ముషీరాబాద్: సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల రుణం 4 కులాలకే కాకుండా బీసీ జాబితాలో ఉన్న 129 కులాలకు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో శనివారం జరిగిన 16 బీసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. 2017లో ఎన్నికల ముందు రుణాలు ఇస్తామని 6 లక్షల మంది వద్ద దరఖాస్తులు తీసుకొని, వారికి రుణాలు ఇవ్వలేదని తెలిపారు.
వారికి వెంటనే లక్షరూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ పోస్టులు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. వెంటనే ఈడీ పోస్టులను, బీసీ కార్పొరేషన్ల ఎండీ పోస్టులనూ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషనర్, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ, బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను ఎందుకు నియమించడంలేదని ప్రశ్నించారు. ఇన్నేళ్లు బీసీలను నిర్లక్ష్యం చేసి, ఎన్నికల ముందు రుణాలు అంటూ ప్రకటించడాన్ని బీసీలు గమనించాలని కోరారు.
బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నాయకులు జి.అనంతయ్య, మధుసూదన్, జిల్లపల్లి అంజి, వేముల రామకృష్ణ, పగడాల సుధాకర్, గొరిగ మల్లేష్ యాదవ్, సి.రాజేందర్, డీఆర్ చందర్, నీలం వెంకటేష్, జి.కృష్ణయాదవ్, రామాంజనేయులు, నర్సింహగౌడ్, బర్క కృష్ణ, ముత్యం వెంకన్నగౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment