగురు కొడుకులు. వారికి పిల్లలున్నారు. అంతా కృష్ణా నదిలో చేపలు పట్టుకుని జీవిస్తున్నారు. మా ఇంటితోపాటు నా పిల్లల ఇళ్లూ తొలగించారు. తాత్కాలికంగా 30 గజాల స్థలం ఇచ్చారు. అందులో ఆరుగురు ఉంటున్నారు. నాకు పాక వేసుకునే స్థోమత లేకపోవడంతో వినకొండ అంకమ్మ ఆలయంలో వండుకుని తింటున్నా. ఈ వయసులో ఇలాంటి దుర్భర జీవితం అనుభవించాల్సి వస్తుందనుకోలేదు. 
– మల్లాడి సీతామహాలక్ష్మి, నిర్వాసితురాలు 


అమ్మ ఇంట్లో తలదాచుకుంటున్నా 


భర్త లేడు. ఇద్దరు పిల్లలు. అబ్బాయి పాలిటెక్నిక్‌ పూర్తి చేశాడు. అమ్మాయి పదో తరగతి చదివింది. కూలి పనులు చేసుకుంటున్నాం. 2016 జూన్‌లో మా ఇల్లూ తొలగించారు. ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు.  తాత్కాలికంగా స్థలాలు చూపించి చేతులు దులుపుకున్నారు. ఇళ్లు కట్టే శక్తి లేక మా అమ్మ గారింట్లో తలదాచుకుంటున్నాం. 
– బలగం భాగ్యలక్ష్మి, నిర్వాసితురాలు 


ఆవేదనతో నా భర్త మరణించాడు 


‘మూడేళ్ల కిందట అధికారులంతా వచ్చి ఇళ్లు తొలగించారు. మేం ఖాళీ చేయబోమని చెప్పినా వినిపించుకోలేదు. పోలీసులొస్తారు.. లాఠీచార్జి చేస్తారంటూ భయపెట్టి ఖాళీ చేయించారు. ఈ ఆవేదనతో నా భర్త మంచాన పడ్డాడు. చివరకు గుండెపోటుతో చనిపోయాడు. ప్రస్తుతం నా కుమార్తె ఇంట్లో తలదాచుకుంటున్నా. 
– గాడి దుర్గ, నిర్వాసితురాలు 


రూ.2 వేల అద్దె కడుతున్నాం 


నాకు ఐదుగురు పిల్లలు. భర్త చనిపోయారు. నలుగురికి పెళ్లిళ్లు చేశా. నేను నా కుమారుడు ఉంటున్నాం. నాకొచ్చే పింఛన్‌ రూ.2 వేలు ఇంటి అద్దెకు సరిపోతోంది. మూడేళ్లుగా తిరగని కార్యాలయం అంటూ లేదు. అక్కడ చిన్నపాకలు వేసుకుంటే రెండు నెలలు కూడా నివశించలేకపోయాం. చిన్నపాటి వర్షానికే మోకాలులోతు నీరు వచ్చేది.
– సి.శివకుమారి, బాధితురాలు 


తాత్కాలిక స్థలాలే
సీతానగరంలో 300 కుటుంబాలు, రోడ్ల విస్తరణ పేరుతో మరో వంద ఇళ్లను తొలగించారు. మూడేళ్లలో ఏ ఒక్క కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయలేదు. పోలకంపాడు సమీపంలో కుటుంబానికి 45 గజాల స్థలమిచ్చారు. సీతానగరం బోటు యార్డు సమీపంలో 30 గజాల చొప్పున ఇచ్చారు. కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు బాధితులు ముందుకు రావడం లేదు. కేటాయించిన స్థలాలు కూడా తాత్కాలికమే కావడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement