ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం తగదు
దోమలగూడ: ఉద్యోగాల భర్తీలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రాష్ట్రాల నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్, బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారన్నారు.
నిధులు, నియామకాలు, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, నేడు నిధులు కాంట్రాక్టర్లకు భోజ్యమయ్యాయని, నియామకాలు గాలికి, నీళ్లను సముద్రానికి వదిలేశారన్నారు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 3 వేల ఇంజనీరింగ్ పోస్టులను మాత్రమే భర్తీ చేయడం దారుణ మన్నారు, గ్రూపు2 సర్వీసు ఉద్యోగాలను నోటిఫై చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. గ్రూపు 1నోటిఫికేషన్లు విడుదల చేయలేదని, టీచర్ల పోస్టులు భర్తీ చేయడం లేదని ఆరోపించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 10 వేల టీచర్ల పోస్టులు మినహా ఒక్క పోస్టు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు గుణపాఠం తప్పదని హెచ్చరిం చారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌గౌడ్, కృష్ణ, రాజేందర్, కృష్ణయాదవ్, శ్రీనివాస్, కి షోర్, రాజు, గంగనబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు