
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ బీసీ సంఘాల సమావేశం ఏపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవ్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..
ఈ నెల 9వ తేదీన కాకినాడలో పవన్ కళ్యాణ్ నిర్వహించే ఆత్మగౌరవ సభకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం తెగించి పోరాటం చేస్తామని, ఢిల్లీలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్, బీసీ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కులకచర్ల శ్రీనివాస్, అరుణ్ యాదవ్, కృష్ణ యాదవ్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.