rajanna sirisilla sp
-
యూట్యూబ్‌లో నెమలికూర వంటకం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ తన యూ ట్యూబ్ చానల్లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ అనే వ్యక్తి కొన్నా ళ్లుగా శ్రీటీవి అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు.అయితే శనివారం తన యూట్యూబ్ చానల్లో ‘నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి’ అంటూ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారందరూ విస్తుపోయారు. అంతేకాకుండా అడవిపంది కూర వండటం గురించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ చానల్లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఈ వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
ఆధునిక మగ్గాలు ఆగాయి
సిరిసిల్ల: ఒకవైపు మార్కెట్లో బట్టకు సరైన ధర లేదు...మరోవైపు వ్రస్తోత్పత్తి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సిరిసిల్లలోని టెక్స్‌టైల్‌పార్క్ పరిశ్రమలను యజమానులు మంగళవారం మూసివేశారు. దీంతో నేత కార్మికులకు ఉపాధి కరువైంది. టెక్స్టైల్ పార్క్‌లో మాంద్యం(సంక్షోభం) కారణంగా వస్త్రోత్పత్తి గిట్టుబాటు కావడం లేదని వ్రస్తోత్పత్తిదారులు పేర్కొంటున్నారు. ఆధునిక మగ్గాలను నిరవధికంగా బంద్ పెట్టడంతో అక్కడ పనిచేసే వెయ్యి మంది నేత కార్మికులు రోడ్డునపడ్డారు. వేలాదిమంది నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వరంగల్‌లో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పునాదుల్లో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాముందే నిర్మించిన సిరిసిల్ల తొలి టెక్స్టైల్ పార్క్ ఇప్పుడు సంక్షోభంతో మూతపడింది. సిరిసిల్లలో కార్మికులు కూలి పెంచాలని సమ్మెకు దిగడం సహజం. కానీ పరిశ్రమల యజమానులే కార్ఖానాలను మూసి వేసి బట్ట గిట్టుబాటు కావడం లేదని వ్రస్తోత్పత్తిని నిలిపివేయడం టెక్స్టైల్ రంగంలో సంక్షోభానికి అద్దం పడుతోంది. ఉపాధి లక్ష్యంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో 65 ఎకరాల్లో 2003లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. 7,000 మంది కార్మికులకు ఉపాధి లక్ష్యంగా దీనిని నెలకొల్పారు. 20 ఏళ్లుగా కేవలం గరిష్టంగా 2వేల మందికి పని కల్పించింది. టెక్స్టైల్ పార్క్‌లో 113 యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 65కు పడిపోయింది. 800 ఆధునిక ర్యాపియర్ లూమ్స్‌పై వస్త్రోత్పత్తి జరుగుతోంది. సంక్షోభం కారణంగా 40 మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్ లూమ్స్‌ను అమ్మేసుకున్నారు. విద్యుత్ చార్జీలూ భారమే టెక్స్టైల్ పార్క్‌లోని యూనిట్లకు విద్యుత్ చార్జీలు భారంగా మారాయి. వ్రస్తోత్పత్తిదారులకు యూనిట్ కరెంట్ ధర రూ.7.50 ఉంది. అదే మహారాష్ట్రలో యూనిట్ విద్యుత్ చార్జీలు రూ.3 ఉంది. తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండగా, అంతకు మించి వినియోగిస్తే ప్రతి యూనిట్‌కు రూ.2.50 ఉంది. పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ టారిఫ్ రేట్లు తక్కువగా ఉండగా, సిరిసిల్లలో ఎక్కువగా ఉండడంతో పొరుగు రాష్ట్రాలతో సిరిసిల్ల వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారు. ఇటీవల నూలు రేట్లు బాగా పెరగడం, రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో వ్రస్తోత్పత్తి వ్యయం కూడా పెరిగింది. ఒక్కో మీటరు బట్ట నాణ్యతను బట్టి రూ.18 నుంచి రూ.70 వరకు అమ్ముతుంటారు. అయితే ప్రస్తుతం బట్టకు మార్కెట్లో ధర లేక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం పార్క్‌లోని యూనిట్లలో కోటి మీటర్ల బట్టల నిల్వలు ఉన్నాయి. దీంతో టెక్స్టైల్ పార్క్‌లో పరిశ్రమలను నిరవధికంగా మూసివేశారు. నెలకు రూ.12వేలు వచ్చేవి పనిచేసిన రోజు రూ.400 నుంచి రూ.500 ఇచ్చేవారు. అంతా కలిపి నెలకు రూ.12వేలు వరకు ఉండేది. ఇప్పుడు పార్క్ మూసివేయడంతో మాకు పని లేకుండాపోయింది. మళ్లీ కార్ఖానాలు తెరిచే దాకా పని ఉండదు. పని చేయకుంటే ఇల్లు గడవదు. – గాజుల మల్లేశం, నేతకార్మికుడు టెక్స్టైల్ రంగం సంక్షోభంలో ఉంది మా కార్ఖానాల్లో బట్టల నిల్వలు పేరుకుపోయాయి. బట్ట ఉత్పత్తి వ్యయం కూడా ఎక్కువ అయ్యింది. ఆ మేరకు బట్టకు ధర లేక ఇబ్బందిగా ఉంది. ధర తగ్గించి అమ్మే పరిస్థితి ఏర్పడింది. నష్టాలను భరిస్తూ వ్రస్తోత్పత్తి చేయలేక యూనిట్లు మూసివే యాలని నిర్ణయం తీసుకున్నాం. –అన్నల్దాస్ అనిల్‌కుమార్, పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు -
మీరు దయతలిస్తే మళ్లీ గెలుస్తా!
సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల: ‘ఓట్ల సమయంలో మందు, డబ్బులు పంచడం నాకు రాదు. అలాంటి అలవాటు నాకు లేదు. రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు దయతలిస్తే మళ్లీ గెలుస్తా. అప్పుడు కూడా ఓ తమ్ముడిగా.. అన్నగా.. బిడ్డగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా. బీద, బిక్కిలను కడుపులో దాచుకుని పనిచేస్తా..’అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేదల గోసలు ఎరిగిన కేసీఆర్ లాంటి నాయకుడిని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ బంధు పథకాన్ని మంత్రి ప్రారంభించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 600 మందికి ఈ పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడలో ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీ బంధు నిరంతర ప్రక్రియ ‘రాష్ట్రంలోని అర్హులైన పేదవారు అడగకపోయినా సీఎం కేసీఆర్ వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయిన పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు అందర్నీ ఆదుకుంటున్నారు. కేసీఆర్ కిట్టు నుంచి ఆసరా పెన్షన్ల వరకు అన్ని విధాలా ఆదుకునే మనసున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. గడిచిన 9 ఏళ్లు సంక్షేమానికి స్వర్ణయుగంలా మారింది. బీసీ బంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో 300 మందికి అందిస్తున్నాం. ఈ పథకంలో రూ.లక్ష లబ్ధి పొందిన 14 బీసీ కులాల పేదలు మళ్లీ ఆ డబ్బులను చెల్లించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది రుణం కాదు. కేవలం కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఇస్తున్న గ్రాంట్ మాత్రమే. అర్హులందరికీ అందించే వరకు ఈ పథకం కొనసాగుతుంది. శతాబ్దాల పేదరికాన్ని పోగొట్టేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి అందించి వారి పెళ్లిళ్లకు సాయం చేశాం. రైతుబంధు, రైతు బీమా, నేతన్నలకు బీమా పథకాలను అమలు చేస్తున్నాం. చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఒడవదు. మళ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల వాళ్లు ఓట్లు అడగడానికి వస్తే.. మాకు ఎంతో చేసిన బీఆర్ఎస్ను కాదని మీకు ఓట్లు ఎందుకు వేయాలని నిలదీయండి. రాష్ట్రంలోని ఏ ఒక్క పేదవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రభుత్వం సాయం చేస్తూ వారి బతుకులను బాగు చేస్తుంది. గృహలక్ష్మి పథకంలో అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది..’అని కేటీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే నెలలో మెడికల్ కాలేజీ ప్రారంభం ‘వచ్చే నెలలో సిరిసిల్లలో మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో 150 మంది డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటారు. అన్ని రోగాలకు ప్రత్యేక వైద్యులతో మెరుగైన వైద్యం అందుతుంది. చిన్నరోగం నుంచి క్యాన్సర్ వరకు ఉచితంగా వైద్యసేవలు జిల్లాలో పేద ప్రజలకు అందుతాయి..’అని మంత్రి చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళాచక్రపాణి, రామతీర్థం మాధవి పాల్గొన్నారు. -
ఉద్యమకారులను విస్మరించి ద్రోహులకు పదవులా?
సిరిసిల్ల: తెలంగాణ వచ్చినంక కాపలా కుక్కలాగా ఉంటానన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు పిచ్చి కుక్కలాగా మారారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యా ఖ్యలు చేశారు. ఆ కుక్కను తరిమికొట్టాలని ప్రజల కు పిలుపునిచ్చారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో శనివారం హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నేతన్నచౌక్‌లో రేవంత్ ప్రసంగించారు. ఉద్యమకారులెవరూ ఆస్తులు కూడబెట్టలేదు.. చరిత్రలో ఎందరో ఉద్యమకారులున్నా ఎవరూ ఆస్తులు కూడబెట్టుకోలేదని, కానీ సీఎం కేసీఆర్‌కు మాత్రం వంద ఎకరాలు, ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల రక్తమాంసాలను ఆయన దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ల్యాండ్, స్యాండ్, మైనింగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఓ చిన్నారిని కుక్క కరిచి చంపితే సీఎం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని, ఆదుకోవాలనే సోయి కేసీఆర్‌కు లేదన్నారు. తెలంగాణ ఇచ్చినోళ్లకు అవకాశం ఇవ్వండి.. ‘తెలంగాణ తెచ్చానని చెప్పే కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశమిచ్చారు. మరి తెలంగాణ ఇచ్చినోళ్లకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి’అని రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. 2004లో కరీంనగర్ సభలో ఇచ్చిన మాట ప్రకారం సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. అలాంటి సోనియాకు కృతజ్ఞతగా కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. సిరిసిల్ల నేతన్నలనూ మోసం చేస్తూ.. బతుకమ్మ చీరల పేరిట, మ్యాక్స్ సంఘాల పేరిట మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నేతన్నలను మోసగిస్తూ మాఫియాలను పెంచి పోషిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. నేతన్నలకు నూలు డిపోలు అందుబాటులోకి రాలేదని, అపెరల్ పార్క్ పూర్తి కాలేదని, నేత కార్మికులు ఓనర్లు కాలేదన్నారు. కాగా, నేరెళ్ల దళితులపై పోలీసులు దాడి చేసినప్పుడు మాట్లాడిన బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని, ఎవరికి లొంగిపోయారని రేవంత్ ప్రశ్నించారు. సభలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కార్యక్రమ ఇన్చార్జి గిరీశ్, నేతలు షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌యాదవ్, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, కె.కె.మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కమీషన్లు వస్తేచాలా?: రేవంత్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంట్ పుణ్యమాని రాష్ట్రాన్ని శాసిస్తున్న కేటీఆర్.. సొంత నియోజకవర్గంలో శ్రీపాదసాగర్ ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కాల్వ పనులు పడకేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘మీకు కమీషన్లు వచ్చేస్తే చాలా?.. కాల్వల్లోకి నీళ్లు రావాల్సిన అవసరం లేదా?’అని ఆ ట్వీట్లో రేవంత్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో అపశ్రుతి ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): హాథ్‌సే హాథ్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట శివారులోని సింగసముద్రం 9వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. సింగసముద్రంలోకి వెళ్లే కాల్వను పరిశీలించి సిరిసిల్లకు తిరిగి వస్తుండగా రాచర్లతిమ్మాపూర్ స్టేజీ సమీపంలోని తుర్కపల్లి వద్ద రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో రాగట్లపల్లికి చెందిన రవితోపాటు పలువురు విలేకరులు గాయపడ్డారు. రేవంత్ క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఫిర్యాదు కోసం పెట్టెలు
బోయినపల్లి (రాజన్నసిరిసిల్ల): నేరాల నియంత్రణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ సీసీ కెమెరాలు, వాట్సప్ నెంబర్లు వినియోగంలోకి తెచ్చిన జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి.. కొత్తగా ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేసి జనం సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసే ఫిర్యాదు పెట్టెలో కేవలం పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన పిర్యాదులే కాకుండా..అన్ని ప్రభుత్వ శాఖలపై తమకు జరిగిన అన్యాయాలపై, జరిగిన నష్టంపై పిర్యాదు చేయవచ్చు. వివిధ శాఖలపై వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ పరిశీలించి సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు తగు చర్య నిమిత్తం పంపిస్తారు. ఏ జిల్లా వారైనా సరే అందుబాటులో ఉన్న ఫిర్యాదుల పెట్టెలో ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. కళాశాలలు, చౌరస్తాల్లో ఫిర్యాదు పెట్టెలను జిల్లాలోని పెద్ద గ్రామాల చౌరస్తాలు, కళాశాలు, హైస్కూళ్లు, బాలికల హాస్టళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. కళాశాల, హైస్కూల్, హాస్టళ్లలో ఉండే యువతులు తమకు జరిగిన అన్యాయాలపై, ఈవ్ టీజింగ్, తదితర వేధింపులపై రాసి పెట్టెలో వేస్తే సరిపోతుంది. ఈ పెట్టెలను ఎస్పీ వారానికోసారి స్వయంగా పరిశీలించనున్నారు. ఫిర్యాదులో చిరునామా ఉంటే సమస్యపై తీసుకున్న నిర్ణయాన్నీ సదరు ఫిర్యాదుదారులకు తెలియజేస్తారు.