హన్మకొండ: కేసీఆర్.. రాక్షసుడు, మోదీ.. బ్రహ్మ రాక్షసుడని, వారిని ఎదుర్కొనేందుకే సోనియాగాంధీ తెలంగాణకు వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి కాబట్టే సోనియాగాంధీ సభను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించా రు. కేవీపీతో తాను కలిసి పనిచేస్తున్నానని కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
కేవీపీ, సీఎం కేసీఆర్ కలుసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని, ఒకే సామాజికవర్గానికి చెందిన వీరు కలిసి ఆంధ్రాలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిని తెలంగాణకు తీసుకొచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. త్వరలో వీరు కలిసిన ఫొటోలు ప్రజల ముందుకు తీసుకొస్తానన్నారు. అమెరికా, దుబాయి లో నెల రోజులు తిరిగిన కేటీఆర్ నిషాలో ఉండి.. సోనియా తెలంగాణ ఇవ్వలేదని, కేసీఆర్ వల్లే వచ్చిందని మాట్లాడుతున్నాడని, సోనియా తెలంగాణ ఇచ్చినప్పుడు కేటీఆర్ అమెరికాలో బాత్రూంలు కడుగుతున్నాడని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కోసం తుక్కు గూడ రైతులు ముందుకొచ్చి 200 ఎకరాల భూమి ఇచ్చారన్నారు. ఈ నెల 17న సాయంత్రం తుక్కు గూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయ భేరి మోగించేందుకు సోనియా రాబోతున్నారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ రవీంద్ర ఉత్తమ్ ధళ్వి, మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి పాల్గొన్నారు.
కేయూ విద్యార్థి దీక్షలకు సంఘీభావం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో వారంరోజులుగా కొనసాగుతున్న విద్యార్థి జేఏసీ నిరసన దీక్షల శిబిరాన్ని బుధవారం రేవంత్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. పీహెచ్‌డీ రెండో కేటగిరీ అడ్మిషన్ల అవకతవకలపై ప్రశ్నించి ఆందోళన చేసినందుకు విద్యార్థులను వీసీ, రిజిస్ట్రార్లు పోలీసులను పిలిపించి కాళ్లు చేతులు విరగొట్టించటం పాశవిక చర్య అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. అనంతరం విద్యార్థులకు జ్యూస్ ఇచ్చి దీక్షలు విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment