
ఫీజులు పెంచితే ఉద్యమం
ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఆర్.కృష్ణయ్య హెచ్చరిక
హైదరాబాద్ : ప్రైవేటు మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఏకీకృత ఫీజు విధానం పెట్టి అన్ని కేటగిరిలకూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.10 లక్షల ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదన సరికాదని, దీనిని వెంటనే విరమించుకోవాలని 24బీసీ సంఘాల సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బీసీ భవన్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య ను వ్యాపారంగా మారుస్తోందని విమర్శించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల అడ్మిషన్లు మెరిట్ ఆధారంగా చేపట్టాలని కోరారు. ఫీజులను పెంచితే ఉద్యమిస్తామని అన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను గతేడాది మాదిరిగానే కొనసాగించాలని, ఫీజులను పెంచరాదని, ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రస్తుతం ఉన్న ఏ,బీ, సీ మూడు కేటగిరిలను రెండుకి కుదించాలని, బీ కేటగిరిలో ఉన్న 10 శాతం సీట్లను ఏ కేటగిరిలో కలపాలని డిమాండ్ చేశారు.
సీ కేటగిరిలోని 40 శాతం యాజమాన్యపు కోటాను 20 శాతానికి తగ్గించి దాన్ని ‘ఏ’ కేటగిరిలో కలపాలన్నారు. 80 శాతం కన్వీనర్ కోటాను మెరిట్ ప్రతిపదికన భర్తీ చేయాలని, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీసీ, సాంఘిక, గిరిజన, మైనార్టీ, వికలాంగ, మహిళ, శిశు సంక్షేమ శాఖలను విలీనంచేసి ఒకే శాఖ గా మార్చాలనే ప్రతిపాదన తగదన్నారు. అకాల వర్షాలకు తడిసిన పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించారు. సమావేశంలో ఆయా సంఘాల నేతలు జె.శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, సీహెచ్ భద్ర, సి.రాజేందర్, ఎ.రాంకోఠి ప్రసంగించారు.