సిరిసిల్ల: ఒకవైపు మార్కెట్‌లో బట్టకు సరైన ధర లేదు...మరోవైపు వ్రస్తోత్పత్తి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సిరిసిల్లలోని టెక్స్‌టైల్‌పార్క్ పరిశ్రమలను యజమానులు మంగళవారం మూసివేశారు. దీంతో నేత కార్మికులకు ఉపాధి కరువైంది. టెక్స్‌టైల్ పార్క్‌లో మాంద్యం(సంక్షోభం) కారణంగా వస్త్రోత్పత్తి గిట్టుబాటు కావడం లేదని వ్రస్తోత్పత్తిదారులు పేర్కొంటున్నారు. ఆధునిక మగ్గాలను నిరవధికంగా బంద్ పెట్టడంతో అక్కడ పనిచేసే వెయ్యి మంది నేత కార్మికులు రోడ్డునపడ్డారు.
వేలాదిమంది నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వరంగల్‌లో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పునాదుల్లో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాముందే నిర్మించిన సిరిసిల్ల తొలి టెక్స్‌టైల్ పార్క్ ఇప్పుడు సంక్షోభంతో మూతపడింది. సిరిసిల్లలో కార్మికులు కూలి పెంచాలని సమ్మెకు దిగడం సహజం. కానీ పరిశ్రమల యజమానులే కార్ఖానాలను మూసి వేసి బట్ట గిట్టుబాటు కావడం లేదని వ్రస్తోత్పత్తిని నిలిపివేయడం టెక్స్‌టైల్ రంగంలో సంక్షోభానికి అద్దం పడుతోంది.
ఉపాధి లక్ష్యంగా..
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో 65 ఎకరాల్లో 2003లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. 7,000 మంది కార్మికులకు ఉపాధి లక్ష్యంగా దీనిని నెలకొల్పారు. 20 ఏళ్లుగా కేవలం గరిష్టంగా 2వేల మందికి పని కల్పించింది. టెక్స్‌టైల్ పార్క్‌లో 113 యూనిట్లు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 65కు పడిపోయింది. 800 ఆధునిక ర్యాపియర్ లూమ్స్‌పై వస్త్రోత్పత్తి జరుగుతోంది. సంక్షోభం కారణంగా 40 మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్ లూమ్స్‌ను అమ్మేసుకున్నారు.
విద్యుత్ చార్జీలూ భారమే
టెక్స్‌టైల్ పార్క్‌లోని యూనిట్లకు విద్యుత్ చార్జీలు భారంగా మారాయి. వ్రస్తోత్పత్తిదారులకు యూనిట్ కరెంట్ ధర రూ.7.50 ఉంది. అదే మహారాష్ట్రలో యూనిట్ విద్యుత్ చార్జీలు రూ.3 ఉంది. తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండగా, అంతకు మించి వినియోగిస్తే ప్రతి యూనిట్‌కు రూ.2.50 ఉంది. పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ టారిఫ్ రేట్లు తక్కువగా ఉండగా, సిరిసిల్లలో ఎక్కువగా ఉండడంతో పొరుగు రాష్ట్రాలతో సిరిసిల్ల వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారు.
ఇటీవల నూలు రేట్లు బాగా పెరగడం, రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో వ్రస్తోత్పత్తి వ్యయం కూడా పెరిగింది. ఒక్కో మీటరు బట్ట నాణ్యతను బట్టి రూ.18 నుంచి రూ.70 వరకు అమ్ముతుంటారు. అయితే ప్రస్తుతం బట్టకు మార్కెట్‌లో ధర లేక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం పార్క్‌లోని యూనిట్లలో కోటి మీటర్ల బట్టల నిల్వలు ఉన్నాయి. దీంతో టెక్స్‌టైల్ పార్క్‌లో పరిశ్రమలను నిరవధికంగా మూసివేశారు.
నెలకు రూ.12వేలు వచ్చేవి
పనిచేసిన రోజు రూ.400 నుంచి రూ.500 ఇచ్చేవారు. అంతా కలిపి నెలకు రూ.12వేలు వరకు ఉండేది. ఇప్పుడు పార్క్ మూసివేయడంతో మాకు పని లేకుండాపోయింది. మళ్లీ కార్ఖానాలు తెరిచే దాకా పని ఉండదు. పని చేయకుంటే ఇల్లు గడవదు. – గాజుల మల్లేశం, నేతకార్మికుడు
టెక్స్‌టైల్ రంగం సంక్షోభంలో ఉంది
మా కార్ఖానాల్లో బట్టల నిల్వలు పేరుకుపోయాయి. బట్ట ఉత్పత్తి వ్యయం కూడా ఎక్కువ అయ్యింది. ఆ మేరకు బట్టకు ధర లేక ఇబ్బందిగా ఉంది. ధర తగ్గించి అమ్మే పరిస్థితి ఏర్పడింది. నష్టాలను భరిస్తూ వ్రస్తోత్పత్తి చేయలేక యూనిట్లు మూసివే యాలని నిర్ణయం తీసుకున్నాం. –అన్నల్‌దాస్ అనిల్‌కుమార్, పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment