ఆదివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సభకు హాజరైన ప్రజలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకే బీసీలు ఓట్లు వేస్తారని బీసీ బహిరంగసభ తేల్చిచెప్పింది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీసీ బహిరంగసభ జరిగింది.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయ ణ అధ్యక్షతన జరిగిన ఈ సభకు సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఎంపీ బండారు దత్తాత్రే య, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రజాగాయకుడు గద్దర్, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నేతలు ర్యాగ అరుణ్, నీల వెంకటేశ్ తదితరు లు హాజరయ్యారు.
రాజ్యాధికారమే ప్రధాన ఎజెం డాగా జరిగిన ఈ సభలో బీసీల సమగ్ర అభివృద్ధి కోసం 21 అంశాలతో తీర్మానాలు చేశారు. ఈ తీర్మాన ప్రతిని అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వనున్నామని, ఆయా పార్టీల మేనిఫెస్టోల్లో ఈ అంశాలను చేర్చినవాటికే మద్దతిస్తామని బీసీ సంఘం తెలిపింది.
బీసీలను గెలిపించుకుందాం: ఆర్.కృష్ణయ్య
జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్నిరంగాల్లో వాటా దక్కాలని ఆర్.కృష్ణయ్య అన్నారు. టికెట్లు పొందడానికి బీసీలకు అర్హత లేదనట్లు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని, వివక్ష చూపే పార్టీలకు బీసీలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీసీ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
ఎస్సీ, ఎస్టీల కంటే అధ్వానం: దత్తాత్రేయ
ఎస్సీ, ఎస్టీల కంటే అధ్వానంగా బీసీలు బతుకుతున్నారని ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీలకు చట్టపరమైన రిజర్వేషన్లు లేకపోవడంతో ఇప్పటికీ వెనుకబడ్డారన్నారు.
రన్నింగ్ బస్ దిగేశారు: జస్టిస్ చంద్రకుమార్
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొందరపాటు చర్యలకు త్వరలో మూల్యం చెల్లించాల్సి వస్తుందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. బస్టాప్ రాకముందే రన్నింగ్ బస్ దిగారని, దీంతో గమ్యస్థానం పోకుండా దెబ్బతినడం ఖాయమన్నారు.
బడుగులకు రాజ్యాధికారం దిశగా: తమ్మినేని
బడుగులకే రాజ్యాధికారం రావాలనే దిశగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ముందుకు సాగుతోందని తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆర్.కృష్ణయ్య ఒప్పుకుంటే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామన్నారు.
దొరల రాజ్యాన్ని అంతం చేయాలి: చెరుకు
సామాజిక మార్పుతోనే బీసీ వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని చెరుకు సుధాకర్ అన్నారు. బీసీలు తమ ఓటుతో దొరల రాజ్యాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు.
మామ, అల్లుడి సంపాదన రూ.50 వేల కోట్లు: రమణ
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు బీసీలు చరమగీ తం పాడతారని ఎల్.రమణ అన్నారు. 20 ఏళ్ల క్రితం మంత్రి హరీశ్ హవాయి చెప్పులేసుకునే వారని, ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టుల్లో భారీగా సం పాదించారన్నారు. మామ, అల్లుళ్లు రూ.50 వేల కోట్లు సంపాదించారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన బీసీ అభ్యర్థులకు పార్టీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడంలేదన్నారు.
బీసీ బహిరంగసభ తీర్మానాలు
♦ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
♦ అసెంబ్లీ, పార్లమెంటులో సీట్లను రెట్టింపు చేసి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించని కులాలకు నామినేటెడ్ పద్ధతిలో ప్రాధాన్యత ఇవ్వాలి
♦ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి
♦ రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్
♦ బీసీలకు విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు
Comments
Please login to add a commentAdd a comment