సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల: ‘ఓట్ల సమయంలో మందు, డబ్బులు పంచడం నాకు రాదు. అలాంటి అలవాటు నాకు లేదు. రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు దయతలిస్తే మళ్లీ గెలుస్తా. అప్పుడు కూడా ఓ తమ్ముడిగా.. అన్నగా.. బిడ్డగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా. బీద, బిక్కిలను కడుపులో దాచుకుని పనిచేస్తా..’అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
పేదల గోసలు ఎరిగిన కేసీఆర్ లాంటి నాయకుడిని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ బంధు పథకాన్ని మంత్రి ప్రారంభించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 600 మందికి ఈ పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడలో ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
బీసీ బంధు నిరంతర ప్రక్రియ
‘రాష్ట్రంలోని అర్హులైన పేదవారు అడగకపోయినా సీఎం కేసీఆర్ వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయిన పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు అందర్నీ ఆదుకుంటున్నారు. కేసీఆర్ కిట్టు నుంచి ఆసరా పెన్షన్ల వరకు అన్ని విధాలా ఆదుకునే మనసున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. గడిచిన 9 ఏళ్లు సంక్షేమానికి స్వర్ణయుగంలా మారింది. బీసీ బంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో 300 మందికి అందిస్తున్నాం.
ఈ పథకంలో రూ.లక్ష లబ్ధి పొందిన 14 బీసీ కులాల పేదలు మళ్లీ ఆ డబ్బులను చెల్లించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది రుణం కాదు. కేవలం కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఇస్తున్న గ్రాంట్ మాత్రమే. అర్హులందరికీ అందించే వరకు ఈ పథకం కొనసాగుతుంది. శతాబ్దాల పేదరికాన్ని పోగొట్టేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి అందించి వారి పెళ్లిళ్లకు సాయం చేశాం.
రైతుబంధు, రైతు బీమా, నేతన్నలకు బీమా పథకాలను అమలు చేస్తున్నాం. చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఒడవదు. మళ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల వాళ్లు ఓట్లు అడగడానికి వస్తే.. మాకు ఎంతో చేసిన బీఆర్‌ఎస్‌ను కాదని మీకు ఓట్లు ఎందుకు వేయాలని నిలదీయండి. రాష్ట్రంలోని ఏ ఒక్క పేదవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రభుత్వం సాయం చేస్తూ వారి బతుకులను బాగు చేస్తుంది. గృహలక్ష్మి పథకంలో అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది..’అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
వచ్చే నెలలో మెడికల్ కాలేజీ ప్రారంభం
‘వచ్చే నెలలో సిరిసిల్లలో మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో 150 మంది డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటారు. అన్ని రోగాలకు ప్రత్యేక వైద్యులతో మెరుగైన వైద్యం అందుతుంది. చిన్నరోగం నుంచి క్యాన్సర్ వరకు ఉచితంగా వైద్యసేవలు జిల్లాలో పేద ప్రజలకు అందుతాయి..’అని మంత్రి చెప్పారు. జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్లు జిందం కళాచక్రపాణి, రామతీర్థం మాధవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment