
బీసీ కులంలో పుట్టడమే పాపమా: కృష్ణయ్య
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు.
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు చట్టసభల్లో ఉద్యమాలు చేయాలని, రాజ్యాధికారం వచ్చేవరకు తాము పోరాటాలు చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడారు. ఈ కులాల్లో పుట్టిన ప్రతి ఒక్కరినీ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.
పేదలు రాజ్యాధికారం చేపడితేనే పేదరికం పోతుందని, అయితే.. అగ్రకులాలకు మాత్రం బీసీలు వ్యతిరేకం కాదని కృష్ణయ్య చెప్పారు. సర్పంచులకు రూ. 25 వేల జీతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో బీసీలకు వాటా ఏదని ఆయన నిలదీశారు. బీసీ కులంలో పుట్టడమే తాము చేసుకున్న పాపమా అని మండిపడ్డారు.
అయితే, అంతకుముందు గర్జన సదస్సులో గందరగోళం చెలరేగింది. నాయకులు ప్రాంతాలవారీగా విడిపోయారు. సదస్సుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రావడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నిరసన స్వరాలు వినిపించారు. అలాగే, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ రాకను కూడా పలువురు సీమాంధ్ర నేతలు వ్యతిరేకించారు.