
టీడీపీకి మద్దతు ప్రకటించిన కృష్ణయ్య
ఇక దేశం గూటికి చేరడం లాంఛనమే! చేవెళ్ల ఎంపీ టికెట్‌తో పాటు పార్టీలో కీలక బాధ్యతలు
అధినేత నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న సీనియర్ బీసీ నేతలు
బీజేపీ కూడా ‘బీసీ సీఎం’ అంటున్నా పట్టించుకోని కృష్ణయ్య
హైదరాబాద్: తెలంగాణలో మునిగిపోతున్న తెలుగుదేశం పార్టీని బీసీ కార్డుతో పైకిలేపే విఫలయత్నానికి అంకురార్పణ జరిగింది. కొద్దిరోజులుగా తెలంగాణలో ‘బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న పార్టీకే తమ అండ’ అని ప్రకటనలు చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య... తెలుగుదేశం పార్టీకే తమ మద్దతు అని శనివారం సాయంత్రం ప్రకటన చేశారు.
‘‘అన్ని పార్టీలకు ఆఫర్ ఇచ్చినా ఎవరూ ముందుకు రానందున బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న టీడీపీకి మద్దతు ఇవ్వాలని 42 బీసీ సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి..’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ‘తెలంగాణలో బీసీనే సీఎం..’ అని ఇటీవలే బీజేపీ కూడా ప్రకటించినా.. కృష్ణయ్య ఎక్కడా ఆ పార్టీ పేరెత్తకపోవడం గమనార్హం. కృష్ణయ్య ప్రకటనతో ఆయన టీడీపీలో చేరడం ఖరారైపోయింది. సోమవారంలోపు ఆయన ఇతర బీసీ సంఘాల నేతలతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో బీసీ సంఘాల నేతలతో మరోమారు సమావేశమై కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లపై విమర్శలు గుప్పించి.. పచ్చకండువా కప్పుకోనున్నట్లు సమాచారం. టీడీపీలో చేరిన వెంటనే కృష్ణయ్యకు టీటీడీపీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దాంతో పాటు చేవెళ్ల లోకసభ టికెట్ గానీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏదో ఒక శాసనసభ స్థానం టికెట్‌గానీ ప్రకటించే అవకాశం ఉంది.
ప్రణాళిక ప్రకారమే కృష్ణయ్యకు ఎర..: బీసీ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ జిల్లాల్లో పేరున్న కృష్ణయ్యకు ఎర వేయడం ద్వారా బీసీలంతా టీడీపీ వైపే ఉన్నారని చెప్పుకొనే ఈ ప్రయత్నానికి నెలరోజుల కిందే బీజం పడింది. బీసీలకు చట్టసభల్లో సగం సీట్లు ఇవ్వాలని కోరేందుకు వెళ్లిన కృష్ణయ్యతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు... 294 సీట్లలో 150 సీట్లు బీసీలకు ఇస్తామని, తెలంగాణలో బీసీని సీఎం చేస్తానని, టీడీపీలో చేరితే చేవెళ్ల టికెట్టిచ్చి పార్లమెంటుకు పంపుతానని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి సానుకూలత వ్యక్తం చేసిన కృష్ణయ్య బాబుతో పలుమార్లు మంతనాలు జరిపారు. నాలుగో తేదీన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘బీసీని సీఎం చేయాలి.. కృష్ణయ్యకే ఆ పదవి ఇస్తానని చంద్రబాబు ప్రకటించాలి’ అని బీసీ నేతలతో చెప్పించారు. ఇటీవల ఏకంగా.. ‘బీసీ సీఎం కృష్ణయ్యే’ అంటూ జిల్లా అధ్యక్షులతో తీర్మానింపజేశారు కూడా. పార్టీలో చేరాక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని బాబు హామీ ఇవ్వడంతో కృష్ణయ్య టీడీపీకి మద్దతిస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు.
టీడీపీ సీనియర్ నేతల ఆగ్రహం..: ‘‘బీసీల కోసం ఉద్యమించిన నాయకుడిని పార్టీలోకి తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. బీసీ సెల్‌కు
అధ్యక్షుడిని చేసినా సంతోషిస్తాం. కానీ సీఎం అభ్యర్థిగానో, టీటీడీపీ అధ్యక్షుడిగానో కొత్తగా వచ్చిన నాయకుడిని ప్రకటిస్తే సహించేది లేదు..’’ అని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకున్నా పార్టీలోనే కొనసాగుతున్న తమకు కొత్త దేవుడు కృష్ణయ్య అంటే ఎలా భరిస్తామని ప్రశ్నిస్తున్నారు.
అర్దరాత్రి వరకు సమావేశం: చంద్రబాబు శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో టీడీపీ తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితి, రాబోయే ఎన్నికలపై చర్చించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి, ఎన్నికల ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీల కూర్పుపై సమాలోచనలు జరిపారు. భేటీ అర్ధరాత్రి వరకు కొనసాగింది.