R.Krishnaiah
-
‘బీసీ కులాలన్నింటికీ రుణాలివ్వాలి’
ముషీరాబాద్: సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల రుణం 4 కులాలకే కాకుండా బీసీ జాబితాలో ఉన్న 129 కులాలకు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్లో శనివారం జరిగిన 16 బీసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. 2017లో ఎన్నికల ముందు రుణాలు ఇస్తామని 6 లక్షల మంది వద్ద దరఖాస్తులు తీసుకొని, వారికి రుణాలు ఇవ్వలేదని తెలిపారు. వారికి వెంటనే లక్షరూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ పోస్టులు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. వెంటనే ఈడీ పోస్టులను, బీసీ కార్పొరేషన్ల ఎండీ పోస్టులనూ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషనర్, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ, బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను ఎందుకు నియమించడంలేదని ప్రశ్నించారు. ఇన్నేళ్లు బీసీలను నిర్లక్ష్యం చేసి, ఎన్నికల ముందు రుణాలు అంటూ ప్రకటించడాన్ని బీసీలు గమనించాలని కోరారు. బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నాయకులు జి.అనంతయ్య, మధుసూదన్, జిల్లపల్లి అంజి, వేముల రామకృష్ణ, పగడాల సుధాకర్, గొరిగ మల్లేష్ యాదవ్, సి.రాజేందర్, డీఆర్ చందర్, నీలం వెంకటేష్, జి.కృష్ణయాదవ్, రామాంజనేయులు, నర్సింహగౌడ్, బర్క కృష్ణ, ముత్యం వెంకన్నగౌడ్ పాల్గొన్నారు. -
కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరిస్తా
లిబర్టీ : అన్ని రంగాల్లో వెనుకబడిన ఆరె కటికల సమగ్రాభివృద్ధికి సహకారం అందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆరె కటిక అభివృద్ధి సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిథులు శుక్రవారం కృష్ణయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలని, ఆరె కటిక సమగ్ర అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై ఆర్.కృష్ణయ్య స్పందిస్తూ కార్పొరేషన్ ఏర్పాటుకు మద్దతుగా ఉంటూ పోరాటం సాగిస్తానని వెల్లడించారు. ఆరె కటికలను బీసీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
ఇంటికో ఉద్యోగం కాదు..ఊరికో ఉద్యోగం కూడా రాలే
సాక్షి, ముషీరాబాద్ (హైదరాబాద్): తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఇంటికొక ఉద్యోగం అంటూ ఊరూ వాడా ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడుస్తున్నా ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, 16 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేశ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలను కృష్ణయ్య పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ దీక్షలకు మద్దతుగా వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, గొరిగ మల్లేశ్, సి.రాజేందర్లు పాల్గొని ప్రసంగించారు. -
ప్రాణత్యాగానికైనా సిద్ధం
హైదరాబాద్: భాషా పండితులు, పీఈటీల పదోన్నతుల సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు(ఆర్‌యూపీపీ–టీ), వ్యాయామవిద్య ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ (పీఈటీఏ టీఎస్)ల రాష్ట్ర కమిటీ నాయకు లు అన్నారు. ఏ ఉద్యోగంలోనైనా ప్రమోషన్లు ఉన్నాయని, భాషా పండితులు, పీఈటీలు మాత్రం చేరిన కేడర్లోనే రిటైరవుతున్నారని వాపోయారు. భాషాపండితులు, పీఈటీల సమస్యపై స్పందించి పోస్టులను అప్‌గ్రెడేషన్ చేస్తూ జీవో 15పై సీఎం కేసీఆర్ సంతకం చేసినా దాని అమలులో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. భాషా పండితులు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, వ్యాయామవిద్య ఉపా ధ్యాయ సంఘాలు ఇందిరాపార్కు వద్ద నిరాహారదీక్షలు నిర్వహించాయి. దీక్షల్లో ఆర్‌యూపీపీటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.డి. అబ్దుల్లా, గండమల్ల విశ్వరూపం, పీఈ టీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు డాక్టర్ ఎస్.సోమేశ్వర్రావు, బి.రాఘవరెడ్డిలతోపాటు తెలంగా ణలోని అన్నిజిల్లాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు కూర్చున్నారు. అన్నిజిల్లాల నుంచి పండిత ఉపాధ్యాయులు, పీఈటీలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీక్షలకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎ.నర్సిరెడ్డి, సరోత్తమ్‌రెడ్డి, చావ రవి (టీఎస్‌యూటీఎఫ్) భుజంగరావు(ఎస్టీయూ), రాఘవరెడ్డి (పీఈటీ అసోసియేషన్), రఘునందన్ (టీటీఎఫ్), పి.లక్ష్మయ్య(జూనియర్ కళాశాల పీఈటీ అసోసియేషన్) సంఘీభావం ప్రకటించారు. సీఎంకు పండిత టీచర్ల సమస్యలు పట్టవా? భాషా పండితుడైన సీఎం కేసీఆర్ భాషా పండితుల సమస్యలు పట్టించుకోకపోవడం శోచనీయమని ఆర్.కృష్ణయ్య అన్నారు. పండిత, పీఈటీ పోస్టుల్లో 25, 30 ఏళ్లుగా పనిచేస్తున్నా ప్రమోషన్లు లేకపోవడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ భాషా పండితులు, పీఈటీల సమస్యలపై మండలిలో నిలదీస్తామన్నారు. పదోన్నతులతో 12 వేలకుపైగా భాషాపండితులు, పీఈటీలు, లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. భాషా పండితుల నిరాహారదీక్షలను పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా దీక్షలు కొనసాగిస్తున్నా రంటూ పోలీసులు 8 మంది భాషాపండితులను బలవంతంగా అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం 5 తర్వాత కూడా దీక్షలను యధావిధిగా కొనసాగిస్తుండడంతో పోలీసులు టీచర్లను దీక్షలను ముగించాలని చెప్పినప్పటికీ రాత్రి ఏడుగంటల తర్వాత పోలీసులు వారిని అరెస్టు చేశారు. -
ఏపీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు వర్గాలన్నింటి కీ న్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ దళిత, బహుజన వర్గాలకు ఈ స్థాయిలో మంత్రి పదవులు కేటాయించలేదన్నారు. ఇది నిజంగా చరిత్రాత్మక అంశమన్నారు. బీసీలకు స్పీకర్ పదవి ఇవ్వడం గొప్ప విషయమని, ఏపీ కేబినెట్లో బీసీలకు 7, ఎస్సీలకు 5, ఎస్టీ, మైనార్టీలకు 1, కాపులకు 4 మంత్రి పదవులు ఇచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ పదవులు ఇవ్వడంతో వారి జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చూసి నేర్చుకోవాలన్నారు. తెలంగాణ మంత్రిమండలిలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. -
తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు అన్యాయం
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు రాజకీయ పక్షాలు అన్యాయం చేస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తపరిచారు. తెలంగాణ పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బీసీ సంఘాలు అనుసరించాల్సిన వ్యూహంపై జాతీయ బీసీ సంఘం కోర్ కమిటీ సమావేశం విద్యానగర్‌లోని బీసీ భవన్లో శనివారం ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు కేటాయించకుండా అన్యాయం చేశా యని విమర్శించారు. వాస్తవానికి జనాభా ప్రకారం బీసీలకు 9 సీట్లు కేటాయించాలని, కానీ ఆ పార్టీలు వారిని ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేవలం 4 ïసీట్ల చొప్పున కేటాయించి అన్యాయం చేశాయని విమర్శించారు. గ్రామాలలో బీసీ కులాల్లో విపరీతమైన రాజకీయ చైతన్యం వచ్చిందని, ఇష్టమొచ్చినట్లు టికెట్లు ఇస్తే గుడ్డిగా ఓట్లు వేయరని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితేనే రాజకీయంగా న్యాయం జరుగుతుందన్నారు. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ రిజర్వేషన్లు పెడతామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించే పార్టీలకే బీసీలు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారన్నారు. తటస్థంగా ఉంటే బీసీలకు ఇంకా 50 ఏళ్ల వరకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వరన్నారు. త్వరలో మరోసారి సమావేశమై విధాన ప్రకటన చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనకు ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నేతలు నీల వెంకటేష్, ఉపేందర్‌గౌడ్, శ్రీనివాస్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్
-
మాట తప్పని వీరుడు జగన్: ఆర్.కృష్ణయ్య
సాక్షి, ఏలూరు : మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు. బీసీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారు. బీసీలకు ఎంత బడ్జెట్ అయినా కేటాయిస్తామని మాట ఇచ్చి చేసి చూపించారు. బీసీల కోసం నాడు నా పోరాటాలకు వైఎస్సార్ స్పందించారు. బీసీల కోసం కమిటీ కూడా వేశారు. బీసీలకు ఏదైనా చేసిన నాయకుడు ఉన్నారంటే వైఎస్సార్ అనే చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ వల్లే మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆ చలవ వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. గురుకుల పాఠశాలలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. బీసీలు అభివృద్ధి కోసం నాడు వైఎస్సార్ పదేపదే తాపత్రయపడ్డారు. అదేవిధంగా తండ్రి అడుగు జాడల్లో జగన్ నడుస్తున్నారు. చట్టసభల్లో రిజర్వేషన్ల అమలు కోసం ఏ ఒక్క పార్టీ కూడా స్పందించలేదు. పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే హామీ ఇచ్చారు. పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్లపై పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డితో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ సీపీదే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. అప్పుడే రీయింబర్స్మెంట్ పథకం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. నేను 40సార్లు ప్రధానమంత్రిని కలిశానన్న చంద్రబాబు నాయుడు ఒక్కసారి అయినా బీసీల కోసం మాట్లాడారా?. సెంటిమెంట్లు, డబ్బులు, ప్రలోభాలు, క్షణికావేశాలకు బీసీలు లొంగిపోవద్దు. కచ్చితంగా వైఎస్ జగన్‌కే ఓటు వేయండి. మాట ఇస్తే తప్పని వ్యక్తి వైఎస్ జగన్. డిమాండ్లు పెడతానన్న భయంతోనే టీడీపీ బీసీ సభకు నన్ను పిలవలేదు. వైఎస్ జగన్ మీ డిమాండ్లు చెప్పాలని నన్ను ఆహ్వానించారు. -
10% కోటాపై కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లపై ఈ నెల 26లోపు సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలకు కేంద్రం సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. మరోవైపు ఆర్.కృష్ణయ తన పిటిషన్లో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికగా అమలు చేస్తారో తెలిపాలని కోరారు. కాగా ఈబీసీ రిజర్వేషన్లపై గతంలోనూ వ్యాపారవేత్త తెహసిన్ పూనావాలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై న్యాయస్థానం స్టే నిరాకరించింది కూడా. ఇక కేంద్ర ప్రభుత్వం అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం జనరల్ కోటాగా ఉన్న 50 శాతం నుంచే మరో పది శాతాన్ని పక్కకు తీసి ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో మార్పు ఉండదు. -
వైఎస్ జగన్ ఆహ్వానించారు: ఆర్.కృష్ణయ్య
-
వైఎస్ జగన్ ఆహ్వానించారు: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ సంఘం నాయకుడు ఆర్.కృష్ణయ్య శనివారం లోటస్‌పాండ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. భేటీ అనంతరం ఆర్. కృష్ణయ్య విలేకరులతో మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్‌పై చట్టసభల్లో చర్చ జరపాలని వైఎస్ జగన్‌ను కోరినట్టు తెలిపారు. 14 పేజీలతో కూడిన వినతిపత్రం ఆయనకు ఇచ్చినట్టు వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ గురించి మొట్టమొదటిగా ప్రైవేట్ బిల్లు పెట్టినందుకు వైఎస్ జగన్‌ను అభినందించినట్టు చెప్పారు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాజ్యసభలో తమ పార్టీ తరపున లేవనెత్తుతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. బీసీల కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి ఎంతో కృషి చేశారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ఈ నెల 17న ఏలూరులో నిర్వహించనున్న బీసీ గర్జన సభకు రమ్మని తనను వైఎస్ జగన్ ఆహ్వానించారని చెప్పారు. బీసీల కోసం ఎక్కడ సభ పెట్టినా, ఏ పార్టీ సభ నిర్వహించినా వెళ్తానని ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. -
‘పంచాయతీ’ల్లో బీసీలకు అన్యాయం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 22 శాతానికి తగ్గించడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మంగళవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 56 శాతం జనాభా గల బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా న్యాయమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీల్లో బీసీలకు 2,345 ఇవ్వడం దుర్మార్గమని, దీనిని బీసీలు క్షమించరన్నారు. సుప్రీంకోర్టు 2010 లోనే తీర్పు ఇచ్చినా.. అనంతరం 2013–గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే అమలు చేశారని గుర్తు చేశారు. ఈ 34 శాతం రిజర్వేషన్లు గత 30 ఏళ్లుగా కొనసాగుతున్నాయని, కొత్తగా ఇప్పుడు ఎందుకు అవరోధాలు వస్తున్నాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీతో చర్చలు జరిపి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టేందుకు కృషి చేయాలని కృష్ణయ్య కోరారు. ఈ నెల 28న కలెక్టరేట్ల ముట్టడి.. బీసీ రిజర్వేషన్లు 34 శాతంతోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న అన్ని జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడించి ధర్నాలు చేపట్టాలని బీసీ కుల సంఘాలకు కృష్ణయ్య పిలుపునిచ్చారు. అలాగే ఈ నెల 29న అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో కుల సంఘాలు, బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. బీసీలకు తగ్గించిన రిజర్వేషన్లను పెంచే వరకు పోరాటం కొనసాగుతుందని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. -
ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఆర్.కృష్ణయ్య
సాక్షి, మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రజా కూటమి బలపర్చన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని రెడ్డికాలనీ, ముత్తిరెడ్డికుంట, శాంతినగర్, అశోక్‌నగర్, సీతారాంపురం, హనుమాన్‌పేట, ప్రకాశ్‌నగర్, వినోభానగర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు స్వాగతం పలికారు. పలు వార్డులలో ర్యాలీలో నిర్వహించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, టీడీపీ నాయకులు బంటు వెంకటేశ్వర్లు, సాధినేని శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నాయకులు శంకర్‌నాయక్, గాయం ఉపేందర్‌రెడ్డి, రతన్‌సింగ్, తమన్న, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. పెరిక కుల ఉద్యోగుల సంఘం మద్దతు.. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మహాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్ధి ఆర్ కృష్ణయ్యకు పెరిక కుల ఉద్యోగుల సంఘం మద్దతు తెలియజేస్తున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంగని మల్లేశ్వర్ పేర్కొన్నారు. సమావేశంలో విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
సీట్లు ఎక్కువ ఇచ్చినోళ్లకే ఓట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకే బీసీలు ఓట్లు వేస్తారని బీసీ బహిరంగసభ తేల్చిచెప్పింది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీసీ బహిరంగసభ జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయ ణ అధ్యక్షతన జరిగిన ఈ సభకు సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఎంపీ బండారు దత్తాత్రే య, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రజాగాయకుడు గద్దర్, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నేతలు ర్యాగ అరుణ్, నీల వెంకటేశ్ తదితరు లు హాజరయ్యారు. రాజ్యాధికారమే ప్రధాన ఎజెం డాగా జరిగిన ఈ సభలో బీసీల సమగ్ర అభివృద్ధి కోసం 21 అంశాలతో తీర్మానాలు చేశారు. ఈ తీర్మాన ప్రతిని అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వనున్నామని, ఆయా పార్టీల మేనిఫెస్టోల్లో ఈ అంశాలను చేర్చినవాటికే మద్దతిస్తామని బీసీ సంఘం తెలిపింది. బీసీలను గెలిపించుకుందాం: ఆర్.కృష్ణయ్య జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్నిరంగాల్లో వాటా దక్కాలని ఆర్.కృష్ణయ్య అన్నారు. టికెట్లు పొందడానికి బీసీలకు అర్హత లేదనట్లు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని, వివక్ష చూపే పార్టీలకు బీసీలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీసీ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీల కంటే అధ్వానం: దత్తాత్రేయ ఎస్సీ, ఎస్టీల కంటే అధ్వానంగా బీసీలు బతుకుతున్నారని ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీలకు చట్టపరమైన రిజర్వేషన్లు లేకపోవడంతో ఇప్పటికీ వెనుకబడ్డారన్నారు. రన్నింగ్ బస్ దిగేశారు: జస్టిస్ చంద్రకుమార్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొందరపాటు చర్యలకు త్వరలో మూల్యం చెల్లించాల్సి వస్తుందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. బస్టాప్ రాకముందే రన్నింగ్ బస్ దిగారని, దీంతో గమ్యస్థానం పోకుండా దెబ్బతినడం ఖాయమన్నారు. బడుగులకు రాజ్యాధికారం దిశగా: తమ్మినేని బడుగులకే రాజ్యాధికారం రావాలనే దిశగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ముందుకు సాగుతోందని తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆర్.కృష్ణయ్య ఒప్పుకుంటే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామన్నారు. దొరల రాజ్యాన్ని అంతం చేయాలి: చెరుకు సామాజిక మార్పుతోనే బీసీ వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని చెరుకు సుధాకర్ అన్నారు. బీసీలు తమ ఓటుతో దొరల రాజ్యాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. మామ, అల్లుడి సంపాదన రూ.50 వేల కోట్లు: రమణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు బీసీలు చరమగీ తం పాడతారని ఎల్.రమణ అన్నారు. 20 ఏళ్ల క్రితం మంత్రి హరీశ్ హవాయి చెప్పులేసుకునే వారని, ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టుల్లో భారీగా సం పాదించారన్నారు. మామ, అల్లుళ్లు రూ.50 వేల కోట్లు సంపాదించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన బీసీ అభ్యర్థులకు పార్టీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడంలేదన్నారు. బీసీ బహిరంగసభ తీర్మానాలు ♦ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి ♦ అసెంబ్లీ, పార్లమెంటులో సీట్లను రెట్టింపు చేసి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించని కులాలకు నామినేటెడ్ పద్ధతిలో ప్రాధాన్యత ఇవ్వాలి ♦ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి ♦ రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ♦ బీసీలకు విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు -
4న బీసీ బహిరంగ సభ: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ డిమాండ్ల సాధనలో భాగంగా నవంబర్ 4న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం బీసీ భవన్లో బీసీ ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాన వాటా దక్కినప్పుడే ఎదుగుతారన్నారు. అందుకు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని, బహిరంగ సభతో బీసీల డిమాండ్లను రాజకీయ పార్టీలకు తెలపాలన్నారు. ఈ సభకు బీసీలు ఇంటికొక్కరు చొప్పున హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
వాళ్ల పిల్లలకు పదవులు..మా పిల్లలకు గొర్రెలు, బర్రెలా?
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సోషల్ ఇంజనీరింగ్ జరగాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు ఒక్కటే ప్రాతిపదిక కాకుండా.. కుల బలం, జన బలం కూడా ముఖ్యమనే కీలకాంశాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. సోషల్ ఇంజనీరింగ్‌తోనే బీసీలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపవచ్చన్నారు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కినపుడే.. బీసీలు అభివృద్ధిలో భాగస్వాములవుతారన్నారు. అప్పుడే వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ విషయాన్ని బీసీలు కూడా అర్థం చేసుకోవాలని కృష్ణయ్య కోరారు. టీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ విధానాల్లో మార్పు చేసుకోవాలని ఆయన సూచించారు. తాను ఎల్బీనగర్ నుంచే పోటీచేయాలా.. అసెంబ్లీ బరిలో నిలవాలా? వద్దా? అని నిర్ణయించుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఈసారి ఎన్నికలలో బీసీలు కీలకపాత్ర పోషించనున్నారన్న కృష్ణయ్య.. అన్ని పార్టీల మేనిఫెస్టోల ప్రకటన, టికెట్ల కేటాయింపు పూర్తయిన తర్వాతే ఏ పార్టీకి, కూటమికి మద్దతివ్వాలన్నది నిర్ణయించుకుంటామని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సాక్షి: బీసీలకు రాజ్యాధికారం కల్పించాలన్న లక్ష్యం దిశగా.. మీ వ్యూహమేంటి? కృష్ణయ్య : స్వాతంత్య్రం వచ్చిన 71ఏళ్లలో బీసీలకు రాజ్యాధికారంలో జనాభా నిష్పత్తి ప్రాతిపదికన సరైన వాటా దక్కలేదు. ఇటీవలే.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. దేశంలో బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల సంఖ్య 14% మాత్రమే. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలు, సామాజిక వర్గాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా ఇవ్వాలి. కానీ అది జరగడం లేదు. చట్టసభలన్నీ అగ్రకులాలతో నిండిపోతున్నాయి. మా పోరాటం వెనుక రెండు పవిత్రమైన ఆశయాలు, లక్ష్యాలున్నాయి. రాజ్యాధికారంలో బీసీలకు వాటా వస్తేనే అభివృద్ధి, ఆత్మవిశ్వాసం సాధ్యమవుతుంది. చట్టాలు, శాసనాలు చేయడంలో ప్రమేయం ఉంటేనే బీసీ వర్గాలకు ప్రయోజనం దక్కుతుంది. సామాజికంగా మా గౌరవం, హోదా పెరుగుతాయి. బీసీలది ఆకలిపోరాటం కాదు.. ఆత్మగౌరవ పోరాటం. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో 29 మంది సీఎంలుంటే.. అందులో ఒక్క బీసీ కూడా లేడు. ఇదెలా ప్రజాస్వామ్యం అవుతుంది? సీట్ల పంపకం, పదవులు అనుభవించడంలో ఈ సమానత్వం ఎందుకుండదు? ఈ మౌలికసూత్రాన్ని పాలకులు, రాజకీయపార్టీలు విస్మరిస్తున్నాయి. దీన్ని బద్దలు కొట్టే వ్యూహంతోనే ముందుకెళతాం. 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలేవీ బీసీలకు సరైన సంఖ్యలో టికెట్లిచ్చే పరిస్థితి లేదు. మీ డిమాండ్ ఏంటి? టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో బీసీలు కేవలం 20 మందే. ఇది బీసీలకు అన్యాయం చేయడమే. పార్టీ అభ్యర్థులను చూడొద్దు, నన్ను చూసి ఓట్లేయండి, నేనే గెలిపిస్తానని సీఎం కేసీఆర్ అంటున్నారు. మరి ఆయన్ను చూసి ఓట్లేసి గెలిపించాలనుకుంటే అభ్యర్థిగా ఎవరున్నా ఒక్కటే. అలాంటప్పుడు టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయాన్ని అమలుచేయడంలో కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బందేంటి? కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రాతిపదికగా టికెట్లు ఇస్తామంటోంది. అంటే అగ్రకులాలకిస్తేనే గెలుస్తారా? గెలుపు ప్రాతిపదిక డబ్బే కాదు.. జనబలం, కులబలం కూడా. ఈ విషయాన్ని కాంగ్రెస్ గమనించాలి. బీజేపీ కూడా టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించడం లేదు. వాళ్ల వైఖరి కూడా మారాలి. సాక్షి: బీసీలు ఇప్పటికీ పల్లకీ మోసే బోయీలుగానే ఉంటున్నారనే అభిప్రాయం ఉంది.. ఈ పరిస్థితుల్లో మార్పు ఎలా వస్తుందంటారు? కృష్ణయ్య: ఈ పార్టీలన్నీ అగ్రకుల పార్టీలే. బీసీల ప్రయోజనాలు కాపాడేవి కావు. అందుకే రాజకీయ పార్టీల్లోని బీసీ నాయకులకు నేను ఒక్కటే పిలుపునిస్తున్నా. ఎప్పుడూ జెండాలు మోసి, జిందాబాద్‌లు కొట్టి కట్టుబానిసలుగా ఉండడం కాదు. టికెట్ల కోసం నాయకత్వంపై తిరుగుబాటు చేయాలి. పోరాడాలి. మేం కూడా బీసీ సంఘాలుగా ఒత్తిడి తీసుకువస్తాం. రాజకీయాల్లో సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. అప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా సులభంగా గెలుస్తారు. అనామకులైనా ప్రజానాయకులై.. పాలనలో భాగస్వామ్యం పొందుతారు. మేనిఫెస్టోల్లో బీసీలకు మేలు చేకూర్చే ఎలాంటి అంశాలు ఉండాలనేది మీ డిమాండ్? బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలన్నది మా ప్రధాన డిమాండ్. దీంతో పాటు రూ.20వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ పెట్టేలా బడ్జెట్ కేటాయింపులుండాలి. పంచాయతీరాజ్ రిజర్వేషన్లను జనాభా దామాషాలో పెంచి చట్టబద్ధత కల్పించాలి. బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లకు రూ.10వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల నుంచి కోటి వరకు 90% సబ్సిడీతో రుణాలివ్వాలి. పారిశ్రామిక విధానంలో 50% వాటా ఇవ్వాలి. రాష్ట్రంలో బీసీల కోసం 500 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఇతర వర్గాలతో సమానంగా బీసీ విద్యార్థులందరికీ పూర్తిఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలి. అన్ని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో జనాభా ప్రాతిపదికన 50% వాటా ఇవ్వాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు వర్తింపజేయాలి. ఈ అంశాలన్నింటినీ ప్రధాన రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో పెడితేనే బీసీల మద్దతు లభిస్తుంది. రాజకీయ పార్టీ పెట్టాలంటూ మీపై ఒత్తిడి ఉంది. దీనిపై మీరేమంటారు? పార్టీ పెట్టాలని అందరూ ఒత్తిడి చేస్తున్నారు. మన ఓటు మనమే వేసుకుందాం అంటున్నారు. అధికారం ఉన్న చోటే అభివృద్ధి అనే విషయాన్ని బీసీలు గుర్తించారు. అభివృద్ధి పీఎంలు, సీఎంల చేతుల్లోనే ఉందని.. ఆ అభివృద్ధి తాము వేసే ఓట్లలో ఉందని గ్రహించారు. అయితే, తెలంగాణలో ఇప్పుడు పొత్తులకు మాత్రమే సిద్ధపడుతున్నాం. ఏపీలో పార్టీ పెట్టే కసరత్తు తీవ్రంగా జరుగుతోంది. గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. అక్కడ పార్టీ పెట్టడం.. 175 స్థానాల్లో పోటీచేయడం ఖాయం. నాలుగేళ్లలో బీసీలకు మేలు చేసే పథకాలు తెచ్చామని కేసీఆర్ అంటున్నారు కదా.. బీసీలకు కాస్తయినా మంచి చేసుంటే మేం అభినందించే వాళ్లం. అయితే.. బీసీలకు కేసీఆర్ మంచి చేయకపోగా చెడు చేశాడు. విద్య, ఉద్యోగాల్లో క్రీమిలేయర్‌ను బలవంతంగా బీసీలపై రుద్దాడు. దీని వెనుక కసి కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ అందరికీ పెట్టి బీసీలకు ఎందుకు ఇవ్వరు? అదనంగా రూ.150 కోట్లు లేవా? వేల మంది బీసీ విద్యార్థులు చదువు మానుకుని ఇండ్ల దగ్గర ఉంటున్నారు. బర్రెలు, గొర్రెలకు డబ్బులుంటాయి కానీ, ఫీజులకుండవా? వాళ్ల పిల్లలకు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు కావాలి.. మా పిల్లలు గొర్రెలు, బర్రెలు కాయాల్నా? ఏటా రూ.5వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని చెప్పి మొదటి రెండేళ్లు రూ.2వేల కోట్లిచ్చారు. అవి కూడా ఖర్చు చేయలేదు. కేసీఆర్ బీసీ వ్యతిరేక చర్యల లెక్క తీస్తే ఒక పుస్తకం అవుతుంది. పొత్తుల్లో భాగంగా టీడీపీ పోటీచేసే స్థానాల జాబితాలో మీ పేరుందా? అది టీడీపీ పార్టీని, చంద్రబాబును అడగాల్సిన ప్రశ్న. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీచేసే జాబితాలో నా పేరు, నా నియోజకవర్గం పెట్టకుండానే ఇచ్చారని తెలిసింది. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈసారి ఎన్నికల బరిలో ఉండాలనే ఆలోచన ఉందా? పోటీ చేయాలా.. వద్దా అనేది ఆలోచిస్తున్నా. ఎల్బీనగర్లోనే చేయాలని ప్రజలు అడుగుతున్నారు. నేను గెలిచిన తర్వాతే అభివృద్ధి జరిగిందని, నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని అక్కడి ప్రజల అభిప్రాయం. ఎల్బీనగర్లోనే పోటీచేయాలని అనుకుంటున్నా. తుది నిర్ణయానికి కొద్ది సమయం పడుతుంది. ఈసారి ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతివ్వబోతున్నారు? ఇప్పటివరకు బీసీలను రాజకీయ పార్టీలు ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప.. మా సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం లేదు. ఈ సారి ఎన్నికలలో బీసీలు చూస్తూ ఊరుకోరు. వారి విజన్ వారికుంది. ఆయా పార్టీల పట్ల వారి అభిప్రాయం వారికుంది. బీసీ సంఘాలుగా మా వాదన మేం వినిపిస్తున్నాం. నాలుగు దశాబ్దాల నా ఉద్యమ జీవితం ఇందుకు పునాది అవుతుంది. ఆయా పార్టీల మేనిఫెస్టోలు, టికెట్ల కేటాయింపులు పూర్తయిన తర్వాతే దీనిపై మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం. -
‘పోటీ పరీక్షల తేదీలు మార్చాలి’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న అర్హత పరీక్షలు వెంటవెంటనే ఉండటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. పరీక్షలు బుధవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి ఆయన వినతిపత్రం అందజేశారు. రానున్న రెండు నెలల పాటు వరుసగా పోటీ పరీక్షలున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలు వాయిదా వేసే పరిస్థితి లేనందున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్ష తేదీలను మార్చాలని కోరారు. రైల్వే పరీక్షలు వచ్చే నెలాఖరు వరకు ప్రతి రోజు మూడు షిప్టుల్లో ఉన్నాయని, ఇదే సమయంలో కానిస్టేబుల్, గురుకుల, ట్రాన్స్‌కో, గ్రూప్–4 పరీక్షలున్నాయన్నారు. ఈ నెల 30న కానిస్టేబుల్ పరీక్ష ఉండగా.. అదేరోజు ట్రాన్స్‌కో జేఏ పోస్టుకు సంబంధించిన పరీక్షలున్నాయని పేర్కొన్నారు. పరీక్షల తేదీలను పూర్తిస్థాయిలో పరిశీలించి పరస్పర విరుద్ధం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత విభాగాలకు సూచనలు చేస్తామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. -
జడ్జీల నియామకంలో రిజర్వేషన్లు కల్పించాలి
హైదరాబాద్: హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కోటా కల్పించాల ని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సభ్యులుగా గెలుపొందిన బీసీలకు అభినందన సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. గత 70 ఏళ్లుగా న్యాయస్థానాల్లో మెజారిటీ తీర్పులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా వస్తున్నాయన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఈ వర్గాల అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీస్తున్నారని విమర్శించారు. చట్టసభల్లో రిజ ర్వేషన్లు లేకపోవడం వల్ల ఈ కులాలకు న్యాయం జరగడం లేదని అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పంచా యతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచాలని, ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలని డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్‌కు ఎన్నికైన సిరికొండ సంజీవరావు, చలకాని వెంకట్ యాదవ్, శంకర్, డి.జనార్దన్, సునీల్ గౌడ్, ఫణీంద్ర భార్గవ్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడ్వకేట్ నాగుల శ్రీనివాస్ యాదవ్, కొండూరు వినోద్‌కుమార్, జనార్దన్ గౌడ్, విజయ్ ప్రశాంత్, కోల జనార్దన్, వేల్పుల బిక్షపతి, నర్సింహ గౌడ్, నీల వెంకటేశ్ జి.అంజి, అనంతయ్య, జైపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం కావాలి’
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం చూపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, సంఘం ప్రతినిధులు గుజ్జకృష్ణ, జైపాల్, రాజ్ కిరణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు దాటొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపిందని, ఈ సందర్భంలో సుప్రీంకోర్టు నుంచి స్టే కోసం కాకుండా శాశ్వతంగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. -
బీజేపీలో చేరటం లేదు: కృష్ణయ్య
పెద్దపల్లి: బీజేపీలో చేరుతున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరేది లేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు తనను కలిసింది వాస్తవమేనన్నారు. అయితే తాను మాత్రం బీజేపీలో చేరడం లేదన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా పూటకో మాట చెబుతూ పబ్బం గడుపుతూ వచ్చిందన్నారు. మొదట 40వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు 8,972పోస్టులకు తగ్గించిందన్నారు. ఇకనైనా తక్షణమే నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 11 బీసీ ఫెడరేషన్లకు తక్షణం రూ. 200 కోట్ల చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టేలా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. దేశవ్యాప్తంగా 36 రాజకీయ పార్టీలు కలిసి బీసీలకు మద్దతు కూడగట్టామన్నారు. -
అన్ని లెక్కలున్నా బీసీలపై అధ్యయనం ఎందుకు?
- ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య ప్రశ్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో బీసీ జనాభా కులాల వారీగా స్పష్టంగా తెలిసినా, రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ కమిషన్ ద్వారా ఆరు నెలలపాటు అధ్యయనం చేయిస్తామనడంలో అర్థం లేదని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. సమగ్ర సర్వేలో బీసీల స్థితిగతులు, సామాజిక, ఆర్థిక, విద్య పరిస్థితిపై సమగ్ర వివరాలు తేలాయని, వాటి ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచొచ్చని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రటకనలో పేర్కొన్నారు. అధ్యయనం పేరిట కాలయాపన చేయడం తప్ప పెద్దగా ఒరిగేదేంలేదని కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్రంలో బీసీల జనాభా 52శాతం ఉందని, ఆమేరకు నెలరోజుల్లో రిజర్వేషన్లు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్ల పెంపులో ఎలాంటి అధ్యయనం లేకుండా, అతి తక్కువ వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం... బీసీ రిజర్వేషన్ల పెంపులో మాత్రం ఎందుకు జాప్యం చేస్తుందో అర్థం కావడంలేదన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగం, పదోన్నతులు, రాజకీయాల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు. -
బీసీ సబ్‌ప్లాన్ ప్రస్తావన ఏదీ?
సాక్షి, హైదరరాబాద్: బడ్జెట్లో బీసీ సబ్‌ప్లాన్ గురించి ఎక్కడా ప్రస్తావిం చలేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విమర్శిం చారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ.. బీసీ సంక్షేమా నికి కేటాయింపులు ఏమూలకూ సరిపోవన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం కేటాయించిన నిధులు పాతబకాయిలకే సరిపోవన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటున్న ప్రభుత్వం, ఏయే కులాలు ఎంబీసీ పరిధిలోకి వస్తాయో చెప్పడంలేదన్నారు. బీసీ కార్పొరేష న్కు రూ.1000 కోట్లు కేటాయించి, ఉపాధి కోసం రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. 45వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా, ఉద్యోగాల భర్తీ ప్రస్తావన లేదన్నారు. ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయా లని కోరారు. అంకెల్లో భారీగా ఉన్నా అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం అడుగున ఉందన్నారు. -
అలోక్‌రెడ్డి కుటుంబసభ్యులకు నేతల పరామర్శ
హైదరాబాద్: ఇటీవల అమెరికాలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ అలోక్ రెడ్డి కుటుంబసభ్యులను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎల్బీనగర్ శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ నేత మల్లు రవి పరామర్శించారు. చైతన్యపురి లోని ఇంద్రానగర్ కాలనీలోని నివాసం ఉంటున్న అలోక్ తల్లిదండ్రులను నేతలు ఆదివారం కలిశారు. ప్రభుత్వ తరుపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, అన్ని విధాలా ఆదుకుంటామని, అధైర్య పడవద్దని వారికి కేంద్రమంత్రి భరోసానిచ్చారు. అమెరికాలో ఇటీవల మరణించిన తెలుగు వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విదేశాల్లో ఉంటున్న ప్రతి భారతీయుడికి రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, అక్కడి కాన్సులేట్ అధికారులతో విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోందని దత్తాత్రేయ తెలిపారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు ఆదివారం అమెరికా వెళ్తున్నట్లు అలోక్ రెడ్డి తల్లిదండ్రులు తెలిపారు. -
‘ఆర్. కృష్ణయ్యను ఇరికించే కుట్ర’
హైదరాబాద్: ప్రభుత్వం గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను ఇరికించే ప్రయత్నం చేస్తోందని బీసీ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ ఆరోపించింది. విచారణ పేరుతో పోలీసులు కృష్ణయ్యను ప్రశ్నించటంపై గురువారం ఆయా సంఘాల వారు ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ధర్నా చేపట్టారు. నయీం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. -
మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయాలి
-
5న ఉస్మానియాలో పోరు దీక్ష: కృష్ణయ్య
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల రూ. 2 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5న ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో వేలాది మందితో పోరు దీక్ష నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. సోమవారం ఇక్కడి బీసీ భవన్లో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగిం ది. కృష్ణయ్య మాట్లాడుతూ రెండేళ్ల ఫీజు బకాయిలు మొత్తం రూ. 3,140 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించినప్పటికీ ఇంకా విడుదల కాలేదన్నారు. దీంతో విద్యార్థులు సమస్యలెదుర్కొంటున్నారన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ జాతీయ విద్యార్థి సంఘం కన్వీనర్ ర్యాగ అరుణ్, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు. -
యాక్షనా? యాక్టింగా ?
-
‘నయీం నన్ను సీఎం కావాలనుకున్నాడు’
-
‘నయీం నన్ను సీఎం కావాలనుకున్నాడు’
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీంతో తనకు సంబంధాలు ఉండేవని, అయితే అవి ఆర్థికపరమైనవి కావని, రాడికల్ యూనియన్‌లో పని చేసినప్పుడు సంబంధాలు ఉండేవని, తాను ముఖ్యమంత్రి కావాలని నయీం కోరుకునే వాడని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో శుక్రవారం అన్నారు. ప్రభుత్వం చర్యను సమర్థిస్తున్నా నయీం అరాచకాలు చేశారని, కాబట్టి ప్రభుత్వ చర్యను తాను సమర్థిస్తున్నానని చెప్పారు. అయితే దీనిపైన సమగ్ర విచారణ జరపాలన్నారు. నయీం కేసులో తన పైన ప్రభుత్వం బురద జల్లుతుందని చెప్పారు. తనకు సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) నోటీసులు ఇస్తే తాను సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నోటీసులు ఇస్తే వెళ్తా తనకు సిట్ నోటీసులు ఇస్తే కచ్చితంగా మాట్లాడుతానని కృష్ణయ్య తెలిపారు. అయితే సిట్ దర్యాఫ్తులో పారదర్శకత లేదని, దీనిని సీబీఐకి అప్పగించాలని, రాజకీయ దురుద్దేశ్యంతో తనను టార్గెట్ చేస్తున్నారన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం నయీంతో కలిసినట్లుగా చెప్పడం సరికాదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి నాలాంటి నిజాయితీపరుడిపైన ఆరోపణలు చేయటం సరికాదని, తాను తన వాళ్ల కోసం పని చేస్తున్నానని, ముఖ్యమంత్రి పదవి కోసం కాదని కృష్ణయ్య అన్నారు. ఎల్పీ నగర్లో పోటీ చేసిన సమయంలో తనకు నయీం డబ్బులు పెట్టారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. తనలాంటి నిజాయితీపరులైన వారిని టార్గెట్ చేయడం విడ్డూరమన్నారు. నయీంతో తనకు ఆర్థికపరమైన సంబంధాలు ఉన్నట్లు సిట్ నిరూపిస్తే తాను చట్టపరమైన శిక్షకు సిద్ధమన్నారు. తనకు మాత్రం ఆర్థికపరమైన సంబంధాలు లేవని చెప్పారు. నయీం వ్యవహారంలో అధికార పార్టీ నేతలే 99 శాతం మంది ఉన్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నయీంతో సంబంధాలు కలిగిన వారిలో ఉన్నారన్నారు. నయీంను బెదిరించా : తన వద్దకు రోజుకు బాధల్లో ఉన్నవారు చాలామంది వస్తారని, వారి తరఫున తాను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పని చేస్తానని కృష్ణయ్య అన్నారు. అలాగే నయీం బాధితులు కూడా కొందరు తన వద్ద గోడును వెళ్లబోసుకున్నారని, వారి తరఫున నయీంకు ఫోన్ చేసి తిట్టానని చెప్పారు. నయీం మరో ముగ్గురితో కలిసి లొంగిపోవాలనుకున్నాడని, ఈ విషయాన్ని తమకు చెబితే, లొంగిపోయినప్పుడు చూద్దామని చెప్పానన్నారు. నయీం చేసే దురాగతాలు తమకు అంతగా తెలియవన్నారు. తాను సీఎం కావాలన్నది నయీం కల అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నయీం తనకు సీఎం పదవి మిస్ అయిందని, తనలాంటి బడుగుల నేత సీఎం కావాలని అతను కోరుకునేవాడన్నారు. తాను గతంలో భువనగిరి ఉర్సు, వినాయక ఉత్సవాలలో పాల్గొన్నానని చెప్పారు. ఉద్యమం సమయంలోనే నయీంతో సంబంధాలు ఉన్నాయన్నారు. కొద్ది నెలల క్రితం అతనితో మాట్లాడానని, ఇక నయీంని కలవక చాలా రోజులు అవుతోందన్నారు. అయితే, గత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని తమను టార్గెట్ చేయడం సరికాదని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. -
ప్రత్యేక హోదా కోసం ఆర్.కృష్ణయ్య పోరాటం
ముషీరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ బీసీ సంఘాల సమావేశం ఏపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవ్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఈ నెల 9వ తేదీన కాకినాడలో పవన్ కళ్యాణ్ నిర్వహించే ఆత్మగౌరవ సభకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం తెగించి పోరాటం చేస్తామని, ఢిల్లీలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్, బీసీ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కులకచర్ల శ్రీనివాస్, అరుణ్ యాదవ్, కృష్ణ యాదవ్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం తగదు
దోమలగూడ: ఉద్యోగాల భర్తీలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రాష్ట్రాల నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్, బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారన్నారు. నిధులు, నియామకాలు, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, నేడు నిధులు కాంట్రాక్టర్లకు భోజ్యమయ్యాయని, నియామకాలు గాలికి, నీళ్లను సముద్రానికి వదిలేశారన్నారు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 3 వేల ఇంజనీరింగ్ పోస్టులను మాత్రమే భర్తీ చేయడం దారుణ మన్నారు, గ్రూపు2 సర్వీసు ఉద్యోగాలను నోటిఫై చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. గ్రూపు 1నోటిఫికేషన్లు విడుదల చేయలేదని, టీచర్ల పోస్టులు భర్తీ చేయడం లేదని ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 10 వేల టీచర్ల పోస్టులు మినహా ఒక్క పోస్టు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు గుణపాఠం తప్పదని హెచ్చరిం చారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్, కృష్ణ, రాజేందర్, కృష్ణయాదవ్, శ్రీనివాస్, కి షోర్, రాజు, గంగనబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు -
రాజ్యాధికారం దక్కినప్పుడే నివాళి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం దక్కినపుడే సర్దార్ సర్వాయి పాపన్నకు నిజమైన నివాళి అని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. పాపన్న ఆశయ సాధన కోసం బహుజన వర్గాలు ఐక్యతతో ముందుకెళ్లాలని సూచించారు. గురువారం బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 366వ జయంతి ఉత్సవాలు జరిగాయి. కృష్ణయ్య మాట్లాడుతూ, ఏళ్ల క్రితమే బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించిన సర్వాయి పాపన్న చరిత్రలో గొప్ప పాలకుడిగా, బహుజనులకు స్ఫూర్తిగా నిలిచాడని అన్నారు. పాపన్న స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా సంఘటితంగా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. పాపన్న స్వయం పాలనను ప్రకటించుకుని పాలించినట్లే, తెలంగాణలో కూడా బీసీలు 2019లో రాష్ట్ర అసెంబ్లీపై బీసీల జెండాను ఎగురవేయాలన్నారు. పాపన్న జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వమే నిర్వహించాలని, పాపన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, బీసీ మండల్ తదితరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ర్యాగ అరుణ్, శారదాగౌడ్, గూడూరు భాస్కర్, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, సువర్ణ, అరుణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు రాజ్యాధికారం వస్తేనే అభివృద్ధి
ఐక్యపోరాటాలతోనే సాధించుకోవాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పెద్దపల్లిరూరల్: బీసీలకు రాజ్యాధికారం వచ్చిననాడే అందరూ అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని, అందుకు ఐక్య పోరాటాలే మార్గమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. పెద్దపల్లిలో బుధవారం జరిగిన బీసీల చైతన్యసదస్సులో మాట్లాడారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలలో విభేదాలు సృష్టించి ఓట్లకోసమే అగ్రవర్ణాలు వాడుకుంటున్నాయని పేర్కొన్నారు. బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగితే రాజ్యాధికారం రావడం కష్టమేమీ కాదన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో సాగుతున్న కుల ఉద్యమాలే నిదర్శనమని గుర్తుచేశారు. చట్టసభలతోపాటు స్థానిక సంస్థలలోనూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇందుకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు జీతాలు పెంచుకున్న పాలకులు బీసీ విద్యార్థులకిచ్చే ఉపకారవేతనాలను ఎందుకు పెంచడంలేదని ప్రశ్నించారు. దొరల పాలనకు చరమగీతం పాడాలని, అందుకు ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్, పెద్దపల్లి నుంచే నాంది కావాలన్నారు. బీసీలకు సంక్షేమపథకాల అమలులోనూ అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నితే ఆందోళనలు చేసి సాధించుకున్నామన్నారు. బీసీలకు కళ్యాణలక్ష్మిని కూడా వర్తింజేసేలా ప్రభుత్వంతో పోరాడామని గుర్తు చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్, నాయకులు అరుణ్‌కుమార్, చేతి ధర్మయ్య, శ్రీధర్‌రాజు, చాట్ల మల్లేశం, నోమూరి శ్రీధర్‌రావు, రాజేశ్వరి, రాజేందర్, రణధీర్‌సింగ్, రామగిరి ప్రవీణ్, శ్రీనివాస్, బుచ్చిబాబు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ను కలసిన ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కలిశారు. బుధవారం లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసంలో కలసిన కృష్ణయ్య.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని కోరారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుందన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్నానని.. అందులో భాగంగా వైఎస్ జగన్ ను కలిసినట్లు కృష్ణయ్య తెలిపారు. -
ఖాళీలు వేలల్లో.. నియామకాలు వందల్లోనా?
బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: లక్షల్లో ఉద్యోగాల జాతర అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో అమలు తీరుకు ఎక్కడా పొంతన లేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వశాఖల్లో వేలాదిగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వందల్లో నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయడం శోచనీయమన్నారు. గురువారం హైదరాబాద్ అంబర్‌పేటలో జరిగిన నిరుద్యోగ జేఏసీ గర్జనసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణవ్యాప్తంగా 2 లక్షల భర్తీ కోసం తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలను 439 నుంచి 3,500 పెంచాలని, 1,200 గ్రూప్-1, 8,000 గ్రూప్-3, 36,000 గ్రూప్-4 ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ, జూనియర్, డిగ్రీ, ఎయిడెడ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయ పోస్టులను 15,600 నుంచి 39 వేలకు పెంచాలన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు నీల వెంకటేశం, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, విద్యార్థి సంఘం అధ్యక్షుడు ర్యాగ రమేష్, నిరుద్యోగులు పాల్గొన్నారు. -
చంద్రబాబు కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: కాపుల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్వంద్వ నీతిని అనుసరిస్తున్నారని, బీసీలను ధర్నాలు చేయాల్సిందిగా కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఓ వైపు ముఖ్యమంత్రి స్వయంగా రిజర్వేషన్లు కల్పిస్తామని కాపులతో చెబుతూ మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేతోనే అందుకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలంతా ఆయన మోసపూరిత వైఖరిని గమనించాలని కోరారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే (ఆర్.కృష్ణయ్య) కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ధర్నాలు చేయండని పిలుపునిస్తూ ఉంటే ఆయనకు నచ్చజెప్పుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. కృష్ణయ్యకు సూటి ప్రశ్న ‘నేనూ బీసీనే.. మీరూ (కృష్ణయ్య) బీసీనే.. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా.. మీరు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో తూర్పు కాపు, కొప్పుల వెలమ, గౌడ్లు, కాళింగ వంటి 23 బీసీ కులాలను బీసీల జాబితా నుంచి తొలగిస్తే ఎందుకు కిమ్మనకుండా ఉండి పోయారు. కనీసం నిరసన కూడా ఎందుకు తెలపలేదు. మీ సొంత రాష్ట్రంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో ఎప్పటి నుంచో 1953 నుంచి బీసీలుగా గుర్తింపు పొందిన కాపులు తమ రిజర్వేషన్లను పునరుద్ధరించాలని ఉద్యమం నడుపుతూ ఉంటే అందుకు నిరసనగా ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? చంద్రబాబు కుటిలనీతిలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నట్లు కాదా?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. కాపులు మంచోళ్లు అంటూనే బైండోవర్లు తీసుకుంటారా!? చంద్రబాబు కాపులు మంచోళ్లని మాటలు చెబుతూ చేతల్లో మాత్రం వారిని సంఘ విద్రోహశక్తులుగా, దుండగులుగా చిత్రీకరిస్తున్నారని, దీన్ని బట్టి ఆయన బుద్ధి తెలిసిపోతోందని బొత్స చెప్పారు. రాష్ట్రంలో అన్ని పోలీసు స్టేషన్లలోను ఆ పరిధిలోని ఓ మోస్తరు కాపు నేతలను, చురుగ్గా ఉండే వారిని పోలీసులు పిలిపించి తాము ధర్నాలు, రాస్తారోకోలు చేయబోమని, శాంతిభద్రతలకు భంగం కలిగించబోమని, ఒకవేళ అలా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలకు బాధ్యులమవుతామని ‘బైండోవర్లు’ తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బైండోవర్లను తీసుకోవడాన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. తునిలో రైలును తగులబెట్టిన విధ్వంస ఘటనల వెనుక టీడీపీ వాళ్లే ఉన్నారని సాక్షాత్తు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభమే చెబితే ఇంతవరకు ప్రభుత్వం అందుకు సమాధానం ఇవ్వలేదని గుర్తుచేశారు. తూర్పు గోదావరి జిల్లాలోకి ఇతర నేతలెవ్వరూ వెళ్లకూడదని ఆ జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలు రాచరిక వ్యవస్థను గుర్తుకు తెస్తున్నాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇటువంటిది ఉంటుందిగానీ ఇప్పుడెందుకు ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించారు. -
’బీసీ ఉద్యమమే నాకు ముఖ్యం’
-
పటేళ్లను బీసీల్లో చేరిస్తే అంతర్యుద్ధమే
రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కుట్ర చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించి తీరుతాం: ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తివేయాలని కోరుతున్న పటేళ్లకు రిజర్వేషన్లు కోరే నైతిక అర్హత లేదని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీ య సెక్రటరీ జనరల్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షతన జాతీయ ఓబీసీ కుల సంఘాల ప్రతినిధుల మహాసభ నిర్వహించా రు. ఈ సభకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది కులసంఘ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో దేశవిదేశాల్లో ఆధిపత్యాన్ని కొనసాగి స్తున్న పటేళ్లు ఎలా రిజర్వేషన్లకు అర్హులో చెప్పాలన్నారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్న సమయంలో దానికి భిన్నంగా రిజర్వేషన్లే ఎత్తివేయాలనే కుట్రతో అగ్రకుల పారిశ్రామికవేత్తలు పటేళ్ల ఓబీసీ కోటా ఉద్యమాన్ని ముందుకు తెచ్చారని కృష్ణయ్య మండిపడ్డారు. ఇలాంటి కుట్రలను ఎంత మాత్రం సహించబోమని జాతీయ స్థాయిలో బలమైన ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోమని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో ‘రాష్ట్రీయ ఓబీసీ అరక్షణ్ బచావో ఆందోళన్’ పేరిట బలమైన ఉద్యమాన్ని చేపట్టి ఛలో ఢిల్లీ ఆందోళనతో ఉన్నత వర్గాల వారికి తగిన గుణపాఠం నేర్పుతామన్నారు. కర్ణాటక రాష్ట్ర ఓబీసీ సంఘటన్ అధ్యక్షుడు, మాజీ మంత్రి జేడీ. పుట్టస్వామి మాట్లాడుతూ ఉద్యమంలో తామూ పాల్గొంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సమన్వయ కర్త గుజ్జ కృష్ణ, ప్రజా గాయకురాలు విమలక్క, తెలంగాణ బీసీసంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, అఖిల భారత గాండ్ల, తైలిక్ సాహు నాయకుడు పి. రామకృష్ణయ్య, సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు, పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణయ్య జన్మదినాన సేవా కార్యక్రమాలు బీసీ ఉద్యమనేత ఆర్. కృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వివిధసేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కృష్ణయ్య పుట్టినరోజును బీసీ కులసంఘాలు, బీసీ శ్రేణులు ‘బీసీడే’గా గుర్తించి సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. -
రైతు ఆత్మహత్యాయత్నం
వేములపల్లి (నల్లగొండ): అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన ఆర్. కృష్ణయ్య తనకున్న ఆరు ఏకరాల పొలంలో పత్తి పంట సాగుచేస్తున్నాడు. ఈ ఏడాది పంట పెరుగుదల సరిగా లేకపోవడం, గత ఏడాది అప్పులు తీరే మార్గం లేకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
బీసీల కోసం రాజకీయ పార్టీ
* చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లకు ఉద్యమం * జాతీయ స్థాయి సదస్సులో ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టేలా దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. ఇందు కోసం జాతీయ స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. బిల్లుకు మద్దతుగా పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, వివక్ష నేతలతో భేటీలు నిర్వహించి, ఆయా అసెంబ్లీలలో ఏకగ్రీవ తీర్మానాల కోసం ప్రయత్నిస్తామన్నారు. దీని కోసం ముందస్తుగా ఆయా రాజకీయ పార్టీల నుంచి లేఖలు కోరతామని తెలిపారు. బిల్లుకు మద్దతు ఇవ్వని పార్టీలను బీసీ వ్యతిరేక పార్టీలుగా ముద్రవేసి, వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే బీసీల కోసం జాతీయ స్థాయిలో తానే స్వయంగా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. విస్తృత ప్రచారం కోసం ప్రజల భాగస్వామ్యంతో టీవీ చానల్ సహా దినపత్రిక ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం అబిడ్స్ తాజ్హోటల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షతన జరిగిన ‘బీసీ జాతీయ మేధోమథనం’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జాతీయస్థాయి నిపుణులతో పది కమిటీలు ఏర్పాటు చేసి 29 రాష్ట్రాల్లో పర్యటించి బీసీ బిల్లుకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సదస్సు తీర్మానించింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగంలో మెజారిటీగా బీసీ సామాజిక వర్గాల రైతులే ఉన్నారని, ఇలాంటి మరణాలు పునరావృతం కాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫిక్కీ, డిక్కీ తరహాలో బీసీ పారిశ్రామిక వేత్తలతో జాతీయ స్థాయి వాణిజ్య, పారిశ్రామిక, కాంట్రాక్టర్ల మండలి ఏర్పాటుకు ఒత్తిడి చేయాలని తీర్మానించారు. ఈ సదస్సులో ఆచార్య ప్రమోద్ తిర్ తుళ్, కలైష్ బాపు భుజ్‌బల్(మహారాష్ట్ర), ఆచార్య యోగేంద్రనాథ్(న్యూఢిల్లీ),రమణ్‌సింగ్(జార్ఘండ్), ఆచార్య బీరేంద్రయాదవ్(యూపీ), డా. అశ్విన్గురు(కేరళ), డా.వల్లభనన్(తమిళనాడు), డా.రెవణప్ప (కర్ణాటక), బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, సదస్సు సమన్వయకర్త గుజ్జ కృష్ణ, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాల ప్రతినిధులు ఆచార్యులు సుబ్బాచారి, మన్య చెన్నప్ప, ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు విన య్‌కుమార్, కాలువ మల్లయ్య, కత్తి వెంకటస్వామి, శారదా గౌడ్, ప్రసాద్, భూపతి వెంకటేశ్వర్లు, కత్తి కవిత, న్యాయవాది జనార్ధన్ మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాంస్కృతిక, భావ జాల ఉద్యమాన్ని... తెలంగాణ పోరాటంలా చేపట్టాలన్నారు. ఈ సదస్సులో 10 రాష్ట్రాల నుంచి 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. -
'సీఎంకు అంత దమ్ము లేదు'
భువనగిరి: ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసే దమ్ము తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గెలవలేరని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఫీజుల చెల్లింపులో జాప్యం వెనుక కుట్ర దాగుందని, పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీ ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. విద్యా రంగ సమస్యలపై ఈ నెల 21న తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఆర్. కృష్ణయ్య ఈ సందర్భంగా కోరారు. -
రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి
మంత్రి జోగు రామన్నకు బీసీ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో రూ.20 వేల కోట్ల బడ్జెట్‌తో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటుచేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగురామన్నకు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని ప్రతినిధిబృందం విజ్ఞప్తిచేసింది. బీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించాలని, బీసీ కాలేజీ హాస్టళ్ల స్వంతభవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉన్నత చదువులకోసం రుణాలు పొందడానికి తల్లిదండ్రుల వార్షిక ఆదాయపరిమితిని రూ.2 లక్షలకు పెంచాలని కోరా రు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో మంత్రి జోగురామన్నకు బీసీ సంక్షేమసంఘం నేత ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో శ్రీనివాస్‌గౌడ్, గుజ్జకృష్ణ, ర్యాగరమేష్, శ్యామ్, పి.ఉష, రవి, ఎం.వీణ, మల్లేష్‌యాదవ్ వినతిపత్రాన్ని సమర్పించారు. కాగా, బీసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపినట్లు కృష్ణయ్య వెల్లడించారు. -
'ఇంటికో ఉద్యోగం ఇచ్చేదాకా కేసీఆర్‌ను వదలం'
హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం వనస్థలిపురంలో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది, ఈ సంవత్సరం కలుపుకుని ఈ రెండేళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
సర్పంచులకు చెక్ పవర్ ఏదీ?
హైదరాబాద్: పంచాయతీ సర్పంచులకే చెక్‌పవర్ ఇవ్వాలని నాలుగు నెలల కిందట హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడం, స్థానిక సంస్థల అధికారాలను కాలరాయడమేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సర్కారు తీరును తప్పుపట్టారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని తక్షణమే హైకోర్టు తీర్పు అమలు చేయాలని గురువారం డిమాండ్ చేశారు. అలాగే.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు మూడు నెలల క్రితం సీఎం ప్రకటించినా.. ఉత్తర్వులు జారీ కాకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు. హామీలతో ఉద్యమాలను నీరుగార్చి, ఆ పై అమలు చేయకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని ఆర్.కృష్ణయ్య ఈ సందర్భంగా హెచ్చరించారు. -
5,6 తేదీల్లో ఢిల్లీలో బీసీల ఆందోళన
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం రెండు రోజుల ప్రదర్శన పోరాటాలతోనే బీసీ హక్కుల సాధన: మీడియాతో ఆర్. కృష్ణయ్య హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే చట్టసభల్లో వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టాలన్న డిమాండ్‌తో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. టీడీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది బీసీలతో మే 5, 6 తేదీల్లో పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. రాజ్యాంగ రచన సమయంలోనే వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితే దేశంలో సామాజిక న్యాయం జరిగి ప్రగ తి పథాన నడిచేవాళ్లమని అన్నారు. తెల్ల దొరల పాలనలో 1921లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు రోస్టర్ పద్ధతిలో జనాభా నిష్పత్తితో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఛలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా బీసీ వర్గానికే చెందిన ప్రధాని మోఢీకి జరిగిన అన్యాయాన్ని తెలియజే సి, చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించుకుంటామని అన్నారు. అలాగే ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి బీసీలకు రాజ్యాంగ బద్ధమైన వాటా ఇవ్వాలని ఒత్తిడి తెస్తామన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయిస్తామన్నారు. లేఖ రాయని పార్టీలను బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటించి ప్రచారం చేస్తామని చెప్పారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు ప్రతిపక్ష నేతలు సోనియాగాంధీ, ములాయం సింగ్ యాదవ్, శరద్‌యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్, దేవగౌడ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఆమ్ఆద్మీ మొదలైన 36 పార్టీల నేతలను కలుస్తామన్నారు. దేశంలో 56 శాతం జనాభా గల బీసీలకు చట్టసభల్లో 12 శాతం ప్రాతినిథ్యం కూడా లేదని, 2600 బీసీ కులాల్లో 2560 కులాలు పార్లమెంటు గేటు కూడా దాటలేదని చెప్పారు. 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ కూడా పార్లమెంటుకు రాలేదని వివరించారు. ఈ నేపథ్యంలో పోరాటాలతోనే బీసీ హక్కులను సాధించుకోవాలని నిర్ణయించి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. -
అర్హులందరికీ ఫీజులు చెల్లించాలి
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అర్హతను పది వేల నుంచి అయిదు వేల ర్యాంకుకు తగ్గిస్తే ఇంకా ఆ పథకం ఎందుకని బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాసగౌడ్ ప్రశ్నించారు. రూ.లక్ష లోపు ఆదాయమున్న అర్హులైన ప్రతి విద్యార్థికి ర్యాంకులతో సంబంధం లేకుండా ఫీజులు మొత్తం మంజూరు చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల మాటలు వింటే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. ఫీజులపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని, వెంటనే అఖిల పక్ష భేటీని నిర్వహించి విధాన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మలిదశ ఫీజుల పోరు తప్పదని హెచ్చరించారు. -
ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం:ఆర్.కృష్ణయ్య హెచ్చరిక
హైదరాబాద్: విద్యార్థులకు 8 రోజులలోపల తెలంగాణ ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని లేకపోతే పరీక్షలు జరుగనివ్వం, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఎల్బి నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వానికి 12వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉందని, అయినా 12 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం సరికాదన్నారు. పేదవిద్యార్థులు చదువుకోవడం చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ఇద్దరూ అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ** -
'హే కృష్ణా'.... ఇందిరా పార్కే బెటర్!
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే ....అన్నట్లుగా ఉంది ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పరిస్థితి. అనవసరంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టానురా కృష్ణా..అని మధనపడుతున్నారట. ఎన్నికల ముందు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి మీద ఆశపడి రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎరక్కపోయి వచ్చాను ...ఇరుక్కుపోయాను అని అనుచరుల వద్ద వాపోతున్నారట. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎర చూపి రంగంలోకి దింపిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ...ఆ తర్వాత తూచ్ అంటూ చివరకు పార్టీ శాసనసభా పక్ష నేతగా కూడా అవకాశం ఇవ్వకుండా మొండి చేయి చూపించటమే కృష్ణయ్య అసంతృప్తికి కారణమైంది. కనీసం తెలంగాణలో పార్టీ ప్రెసిడెంట్ పదవైనా దక్కుతుందేమో అనుకుంటే ఎన్నికలు జరిగి ఆరు నెలలు దాటినా ఆ ఊసే లేదు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే సీఎంను చేస్తామన్న బాబు... ఆఖరుకు శాసనసభా పక్షనేత పదవి కూడా ఇవ్వలేదని కృష్ణయ్య గత కొంత కాలంగా టీడీపీతో అంటీ ముట్టనట్లుగా ఉండడమే కాకుండా ఎక్కడా కనీసం పచ్చ కండువాను కూడా ఇష్టపడటంలేదు. దాంతో కొద్దిరోజుల క్రితం కృష్ణయ్య సైకిల్ దిగి ...కారు ఎక్కుతారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఏం జరిగిందో కానీ ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వచ్చినా.. ఆయన మాత్రం తనదారి...సపరేట్ అన్న చందంగా వ్యవహరించారు. సభలో టీడీపీ గందరగోళం సృష్టించినా కృష్ణయ్య మాత్రం నిమ్మకునీరెత్తినట్లే ఉండటం విశేషం. పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తే...వారినే అనుసరించేవారు అంతే. సమావేశాలకు హాజరైనా..పార్టీ సభ్యులతో సంబంధం లేనట్లు రావటం, వెళ్లడం సైలెంట్‌గానే జరిగాయి. ఈ వ్యవహారమంతా గమనించిన టీడీపీ శాసనసభపక్షనేత ఎర్రబెల్లి...ఉండబట్టలేక కృష్ణయ్యను కదిలించారట. దాంతో కడుపు చించుకుంటే కాళ్లమీద పడ్డట్టుగా..'సభలో మాట్లాడే అవకాశమే రాలేదు. ఇంతకన్నా ఇందిరా పార్క్ దగ్గరే నయం...ఉద్యమాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరిగినప్పుడు మాట్లాడేవాడిని. నేను మాట్లాడాలనుకుంటే...ఇందిరా పార్క్ వద్దకు వెళ్లటమొక్కటే మార్గం' అని వాపోయారట. -
28న బీసీ విద్యార్థుల మహాగర్జన: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను మొత్తం చెల్లించాలని, పథకాన్ని యథావిధిగా అమలుచేయాలని, ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లను రూ. రెండు వేలకు పెంచాలనే డిమాండ్లతో ఈ నెల 28న బీసీ విద్యార్థుల మహాగర్జనను నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలి పారు. విద్యా సంవత్సరం మొదలై ఆరునెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై ‘ఫాస్ట్’ కమిటీని వేసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా జరగలేదన్నారు. -
ఇంటికో ఉద్యోగం ఎటుబోయింది ?
హైదరాబాద్: ఇంటికొక ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి వచ్చిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగుల ఊసెత్తకపోవడం అత్యంత దారుణమైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా వచ్చిన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బడ్జెట్లో నిరుద్యోగులకోసం, స్వయం ఉపాధి పథకాలకు కేటాయింపులు జరగలేదని తెలిపారు. ఇంటికొక ఉద్యోగం ఇచ్చే వరకు మంత్రుల వెంటపడతామని అందుకు నిరుద్యోగ యువత సిద్ధమవుతున్నారన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని అనేక మంది తమ ప్రాణాలను అర్పించారని కానీ ఉద్యోగాలు రాలేదన్నారు. ముఖ్యమంత్రి ఇంట్లో మాత్రం నాలుగు ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వమంటే ఐదుమంది మంత్రులు పని చేయడం కాదని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక పనులు పూర్తిగా అగిపోయాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మరో మహా పోరాటం జరుగక తప్పదని తర్వలో లక్షాలది మందితో నిజాం కాలేజీలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
బీసీలకు అన్యాయం చేస్తే సహించం
తెయూ(డిచ్పల్లి): దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీ వర్గాలకు సామాజిక రక్షణ చట్టం అమలు చేయాలని, బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఁనవ తెలంగాణ నిర్మాణం- బీసీలు-సవాళ్లు* అన్న అంశంపై శుక్రవారం నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బీసీలు ఐకమత్యంగా, చైతన్యవంతంగా ఉండాలన్నారు. ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చిన బీసీ రిజర్వేషన్లకు క్రిమిలేయర్ పెట్టారని విమర్శించారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడితే బీసీలకు న్యాయం జరుగుతుందని అనేక మంది బీసీ ఉద్యమకారులు త్యాగాలు చేశారని గుర్తుచేశారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేలకు గానూ కేవలం 19మంది మాత్రమే బీసీలు ఉన్నారన్నారు. ఉద్యోగాలలో క్రిమిలేయర్ లేని రిజర్వేషన్, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, బడ్జెట్లో 50 శాతం బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 50శాతం రిజర్వేషను కల్పించాలని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని, సామాజిక రక్షణ కోసం బీసీ యాక్ట్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ జోలికి రావొద్దు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హ యాంలో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీ జు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరు గార్చేం దుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కృష్ణయ్య విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం జోలికొస్తే ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధమని హెచ్చరించారు. విద్యార్థులకు మొత్తం మెస్ చార్జీలను చెల్లించాలని, విద్యార్థులకు పాకెట్‌మనీ ఇవ్వాలన్నారు. వ ర్సిటీలలో వైస్ చాన్స్‌లర్ పోస్టుల భర్తీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలోనే బీసీ టోల్‌ఫ్రీ నంబర్ బీసీలను ఎవరైనా వేధింపులకు గురిచేస్తే స హించేది లేదని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. త్వరలోనే 24గంటల టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు, అధ్యాపకులు ఐకమత్యంతో ఉండాలని సూచించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీలందరూ చైతన్యంతో పనిచేయాలని కోరారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఫాస్ట్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సభకు అధ్యక్షత వహించిన తెయూ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ ధర్మరాజు మాట్లాడుతూ ఉద్యోగాలలో క్రిమిలేయర్ నిబంధన ఎత్తివేత, ఓబీసీలకు పరిశోధనా గ్రాంట్లు, స్కాలర్షిప్లు, చ ట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. టూటా అధ్యక్షుడు ప్రొఫెసర్ శివశంకర్, తె యూ ఇన్చార్జి రిజిస్ట్రార్ యాదగిరి, బీసీ సం క్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మారయ్య గౌడ్, తెయూ కళాశాల ప్రిన్సిపాల్ కనకయ్య, బీసీ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజారామ్, ప్రభంజన్ కుమార్ యాదవ్, ఆంజనేయులు, తెయూ టీచింగ్, నాన్-టీచింగ్ అసోసియేషన్ సభ్యులు, అకడమిక్ కన్సల్టెంట్లు, ఔట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రూ.వందకోట్లు కేటాయించేలా చూడండి తెలంగాణ యూనివర్సిటీకి త్వరలో జరుగనున్న రాష్ట్ర బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించేలా కృషి చేయాలని ఆర్.కృష్ణయ్యకు బీ సీ విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. మెస్ బిల్లులు రూ. వెయ్యి పెంచాలన్నారు. బీసీ విద్యార్థులకు ప్రత్యేక ఫెలోషిప్‌లు మంజూరు, నెట్, సెట్ పరీక్షలలో కటాఫ్ మార్కులు తగ్గించేలా చూడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు కె.రమణ, అనిల్‌కుమార్, తిరుపతి, రాజు,రాజేంధర్, వెంకటస్వామి, సంతోశ్ తదితరులు ఉన్నారు. -
బస్సుయాత్రకు ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ బస్సుయాత్రకు ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కరెంట్ కొరత, రైతు సమస్యలపై తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బస్సుయాత్రకు ఎమ్మెల్యేలు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య గైర్హాజరు అయ్యారు. కాగా గత కొంతకాలంగా ఆర్ కృష్ణయ్య టీడీపీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి నగర శివారులో తమతో పాటు బస్సుయాత్రలో పాల్గొంటారని, ఇక ధర్మారెడ్డి వరంగల్ జిల్లా బస్సుయాత్ర ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని, శనివారం ఆయన యాత్రలో పాల్గొంటారని ఎంపీ గరికపాటి మోహన్ రావు తెలిపారు. అయితే బస్సుయాత్ర నల్గొండ జిల్లా చేరుకున్నా మంచిరెడ్డి మాత్రం హాజరు కాలేదు. మరోవైపు కారు ఎక్కుబోయి చివరి నిమిషంలో యూ టర్న్ తీసుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బస్సు యాత్రలో పాల్గొన్నారు. -
బీసీల రాజ్యాధికారం కో్సం పోరాటం: కృష్ణయ్య
హైదరాబాద్: సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. వెనకబడిన తరగతుల విద్యార్ధుల, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. బీసీలకు రాజ్యాధికారం సాధించేంతవరకు పోరాటం చేస్తామని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చేసిన హామీలను నెరవేరేంతవరకు పోరాటం చేస్తామన్నారు. బీసీల అభ్యున్నతికి రాజీలేని పోరాటం చేస్తామని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. -
చంద్రబాబుకు కృష్ణయ్య ఝలక్!
హైదరాబాద్: ఆదర్శ రైతుల రద్దు అంశపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకి స్వంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు స్వంతపార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఝలక్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పథకాన్ని కొనసాగించాలని ఇందిరాపార్క్ వద్ద ఆదర్శ రైతులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఆర్.కృష్ణయ్య పాల్గొనడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆదర్శ రైతుల తొలగింపులో చంద్రబాబు తీరును కృష్ణయ్య తప్పుపట్టారు. ఆదర్శ రైతుల పథకంలో లోపాలుంటే సరిదిద్దాలని.. కాని వ్యవస్థనే రద్దు చేయడం సబబు కాదని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. -
బీసీలకు ప్రత్యేక శాఖ అవసరం: కృష్ణయ్య
న్యూఢిల్లీ : రాజ్యాంగ రచనలోనే బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల సంక్షేమం కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంటులో బిల్లు పెట్టాలన్న డిమాండ్‌పై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్లమెంటువైపు ర్యాలీ గా వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నానుద్దేశించి కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో తొలిసారిగా బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధాని అవడం బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రావాల్సిన విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వాటాను ఇవ్వాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఇది ఆరంభం మాత్రమే..
హుడాకాంప్లెక్స్: అధికారంలోకి వచ్చాక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలను మర్చిపోయారని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యపై ఇప్పటి వరకు చర్చ లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఫీజులూం చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కామన్ మ్యాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు జంగయ్యయాదవ్ కొత్తపేట చౌరస్తాలో నాలుగు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను గురువారం ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డీఈఓ సోమిరెడ్డిలు పండ్ల రసాలు ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యాసంస్థలు ప్రారంభమైనా ఉచిత విద్యపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఎంతోమంది తమ చదువులు మధ్యలోనే ఆపే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు భారీ ఎత్తున ఫీజులు డిమాండ్ చేస్తుండటంతో ఎంతోమంది విద్యార్థుల చదువులు అగమ్యగోచరంగా మారుతున్నాయన్నారు. ఉచిత విద్యపై ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, అసెంబ్లీలో కూడా దీనిపై చర్చిస్తానని తెలిపారు. జంగయ్య యాదవ్ చేస్తున్న దీక్ష ప్రారంభమేనని ఉచిత విద్య అందజేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు, ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కామన్ మ్యాన్ ఫౌండేషన్ సభ్యులు రమావత్ లక్ష్మి, సతీష్, కిషోర్, గుజ్జ కృష్ణ, సి.రాజేందర్, బ్రహ్మంచౌదరి, ఐలేష్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీలు మారాల్సిన అవసరంలేదు తాను టీడీపీ పార్టీకి, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని వచ్చిన కథనాలు అవాస్తవమని, కొందరు గిట్టనివారు ఇలాంటి దుష్ర్పచారం చేస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. రాజీనామా పట్ల వస్తున్న కథనాలపై విలేకరులు ఆయనను ప్రశ్నించడంతో ఈ విధంగా తెలిపారు. 40 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉండి ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యేగా గెలుపొందానని, పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: డీఈఓ సోమిరెడ్డి జంగయ్య యాదవ్ ఆమరణ నిరాహారదీక్ష ను విరమింపజేసిన రంగారెడ్డి జిల్లా డీఈఓ సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే జంగయ్య యాదవ్ చేస్తున్న దీక్షపై అధికారుల దృష్టికి తీసుకెళ్లానని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
టీడీఎల్పీ ఫ్లోర్‌లీడర్‌గా బీసీలు పనికిరారా?
సీఎంగా పనికొచ్చే వ్యక్తి ఫ్లోర్‌లీడర్‌గా అనర్హుడా: బీసీ సంఘాల ప్రశ్న తలసాని, ఆర్.కృష్ణయ్యలకుటీ టీడీఎల్పీలో ఏ పదవులు ఇవ్వని బాబు ఉప నాయకులుగా రేవంత్, సండ్ర,విప్‌గా ప్రకాశ్ గౌడ్, కోశాధికారిగా మాగంటి బాబు నిర్ణయంపై తలసాని తీవ్ర అసంతృప్తి అసెంబ్లీ హాల్లో వెనకాల కూర్చొన్న తలసాని, ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే బీసీ నేత ఆర్.కృష్ణయ్యను సీఎం చేస్తా... ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణలోని బహిరంగసభల్లో చేసిన వాగ్దానమిది. సీమాంధ్ర ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని చెపుతూ అక్కడ బీసీ ఓట్లకు గాలం వేశారు. తీరా... తెలంగాణలో టీడీపీ 15 సీట్లు గెలుచుకొని మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన నేపథ్యంలో చంద్రబాబు తన వాగ్దానాన్ని పక్కనపెట్టారు. బీసీలకు సీఎం ఇస్తానన్న బాబు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్‌ను కూడా ఇవ్వలేదు. తెలంగాణ టీడీఎల్పీ నాయకుడి విషయంలో రోజుకోరకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరా సోమవారం రాత్రి పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావును ఫ్లోర్‌లీడర్‌గా నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ పదవి కోసం పోటీ పడ్డ బీసీ నేతలైన కృష్ణయ్య, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు టీడీఎల్పీలో ఏ పదవులు ఇవ్వకుండా దూరం చేశారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లుగా ఎ.రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, విప్‌గా ప్రకాశ్ గౌడ్, కోశాధికారిగా మాగంటి గోపీనాథ్, టీడీఎల్పీ కార్యదర్శులుగా జి. సాయన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలను నియమించారు. నేతల తీవ్ర అసంతృప్తి పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ సీఎంగా బీసీ నేత ఆర్.కృష్ణయ్యను ప్రకటించిన బాబు ... తీరా ఇప్పుడు పార్టీ ఫ్లోర్ లీడర్‌గా కూడా పనికిరాడన్న విధంగా వ్యవహరించడం ఏమిటని బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల బీసీ ఉద్యమంలో ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర ఆర్.కృష్ణయ్యకు ఉందని ఎన్నికల్లో ప్రతిచోటా చెప్పిన బాబు... ప్రతిపక్షంలో ఫ్లోర్‌లీడర్‌గా కూడా వ్యవహరించ లేరని నిర్ధారణకు వచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీఎల్పీలో కృష్ణయ్యకు ఏ పదవి ఇవ్వకపోవడం బీసీలను అవమానపరచడమేనని మండిపడుతున్నారు. ఏ పదవీ వద్దన్న తలసానికి ఉత్తి చేతులే! చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీకే టీడీఎల్పీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఆర్.కృష్ణయ్య కాకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కే ఆ పదవి దక్కుతుందని భావించారు. కానీ శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఎర్రబెల్లిని ఖరారు చేస్తున్నట్లు తలసానికి చెప్పారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనకు ఏ పదవులు వద్దని, ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పి వెళ్లిపోయారు. ఆయన ఆవేశంలో అన్న మాటలనే ని జం చేస్తూ ఉప నాయకుడి హోదా కూడా ఇవ్వకుండా చంద్రబాబు పక్కన పెట్టారు. కాగా సోమవారం అసెంబ్లీ హాలులో ఆర్.కృష్ణయ్య ఒంటరిగా వెనుక సీట్లలో కూర్చొని తన అసంతృప్తి వ్యక్తం చేయగా, తలసాని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో కలిసి మూడో బెంచీపై కూర్చోవడం గమనార్హం. -
ప్రజల పక్షాన పోరాడుతా: ఆర్.కృష్ణయ్య
మన్సూరాబాద్, న్యూస్‌లైన్: శాసనసభలో నాయకుడిగా అసెంబ్లీ బయట ఉద్యమ నాయకుడిగా దమ్మున్న నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడుతానని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ ఎల్బీనగర్ వార్డు కార్యాలయం నుంచి ఎల్బీనగర్ టీఎన్టీయూసీ అధ్యక్షుడు కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ర్టంలో లక్షా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇళ్లులేని పేదలకు 125 గజాల స్థలం, రూ.3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన ఎన్నికల హామీని నేరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. డ్వాక్రా, రైతు రుణాల మాఫీకి ప్రభుత్వంపై పోరాడుతానని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పౌర సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, ఇళ్ల పట్టాలు లాంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ఎల్బీనగర్లో రోడ్లపై తోపుడుబండ్లు పెట్టుకుని జీవనం సాగించే చిరువ్యాపారులపై పోలీసుల వేధింపులు లేకుండా పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తానని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ తోపుడు బండ్ల అధ్యక్షుడు మల్లేష్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ర్ట కార్యనిర్వహక కార్యదర్శి సామ రంగారెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల లతానర్సింహ్మరెడ్డి, నాయకులు మల్లారపు శ్రీనివాసరావు, నాంపల్లి శంకరయ్య, విశ్వేశ్వర్రావు, ఎగమయ్య, యంజాల జగన్, గుండె గిరిబాబు, రాము, కాసాని అశోక్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
తొలి బీసీ ప్రధాని మోడీ: బీసీ సంఘాల హర్షం
హైదరాబాద్: ఎన్డీఏ కూటమి తరఫున దేశ తొలి బీసీ ప్రధానిగా నరేంద్రమోడీని ఎంపిక చేస్తూ భారతీయ జనతా పార్లమెంటరీ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా తొలిసారి ప్రధాని పదవిని అధిష్టిస్తున్న నరేంద్రమోడీకి బీసీలందరి తరుపున అభినందనలు తెలియజేస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎల్బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ ప్రజా సమితి అధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేశ్ యాదవ్, బీసీ సేన అధ్యక్షుడు ఎ. పాండు ఒక ప్రకటనలో తెలిపారు. -
టీ-టీడీఎల్పీ నేత ఎవరు?
* ఆర్. కృష్ణయ్యకు సీనియార్టీ సమస్య * రేసులో తలసాని, సాయన్న * ఎర్రబెల్లి, సండ్రకు సామాజికవర్గం అడ్డంకి * నేడు బాబుతో కొత్త ఎమ్మెల్యేల సమావేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ప్రాంతంలో బీసీ నేత ఆర్. కృష్ణయ్యను పార్టీ సీఎం అభ్యర్థిగా అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున ఎల్బీనగర్ నుంచి పోటీ చేసిన కృష్ణయ్యతో పాటు 15 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా నెగ్గారు. వీరంతా కలిసి రేపో మాపో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాల్సి ఉం టుంది. నిజానికి పార్టీ సీఎం అభ్యర్థిగా చంద్రబాబు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఆర్. కృష్ణయ్యనే టీడీఎల్పీ నాయకుడిని చేయాలి. అయితే ఎన్నికల ముందే పార్టీలో చేరి, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్. కృష్ణయ్యను ఇప్పుడు శాసనసభలో తమ నేతగా అంగీకరించేందుకు తాజాగా ఎమ్మెల్యేలైన సీనియర్ నేతలు సిద్ధంగా లేరు. కొత్తగా గెలిచిన తెలంగాణ ఎమ్మెల్యేలు శనివారం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశముంది. చంద్రబాబు ఎవరి పేరు చెబితే ఆయన్నే టీ-టీడీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశమున్నప్పటికీ సీనియర్లు మాత్రం తమ అభిప్రాయాలను అధినేతకు చెప్పనున్నట్లు సమాచారం. బీసీ నేతనే టీడీఎల్పీ నేతగా ఎన్నుకోవాలని భావిస్తే సనత్‌నగర్ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముందు వరుసలో నిలిచే అవకాశముంది. ఆయనకు ఇది నాలుగో విజయం. అలాగే కంటోన్మెంట్ నుంచి నాలుగోసారి గెలిచిన సాయన్న కూడా అర్హుడే. విద్యావంతుడైన సాయన్న గతంలో టీడీఎల్పీ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి కూడా దక్కలేదు. ఎస్పీ వర్గానికి చెందిన ఆయనకు అవకాశమిస్తే సామాజిక సమతుల్యత విషయంలోనూ ఇబ్బం దులు ఉండవు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర పోటీలోనూ పాలకుర్తి నుంచి విజయం సాధించగా, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. అయితే వారి సామాజికవర్గమే వారికి అడ్డంకి కావచ్చు. -
‘ప్రైవేట్’ ప్రత్యేక ఎంట్రెన్స్ వద్దు: ఆర్.కృష్ణయ్య
సాక్షి,హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవేశ పరీక్ష పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించాలని రాష్ర్ట బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ప్రత్యేక ఎంట్రెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ గురువారం బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఫీజు రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ కృష్ణమోహన్‌రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ... ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు నిర్వహించే పరీక్షకు అనుమతి ఇవ్వడమంటే అక్రమాలకు, అవకతవకలకు ద్వారాలను తెరవడమే అవుతుందన్నారు. -
ఫీజులు పెంచితే ఉద్యమం
ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఆర్.కృష్ణయ్య హెచ్చరిక హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఏకీకృత ఫీజు విధానం పెట్టి అన్ని కేటగిరిలకూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షల ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదన సరికాదని, దీనిని వెంటనే విరమించుకోవాలని 24బీసీ సంఘాల సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీసీ భవన్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య ను వ్యాపారంగా మారుస్తోందని విమర్శించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల అడ్మిషన్లు మెరిట్ ఆధారంగా చేపట్టాలని కోరారు. ఫీజులను పెంచితే ఉద్యమిస్తామని అన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను గతేడాది మాదిరిగానే కొనసాగించాలని, ఫీజులను పెంచరాదని, ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రస్తుతం ఉన్న ఏ,బీ, సీ మూడు కేటగిరిలను రెండుకి కుదించాలని, బీ కేటగిరిలో ఉన్న 10 శాతం సీట్లను ఏ కేటగిరిలో కలపాలని డిమాండ్ చేశారు. సీ కేటగిరిలోని 40 శాతం యాజమాన్యపు కోటాను 20 శాతానికి తగ్గించి దాన్ని ‘ఏ’ కేటగిరిలో కలపాలన్నారు. 80 శాతం కన్వీనర్ కోటాను మెరిట్ ప్రతిపదికన భర్తీ చేయాలని, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీసీ, సాంఘిక, గిరిజన, మైనార్టీ, వికలాంగ, మహిళ, శిశు సంక్షేమ శాఖలను విలీనంచేసి ఒకే శాఖ గా మార్చాలనే ప్రతిపాదన తగదన్నారు. అకాల వర్షాలకు తడిసిన పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించారు. సమావేశంలో ఆయా సంఘాల నేతలు జె.శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, సీహెచ్ భద్ర, సి.రాజేందర్, ఎ.రాంకోఠి ప్రసంగించారు. -
కేసీఆర్.. అడ్డొస్తే సైకిల్‌తో తొక్కేస్తాం: చ్రందబాబు
తుపాకులకే భయపడలేదు.. నువ్వో లెక్కా? టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్.కృష్ణయ్యే సీఎం ఆదిలాబాద్ సభల్లో చంద్రబాబునాయుడు టీడీపీ అధినేతపై కోడిగుడ్లతో తెలంగాణవాదుల దాడి సాక్షి, మంచిర్యాల : ‘తుపాకులకే భయపడలేదు.. తాగుబోతులను పంపించి సభలో గొడవపెట్టిస్తే భయపడిపోతానా.. కేసీఆర్ ఓ లెక్కా నాకు? ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. సైకిల్‌తో తొక్కేస్తాం..’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిప్పులు చెరిగారు. తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్యను తొలి ముఖ్యమంత్రిని చేస్తానని, దళితుడిని ఉప ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, ఇచ్చోడ, కడెం, నిర్మల్‌లలో ఏర్పాటు చేసిన సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ దొంగలు, తాగుబోతుల పార్టీ.. వాళ్లను తరిమికొట్టాలన్నారు. పెత్తందారీ, భూస్వామి పోకడలు ఉన్న కేసీఆర్ మళ్లీ నీ బాంచన్ కాల్మోక్త దొరా అనే రోజులు రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కొడుకు, కూతురు, అల్లుడు, బంధువులను పోటీలో నిలబెట్టి కుటుంబ పాలన సాగిస్తున్నాడన్నారు. అమరుల బలిదానం వల్లనే తెలంగాణ వచ్చింది తప్ప.. కేసీఆర్ సాధించింది ఏమీ లేదని తెలిపారు. కుటుంబ సభ్యులు కానివారికి పార్టీ టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు తోడుదొంగలుగా మారారని మండిపడ్డారు. టీడీపీ సభల్లో గొడవలు పెట్టిస్తున్నారని చెప్పారు. ఈ విషయం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని పేర్కొన్నారు. ‘ఇలాగే దాడులు చేయిస్తే కేసీఆర్ గుండెల్లో నిద్రపోతా... ఎన్నికల తర్వాత ఆయన శాశ్వతంగా ఫాంహౌస్‌లోనే పడుకునే రోజులు వస్తాయి’ అని హెచ్చరించారు.. బెల్లంపల్లిలో ఉదయం 10.30 గంటలకు సభలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నారు. సభలో కోడిగుడ్లతో దాడి చంద్రబాబుకు బెల్లంపల్లి సభలో తెలంగాణవాదుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కొందరు చంద్రబాబుపై కోడిగుడ్లు విసిరే ప్రయత్నం చేశారు. సదరు యువకులు విసిరిన కోడిగుడ్లు చంద్రబాబుకు ఐదు మీటర్ల దూరంలో సభావేదిక ముందు పడ్డాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు తెలంగాణవాదులను వెంటనే అదుపులోకి తీసుకొని సభాస్థలి నుంచి బయటకు తీసుకెళ్లారు. మరో వ్యక్తి చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకోబోగా పోలీసులు అతన్ని కూడా బలవంతంగా లాకెళ్లారు. లాఠీలకు పని చెప్పారు. కాగా, ముందుజాగ్రత్తగా పోలీసులు ఏడుగురు టీఆర్ఎస్, మరో ఆరుగురు టీ జేఏసీ, కుల సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని సభ ముగిసిన తర్వాత విడిచిపెట్టారు. -
ఆర్.కృష్ణయ్య కారుపై తెలుగు తమ్ముళ్ల రాళ్ల దాడి
-
ఎల్బీ నగర్లో ఆర్.కృష్ణయ్యపై రాళ్ల దాడి
హైదరాబాద్ : టీడీపీలో పొత్తు చిచ్చు పెడుతోంది. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆర్.కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. గడ్డి అన్నారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఆర్. కృష్ణయ్య వాహనం ధ్వంసం అయ్యింది. ఆర్.కృష్ణయ్య నామినేషన్ వేయకుండా ప్రత్యర్థి వర్గం అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనలో కృష్ణయ్య స్వల్పంగా గాయపడ్డారు. ఇక దాడి జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో టీడీపీ రెబల్ అభ్యర్థి కార్యకర్తలతో పాటు, టీర్ఎస్ కార్యకర్తలు అక్కడే ఉండటంతో ఎవరు దాడికి పాల్పడ్డారనే ఇతిమిద్దంగా తెలియలేదు. మరోవైపు ఆర్.కృష్ణయ్యకు టికెట్ కేటాయింపుతో ఎల్బీనగర్ టీడీపీ ఇంచార్జ్ కృష్ణప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
టీడీపీకి మద్దతు ప్రకటించిన కృష్ణయ్య
ఇక దేశం గూటికి చేరడం లాంఛనమే! చేవెళ్ల ఎంపీ టికెట్‌తో పాటు పార్టీలో కీలక బాధ్యతలు అధినేత నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న సీనియర్ బీసీ నేతలు బీజేపీ కూడా ‘బీసీ సీఎం’ అంటున్నా పట్టించుకోని కృష్ణయ్య హైదరాబాద్: తెలంగాణలో మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీని బీసీ కార్డుతో పైకిలేపే విఫలయత్నానికి అంకురార్పణ జరిగింది. కొద్దిరోజులుగా తెలంగాణలో ‘బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న పార్టీకే తమ అండ’ అని ప్రకటనలు చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య... తెలుగుదేశం పార్టీకే తమ మద్దతు అని శనివారం సాయంత్రం ప్రకటన చేశారు. ‘‘అన్ని పార్టీలకు ఆఫర్ ఇచ్చినా ఎవరూ ముందుకు రానందున బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న టీడీపీకి మద్దతు ఇవ్వాలని 42 బీసీ సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి..’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ‘తెలంగాణలో బీసీనే సీఎం..’ అని ఇటీవలే బీజేపీ కూడా ప్రకటించినా.. కృష్ణయ్య ఎక్కడా ఆ పార్టీ పేరెత్తకపోవడం గమనార్హం. కృష్ణయ్య ప్రకటనతో ఆయన టీడీపీలో చేరడం ఖరారైపోయింది. సోమవారంలోపు ఆయన ఇతర బీసీ సంఘాల నేతలతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో బీసీ సంఘాల నేతలతో మరోమారు సమావేశమై కాంగ్రెస్, టీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించి.. పచ్చకండువా కప్పుకోనున్నట్లు సమాచారం. టీడీపీలో చేరిన వెంటనే కృష్ణయ్యకు టీటీడీపీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దాంతో పాటు చేవెళ్ల లోకసభ టికెట్ గానీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏదో ఒక శాసనసభ స్థానం టికెట్గానీ ప్రకటించే అవకాశం ఉంది. ప్రణాళిక ప్రకారమే కృష్ణయ్యకు ఎర..: బీసీ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ జిల్లాల్లో పేరున్న కృష్ణయ్యకు ఎర వేయడం ద్వారా బీసీలంతా టీడీపీ వైపే ఉన్నారని చెప్పుకొనే ఈ ప్రయత్నానికి నెలరోజుల కిందే బీజం పడింది. బీసీలకు చట్టసభల్లో సగం సీట్లు ఇవ్వాలని కోరేందుకు వెళ్లిన కృష్ణయ్యతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు... 294 సీట్లలో 150 సీట్లు బీసీలకు ఇస్తామని, తెలంగాణలో బీసీని సీఎం చేస్తానని, టీడీపీలో చేరితే చేవెళ్ల టికెట్టిచ్చి పార్లమెంటుకు పంపుతానని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి సానుకూలత వ్యక్తం చేసిన కృష్ణయ్య బాబుతో పలుమార్లు మంతనాలు జరిపారు. నాలుగో తేదీన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘బీసీని సీఎం చేయాలి.. కృష్ణయ్యకే ఆ పదవి ఇస్తానని చంద్రబాబు ప్రకటించాలి’ అని బీసీ నేతలతో చెప్పించారు. ఇటీవల ఏకంగా.. ‘బీసీ సీఎం కృష్ణయ్యే’ అంటూ జిల్లా అధ్యక్షులతో తీర్మానింపజేశారు కూడా. పార్టీలో చేరాక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని బాబు హామీ ఇవ్వడంతో కృష్ణయ్య టీడీపీకి మద్దతిస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. టీడీపీ సీనియర్ నేతల ఆగ్రహం..: ‘‘బీసీల కోసం ఉద్యమించిన నాయకుడిని పార్టీలోకి తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. బీసీ సెల్‌కు అధ్యక్షుడిని చేసినా సంతోషిస్తాం. కానీ సీఎం అభ్యర్థిగానో, టీటీడీపీ అధ్యక్షుడిగానో కొత్తగా వచ్చిన నాయకుడిని ప్రకటిస్తే సహించేది లేదు..’’ అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకున్నా పార్టీలోనే కొనసాగుతున్న తమకు కొత్త దేవుడు కృష్ణయ్య అంటే ఎలా భరిస్తామని ప్రశ్నిస్తున్నారు. అర్దరాత్రి వరకు సమావేశం: చంద్రబాబు శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో టీడీపీ తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితి, రాబోయే ఎన్నికలపై చర్చించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి, ఎన్నికల ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీల కూర్పుపై సమాలోచనలు జరిపారు. భేటీ అర్ధరాత్రి వరకు కొనసాగింది. -
పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాలి: కృష్ణయ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాజకీయ పార్టీలు బీసీలకు తక్షణమే డిక్లరేషన్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక బీసీ భవన్లో జరిగిన 22 బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. రాజకీయ పార్టీలకు ఏళ్ల తరబడి జెండాలు మోస్తున్నా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణలో 60 అసెంబ్లీ, 9 పార్లమెంటు స్థానాలను, సీమాంధ్రలో 90 అసెంబ్లీ, 13 పార్లమెంటు స్థానాలను బీసీలకు కేటాయించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి సీఎం పదవి ఇవ్వాలని కోరారు. -
బీసీల సమరభేరి
‘‘తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించుకుంటున్నాం. ఇక అందరూ పోరాడేది బీసీవాదం పైనే’’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. గురువారం చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించిన బీసీ విద్యార్థి, యువజన సమరభేరి సభలో ఆయన మాట్లాడారు. - న్యూస్‌లైన్, చౌటుప్పల్ చౌటుప్పల్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉండడంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుం టున్నారు.. ఇక అందరూ పోరాడేది బీసీ వాదంపై నే అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణ య్య స్పష్టం చేశారు. చౌటుప్పల్‌లోని గాంధీపార్కులో గురువారం జరిగిన బీసీ విద్యార్థి, యువజన సమరభేరి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిం చారు. రాజ్యాధికారం కోసం బీసీలు సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అగ్రకులాల వారు ఏ పా ర్టీలో ఉన్న రాజ్యాధికారం కోసం ఏకమవుతారని, అం దుకే అధిక సంఖ్యలో చట్టసభలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. దొరల రాజ్యం పోవాలంటే అగ్రకులాలకు సీట్లిచ్చే పార్టీలకు ఓట్లు వేయవద్దని విజ్ఞప్తి చేశారు.అగ్రకుల వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు జిల్లాలో 6 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని కోరారు. ఎన్నికల మెనిఫెస్టోలో బీసీ బిల్లు, బీసీల కోసం ప్రవేశపెట్టే పథకాలను చేర్చాలన్నారు. త్వరలో నల్లగొండలో 2లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలి పారు. సభలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య, జెల్లా మార్కండేయులు,చంద్రకళ, లావణ్య, అంజయ్య, జం గయ్య, మాజీ మావోయిస్టు నేత శ్రీరాముల శ్రీనివాస్, పల్లె రవికుమార్, గౌరీశంకర్, రమణగోని శంకర్, తిరుమని కొండల్, చక్రహరి రామరాజు పాల్గొన్నారు. -
బీసీలకు ప్రాధాన్యం ఇవ్వకుంటే రాళ్లదాడులు
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: రాబోయే ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వని రాజకీయ పార్టీల నేతలపైన రాళ్లదాడులు నిర్వహిస్తామని బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. తిరుపతిలోని యూత్‌హాస్టల్‌లో బీసీ ఉద్యోగ సంఘం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన ప్రసంగించారు. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అసెంబ్లీలో 150, పార్లమెంట్‌కు 23 సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే రాళ్లదాడి తప్పదని హెచ్చరించారు. బీసీలకు అన్యాయం చేసే పార్టీలకు వ్యతిరేకంగా పోరాడటానికి 5 వేల మందితో ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీ మాత్రమే వంద అసెంబ్లీ సీట్లు, బీసీ డిక్లరేషన్ ఇస్తామని ప్రకటించాయన్నారు. అయితే ఇది చాలదని, 150 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ ఉద్యోగ సంఘం రూపొందించిన 2014 క్యాలెండర్‌ను కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ రైల్వే సలహామండలి సభ్యులు గుండ్లూరు వెంకటరమణ, బీసీ ఉద్యోగ సంఘ నాయకులు బడి ప్రసన్న, చంద్రశేఖర్, బీసీ నాయకులు బుల్లెట్ సురేష్, అశోక్, దశరథాచారి, ఆల్మెన్రాజు పాల్గొన్నారు. -
‘కాపులను బీసీల్లో చేర్చుకోవడానికి వ్యతిరేకం’
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రయత్నించే రాజకీయ పార్టీలు ఆ వర్గం ప్రజలకు దూరం కావాల్సి వస్తుందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు కృషి చేస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఇప్పటికే రెండు సార్లు తిరస్కరించిన ఈ ప్రతిపాదనను బీసీలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తారని చెప్పారు. ఈ ప్రతిపాదన ఎట్టిపరిస్థితుల్లో తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమ సంఘంలోకి శ్రీరాముల శ్రీనివాస్: మావోయిస్టు మాజీ నేత శ్రీరాముల శ్రీనివాస్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంలో చేరారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి కృషిచేయాలని తాను బీసీ సంక్షేమ సంఘంలో చేరుతున్నట్లు తెలిపారు. -
బీసీ కులంలో పుట్టడమే పాపమా: కృష్ణయ్య
-
బీసీ కులంలో పుట్టడమే పాపమా: కృష్ణయ్య
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు చట్టసభల్లో ఉద్యమాలు చేయాలని, రాజ్యాధికారం వచ్చేవరకు తాము పోరాటాలు చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడారు. ఈ కులాల్లో పుట్టిన ప్రతి ఒక్కరినీ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. పేదలు రాజ్యాధికారం చేపడితేనే పేదరికం పోతుందని, అయితే.. అగ్రకులాలకు మాత్రం బీసీలు వ్యతిరేకం కాదని కృష్ణయ్య చెప్పారు. సర్పంచులకు రూ. 25 వేల జీతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో బీసీలకు వాటా ఏదని ఆయన నిలదీశారు. బీసీ కులంలో పుట్టడమే తాము చేసుకున్న పాపమా అని మండిపడ్డారు. అయితే, అంతకుముందు గర్జన సదస్సులో గందరగోళం చెలరేగింది. నాయకులు ప్రాంతాలవారీగా విడిపోయారు. సదస్సుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రావడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నిరసన స్వరాలు వినిపించారు. అలాగే, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ రాకను కూడా పలువురు సీమాంధ్ర నేతలు వ్యతిరేకించారు. -
బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించి నిధులు విడుదల చేయాలి
చేవెళ్ల, న్యూస్‌లైన్: బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రకటించి వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఈ నెల 24న నగరంలో జరిగే తెలంగాణ గౌడ సమర భేరి సన్నాహకాల్లో భాగంగా శనివారం స్థానిక కేజీఆర్ ఫంక్షన్ హాలులో జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు చెందిన నిధులను వారి కోసమే ఖర్చు చేయడానికి బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజల మధ్య ఐక్యత లేకపోవడంవల్లే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కల్లుగీత వృత్తిని కార్పొరేట్ రంగంగా మార్చి అభివృద్ధిచేయాలని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి ఓట్లు మనవి, సీట్లు అగ్రవర్ణాలవారివంటూ దుయ్యబట్టారు. కల్లుగీత కార్మికులను, టీఎఫ్టీదారులను ఎక్సైజ్ అధికారులు మామూళ్ల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. కల్లును ఎక్సైజ్ నుంచి వేరుచేసి కో-ఆపరేటివ్ సొసైటీల పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాటిచెట్లు, ఈత చెట్లను పెంచడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడంలేదని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని 105 కల్లు దుకాణాలను మూసివేసి గౌడ కులస్తులకు ప్రభుత్వాలు తీరని అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. బీసీ కులాలన్నీ విద్య, రాజకీయ, ఆర్థిక రంగాలలో మరింత ప్రగతి సాధించాలని, అందుకోసం అందరం ఐకమత్యంగా కదులుదామని పిలుపునిచ్చారు. అణచివేతకు గురవుతున్న బీసీలు: దేశిని చినమల్లయ్య గౌడ జేఏసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్యగౌడ్ ప్రసంగిస్తూ.. సమాజంలో 80 శాతం ఉన్న బీసీలు ఇప్పటికీ అణిచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఏ ప్రభుత్వమూ సరైన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు. సామాజికంగా బలపడితేనే రాజ్యాధికారానికి దగ్గరవుతామన్నారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి: వెంకన్న గౌడ్ గౌడ, కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్నగౌడ్ మాట్లాడుతూ.. కల్లుగీత వృత్తిదారులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. గౌడ కులస్తులను అన్నిరంగాలలో సీమాంధ్ర పాలకులు ఎదగకుండా చేశారన్నారు. రాష్ట్రంలో 18 శాతమున్న గౌడ కులస్తులు దామాషా ప్రకారం 38 మంది ఎమ్మెల్యేలుగా ఉండాలని, కాని కేవలం ఐదుమంది మాత్రమే ఉండడం శోచనీయమన్నారు. గౌడ కులస్తులు తప్ప ఏ వృత్తిదారులూ ప్రభుత్వానికి పన్ను చెల్లించడంలేదని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. చెట్టుమీదినుంచి పడి మృతిచెందిన గీత కార్మికులకు కూడా ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించకపోవడం అత్యంత దారుణమైన విషయమని దుయ్యబట్టారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం పెట్టాలి కల్లుగీత వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్ల శ్రీశైలంగౌడ్, తెలంగాణ గౌడ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర కొండయ్యగౌడ్, గౌడ జనహక్కుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు విజయకుమార్‌గౌడ్, సినీ నటుడు, అడ్వయిజరీ కమిటీ చైర్మన్ జైహింద్‌గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ జుంబాల నారాయణ గౌడ్, రాష్ట్ర నాయకులు రామక్రిష్ణగౌడ్, రామాగౌడ్, ప్రకాశ్‌గౌడ్, రాంచంద్రయ్యగౌడ్, రాఘవేందర్‌గౌడ్, పల్లె లక్ష్మణరావుగౌడ్, బొబ్బిలి రమేష్‌గౌడ్, కొండకల్ శంకర్‌గౌడ్, కాసుల సురేందర్‌గౌడ్ తదితరులు మాట్లాడుతూ.. గౌడ కులస్తుల పోరాటం చేసిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికులందరికీ ఇళ్లు, పింఛ న్లు కూడా అందించాలన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. -
తిరగబడకముందే.. మా వాటా ఇవ్వండి
పార్టీలన్నీ బీసీలకు 150 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లివ్వాలి: కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో బీసీలకు 150 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలను అన్ని పార్టీలు కేటాయించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ‘అగ్రకులాలు ఇన్నాళ్లూ వారి వాటాతో పాటు మా వాటా కూడా తిన్నారు. మేం బిచ్చం అడగడం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కునే అడుగుతున్నాం. బీసీలు తిరుగుబాటు చేయకముందే, వారు మిలిటెంట్లుగా కాకముందే మా వాటా ప్రకటించాలి’ అని పేర్కొన్నారు. వచ్చే నెల 15న నిజాంకాలేజీ మైదానంలో నిర్వహించనున్న ‘బీసీల సింహగర్జన’ వాల్‌పోస్టర్, నూతన బీసీ జెండాను శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కృష్ణయ్య ఆవిష్కరించి మాట్లాడారు. సభకు పార్టీలకతీతంగా ‘ఇంటికో మనిషి, ఊరుకో బండి’ చొప్పున బీసీలు హాజరు కావాలని కోరారు. ఈ మహాసభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నరేంద్రమోడీ, సిద్ధరామయ్య, అఖిలేశ్‌యాదవ్, నితీశ్‌కుమార్‌లతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. బీసీలకు ‘కొత్త జెండా’: మూడున్నర దశాబ్దాలుగా బీసీల హక్కుల కోసం పోరాడుతున్న రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కొత్త జెండాను రూపొందించుకుంది. కుల, వర్గ పోరాటాలకు ప్రతీకగా నిలిచేలా ఎరుపు, ఆకాశనీలం రంగులతో ఏర్పాటైన ఈ జెండాలో బీసీ అని ఇంగ్లీషులో రాశారు. చుట్టూ ఆకులతో కూడిన చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎరుపు వర్గపోరాటాలకు, ఆకాశనీలం రంగు కుల పోరాటానికి చిహ్నాలని ఆర్.కృష్ణయ్య తెలిపారు. -
మోడీ శక్తి సామర్థ్యాలున్న బీసీ నాయకుడు
న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ శక్తి సామర్థ్యాలు ఉన్న బీసీ నాయకుడని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటిస్తే బీసీలంతా ఆయన వెంటే ఉంటారని కృష్ణయ్య తెలిపారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని కృష్ణయ్య కోరారు. పార్లమెంట్లో బిసి బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే.