యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: రాబోయే ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వని రాజకీయ పార్టీల నేతలపైన రాళ్లదాడులు నిర్వహిస్తామని బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. తిరుపతిలోని యూత్‌హాస్టల్‌లో బీసీ ఉద్యోగ సంఘం ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన ప్రసంగించారు. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అసెంబ్లీలో 150, పార్లమెంట్‌కు 23 సీట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే రాళ్లదాడి తప్పదని హెచ్చరించారు.
బీసీలకు అన్యాయం చేసే పార్టీలకు వ్యతిరేకంగా పోరాడటానికి 5 వేల మందితో ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ మాత్రమే వంద అసెంబ్లీ సీట్లు, బీసీ డిక్లరేషన్ ఇస్తామని ప్రకటించాయన్నారు. అయితే ఇది చాలదని, 150 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ ఉద్యోగ సంఘం రూపొందించిన 2014 క్యాలెండర్‌ను కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ రైల్వే సలహామండలి సభ్యులు గుండ్లూరు వెంకటరమణ, బీసీ ఉద్యోగ సంఘ నాయకులు బడి ప్రసన్న, చంద్రశేఖర్, బీసీ నాయకులు బుల్లెట్ సురేష్, అశోక్, దశరథాచారి, ఆల్మెన్‌రాజు పాల్గొన్నారు.
బీసీలకు ప్రాధాన్యం ఇవ్వకుంటే రాళ్లదాడులు
Published Sat, Jan 4 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement