అధికారంలోకొస్తే బీసీ బడ్జెట్‌ | We will give priority to backward classes in nominated posts says bandi sanjay | Sakshi
Sakshi News home page

అధికారంలోకొస్తే బీసీ బడ్జెట్‌

Published Fri, May 19 2023 3:31 AM | Last Updated on Fri, May 19 2023 3:31 AM

We will give priority to backward classes in nominated posts says bandi sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/నాగోల్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్‌ కేటాయింపులు చేస్తామని వెల్లడించింది. అలాగే బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు శాచురేషన్‌ ప్రాతిపదికన ఆర్థిక సాయం, నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు పెద్దపీట, ఎన్నికల్లో పోటీ చేయలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత వంటి కీలకాంశాలను ఇందులో పొందుపరిచింది.

రాష్ట్రంలో 130 కులాలను ఏకం చేసి అధికార సాధనకు ముందుకెళ్లనున్నట్టు తెలిపింది. వచ్చే నెలలో లక్షలాది మందితో హైదరాబాద్‌లో బీసీ గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ రాష్ట్రవ్యాప్త ఓబీసీ మోర్చా కాన్ఫరెన్స్‌–బీసీ సమ్మేళనంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమక్షంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్‌ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు.

ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్‌రాజ్, బీజేపీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, డా. బూర నర్సయ్యగౌడ్, వన్నాల శ్రీరాములు, కూన శ్రీశైలంగౌడ్, నందీశ్వర్‌గౌడ్, తుల ఉమ, ఆకుల విజయ, గడీ శ్రీకాంత్, ఎస్‌. హరిశంకర్‌గౌడ్, ఇతర నాయకుల హర్షధ్వానాల మధ్య లక్ష్మణ్‌ ఈ ప్రకటన చేశారు.
 
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను దోషిగా నిలబెడతాం: లక్ష్మణ్‌ 

ఈ సందర్భంగా కె. లక్ష్మణ్‌ మాట్లాడుతూ బీసీల సంక్షేమం విషయంలో కేసీఆర్‌కు, కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించేందుకే ఓబీసీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘కాంగ్రెస్‌ పార్టీ బీసీల ద్రోహి.... బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది కాంగ్రెస్సే. ఆ పార్టీతోపాటు బీఆర్‌ఎస్‌ కూడా బీసీ రిజర్వేషస్లను వ్యతిరేకించింది’ అని లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు.

‘తెలంగాణలో బీసీలను కేసీఆర్‌ అణగదొక్కుతున్నారు. పల్లెపల్లెకూ బీసీ–ఇంటింటికీ బీజేపీ పేరిట వీటన్నింటిపై ప్రచారం చేస్తాం. అతిత్వరలో లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహించి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను బీసీ దోషిగా నిలబెడతాం’ అని లక్ష్మణ్‌ ప్రకటించారు. ‘ఉత్తరాంధ్రకు చెందిన 26 బీసీ కులాల ప్రజలు తెలంగాణలో స్థిరపడితే ఒక్క కలంపోటుతో జీవో జారీ చేసి బీసీ జాబితా నుంచి తొలగించిన ద్రోహి కేసీఆర్‌. రాష్ట్రంలో 54 శాతం బీసీలంటే కేవలం ముగ్గురికే కేసీఆర్‌ మంత్రి పదవులిచ్చారు. కానీ కేసీఆర్‌ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులొచ్చాయి’ అని లక్ష్మణ్‌ మండిపడ్డారు. 

గొర్లు, బర్లు ఇచ్చి బీసీలను అణగదొక్కుతారా?: బండి 
‘బీసీలను కేసీఆర్‌ అవమానిస్తున్నారు. 50 శాతం జనాభా ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులా? గొర్లు, బర్లు, చేపలు ఇచ్చి రాజకీయంగా అణగదొక్కుతున్నారు. కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ పదవులిస్తారా? జయశంకర్, కొండా లక్ష్మణ్‌ బాపూజీలను అవమానించిన మూర్ఖుడు కేసీఆర్‌. బీసీబంధు ఇవ్వడానికున్న అభ్యంతరం ఏమిటి?’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

అవసరం లేకపోయినా రూ. 1,600 కోట్లు ఖర్చు పెట్టి సచివాలయం, ప్రగతి భవన్‌ కట్టుకున్న సీఎం... బీసీ ఆత్మగౌరవ భవనాలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో బీసీ సమాజం గుర్తించాలి. డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వడం లేదు. బీసీలకు రావాల్సిన వాటా నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదు? తెలంగాణలో పేదల రాజ్యం రావాల్సిందే. అందుకోసం 5 నెలలు పూర్తి సమయం మాకివ్వండి.

కేసీఆర్‌ రాక్షస, కుటుంబ పాలనను అంతం చేస్తాం. పేదల రాజ్యాన్ని తీసుకొస్తాం’ అని సంజయ్‌ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుందన్నారు. 

బీసీ డిక్లరేషన్‌పై బీజేపీ నేతల హర్షం
సాక్షి, హైదరాబాద్‌: ఓబీసీ సమ్మేళనంలో చేసిన బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను బీజేపీ నేతలు డీకే అరుణ, వివేక్‌ వెంకటస్వా మి, ఏపీ జితేందర్‌ రెడ్డి, విజయశాంతి వేర్వేరు ప్రకటనల్లో అభినందించారు.

ఇన్నాళ్లూ బీసీలకు కేసీఆర్‌ చేస్తున్న అన్యాయాన్ని ఈ డిక్లరేషన్‌ సరిచేస్తుందని డీకే అరుణ పేర్కొన్నారు. వెనకబడిన వర్గాలపై బీజేపీ నిబద్ధతకు ఇది నిదర్శనమని వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. బీసీ వర్గాలకు మేలు చేసేలా రాష్ట్రపార్టీ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించడం సంతోషమని ఏపీ జితేందర్‌ రెడ్డి తెలిపారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో ఓబీసీలు చెంపపెట్టు లాంటి తీర్పునివ్వాలని విజయశాంతి కోరారు.

సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు... 
52 శాతం జనాభా ఉన్న బీసీలను అన్ని రంగాల్లో అణచివేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వ తీరుకు ఖండన 
♦ స్ధానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుంచి 23 శాతానికి తగ్గించి బీసీలపట్ల వివక్షపై ఖండన 
♦ 12 శాతమున్న ముస్లింలకు 201 గురుకులాలు, 52 శాతమున్న బీసీలకు 260 గురుకులాలే కేటాయించడంపై ఖండన 
♦ అన్ని వర్గాలకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చి బీసీలకు కేవలం 11 శాతం ఇవ్వడాన్ని తప్పుబడుతూ తీర్మానం. 
♦ కేసీఆర్‌ సర్కార్‌ బీసీల వ్యతిరేక వైఖరి, మోదీ సర్కార్‌ సాగిస్తున్న సంక్షేమం గురించి ప్రతి బీసీ కుటుంబంలో చర్చించాలి. 
♦ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బూత్, మండల, రాష్ట్ర స్థాయిల్లో ‘బీసీల గోస–బీజేపీ భరోసా’ చర్చ నిర్వహణ. 
♦ బీసీ ఓటర్లలో చైతన్యం కల్పిం చి ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ప్రలోభాలు, ధన రాజకీయాలను తిప్పికొట్టాలి. 
♦ అన్ని రంగాల్లో బీసీల పురోగతి సాధన డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే సాధ్యమని బీసీ వర్గాలు గుర్తించాలి. 
♦ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పనపై మోదీ సర్కార్‌కు ధన్యవాదాలు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement