సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లోపు అసెంబ్లీ ఎన్నికల ఘట్టం పూర్తి కావాల్సి ఉంది. దీంతో రాష్ట్రంలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు తమ సీట్లను ఖరారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. కొందరు ఇప్పటికే నియోజకవర్గాల్లో పని ప్రారంభించగా, మరికొందరు తాము పోటీ చేసే స్థానాలను నిర్ధారించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశాన్ని పక్కన పెడితే.. వామపక్ష పార్టీల కార్యదర్శులతో సహా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులందరూ (ఎంఐఎం మినహా) ఈసారి అసెంబ్లీకి పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.
బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలం అవుతున్న ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని పార్టీవర్గాలు చెబుతుండగా.. ఎంపీలుగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీ బరిలో దిగడం ఖాయంగా కన్పిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మూడు, నాలుగు నెలలకు పార్లమెంటు ఎన్నికలు జరగనుండడంతో, ముందు అసెంబ్లీకి పోటీ చేసి ఆ తర్వాతి పరిస్థితులను బట్టి లోక్‌సభ బరిలో దిగే అంశాన్ని వీరు పరిశీలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సహా వివిధ పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నవారు ఏయే నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే చర్చ ప్రారంభమైంది.
ఈసారి కూడా గజ్వేల్ నుంచే..
సీఎం కేసీఆర్ ఈసారి కూడా గజ్వేల్ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేయనున్నారని తెలంగాణ భవన్ వర్గాలు చెపుతున్నాయి. జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపించే నాటికి మారే రాజకీయ సమీకరణల ప్రకారం అవసరమైతే మెదక్ నుంచి ఆయన లోక్‌సభకు పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈసారి దుబ్బాక అసెంబ్లీకి పోటీ చేయనుండడం, పార్టీ ఏర్పాటైన నాటి నుంచి మెదక్ ఎంపీ స్థానం టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న నేపథ్యంలో అవసరమనుకుంటే కేసీఆర్ అక్కడి నుంచే పోటీ చేస్తారని అంటున్నారు.
రసకందాయంలో కొడంగల్
రేవంత్‌రెడ్డి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ స్థానం నుంచే పోటీ చేస్తారనే భావన కాంగ్రెస్ వర్గాల్లో ఉండేది. అయితే అక్కడ బీఆర్‌ఎస్ అసంతృప్త నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి కాంగ్రెస్ గూటిలో చేరడంతో అక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గుర్నాథ్‌రెడ్డి లేదా ఆయన కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి బరిలో ఉంటారని, ఈ ఒక్కసారి తమ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారనే చర్చ జరుగుతోంది.
మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల పోటీచేస్తే ఇతర నియోజకవర్గాలపై కూడా కొంత ప్రభావం ఉంటుందని, మాస్ క్రేజ్ ఉన్న నాయకుడిగా ఆయన మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొడంగల్ కాకుంటే ఎల్బీనగర్ లేదా ఉప్పల్ అసెంబ్లీ స్థానాల నుంచి రేవంత్ పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
కరీంనగర్ అసెంబ్లీపై బండి కన్ను!
ఇక బండి సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తాను ఈసారి కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన సంకేతాలిచ్చారు. ఆ మేరకు కరీంనగర్ నుంచే పోటీ చేస్తారా? లేక వేములవాడ నుంచా? అనే చర్చ బీజేపీలో జరుగుతోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంత బిజీగా ఉన్నా వారంలో ఒకరోజు కరీంనగర్‌లో అందుబాటులో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో ఆయన కరీంనగర్ అసెంబ్లీ బరిలో నిలుస్తారనే చర్చ ఊపందుకుంది.
పాలేరు నుంచి తమ్మినేని, కొత్తగూడెం నుంచి కూనంనేని
వామపక్షాల విషయానికొస్తే.. ఆ పార్టీలకు బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులిద్దరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు జనరల్ స్థానాల నుంచి బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీకి దిగుతారనే చర్చ జరుగుతోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని, పొత్తు కుదిరితే ఆ రెండు పార్టీలు అడిగే మొదటి సీట్లు ఇవేననే ప్రచారం బాగా జరుగుతోంది.
కోదండరాం, ప్రవీణ్‌కుమార్, షర్మిల కూడా..
టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఈసారి అసెంబ్లీ బరిలో ఉండాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఆయన పోటీ చేయాల్సిందేనని పార్టీ నేతలు పట్టుబడుతున్న నేపథ్యంలో తన సొంత నియోజకవర్గమైన మంచిర్యాల లేదంటే సికింద్రాబాద్, ఉప్పల్ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ (ఆర్‌ఎస్పీ) ఉమ్మడి మహబూబ్‌నగర్ (సొంత జిల్లా) పరిధిలోని ఆలంపూర్, లేదంటే అచ్చంపేట నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇక వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. తాను ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇలావుండగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మాత్రం మరోసారి హైదరాబాద్ లోక్‌సభకే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
‘అధ్యక్షులు’ అసెంబ్లీకే!
Published Tue, Jan 31 2023 1:12 AM | Last Updated on Tue, Jan 31 2023 9:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment