నమోః కృష్ణమ్మా
→ జీడిపల్లి జలాశయానికి పుష్కర శోభ
→ పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు
→ సతీసమేతంగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్
అనంతపురం అర్బన్/అగ్రికల్చర్/బెళుగుప్ప : నమోః కృష్ణమ్మా.. అంటూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడంతో జీడిపల్లి జలాశయం పుష్కర శోభ సంతరించుకుంది. శుక్రవారం ఉదయం జీడిపల్లి జలాశయం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ప్రారంభ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం సతీసమేతంగా హాజరయ్యారు. కృష్ణమ్మ విగ్రహ ప్రతిష్టకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అన ంతరం వారు పుణ్య స్నానం ఆచరించారు.
దాదాపు 500 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గ్రామపెద్దలతో కలిసి తహసీల్దారు జి.ఎం.వెంకటాచలపతి, ప్రత్యేక అధికారి మేఘనాథ్ భక్తుల కోసం అధికారులు సౌకర్యాలు కల్పించారు. భక్తులు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా గజ ఈతగాళ్లను, వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. జలాశయంలో ప్రమాద హెచ్చరికలను తెలిపేందుకు గుర్తులను ఏర్పాటు చేశారు. పురోహితులను అందుబాటులో ఉంచారు. కాలువపల్లి నుంచి జలాశయం వద్ద ఏర్పాటు చేసిన ఘాట్ వరకు రాకపోకలకు రెండు బస్సు సర్వీసులను 23వ తేదీ వరకు నిర్వహించాలని గ్రామపెద్దలు కోరుతున్నారు.
––––––––––––––––––––––––––––––––––––
చాలా ఆనందంగా ఉంది:
ఎలాంటి ఇబ్బంది లేకుండా కృష్ణాజలాల్లో పుష్కర స్నానం చేయడం చాలా ఆనందంగా ఉంది. వ్యయ ప్రయాసాలకోర్చి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లలేని భక్తులకు ఇది చాలా అనుకూలం. భక్తులు రావడానికి ప్రయాణ సదుపాయం, తాగునీరు, పుష్కరఘాట్, ఇతరత్రా వివరాలు తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
రవి, సుకన్య (జేఎన్‌టీయూ, అనంతపురం)
––––––––––––––––
జిల్లా వాసులకు గొప్ప అవకాశం
కృష్ణా పుష్కరాలకు వెళ్లిరావడం ఎంతోఖర్చుతో కూడుకున్నది. కృష్ణాజలాలు ప్రవహించే చోట కూడా పుష్కరుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెప్పారు. అందుకు అనుగుణంగా జీడిపల్లి జలాశయం వద్ద ఏర్పాట్లు చేయడం జిల్లా వాసులకు గొప్ప అవకాశం. మరికొన్ని సదుపాయాలు కల్పిస్తే ఇంతకన్నా మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు.
–విజయలక్ష్మి, ఉపాధ్యాయురాలు, పెద్దవడుగూరు
–––––– ––––––