BCC Welfare Society
-
సీట్లు ఎక్కువ ఇచ్చినోళ్లకే ఓట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకే బీసీలు ఓట్లు వేస్తారని బీసీ బహిరంగసభ తేల్చిచెప్పింది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీసీ బహిరంగసభ జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయ ణ అధ్యక్షతన జరిగిన ఈ సభకు సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, ఎంపీ బండారు దత్తాత్రే య, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, ప్రజాగాయకుడు గద్దర్, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నేతలు ర్యాగ అరుణ్, నీల వెంకటేశ్ తదితరు లు హాజరయ్యారు. రాజ్యాధికారమే ప్రధాన ఎజెం డాగా జరిగిన ఈ సభలో బీసీల సమగ్ర అభివృద్ధి కోసం 21 అంశాలతో తీర్మానాలు చేశారు. ఈ తీర్మాన ప్రతిని అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వనున్నామని, ఆయా పార్టీల మేనిఫెస్టోల్లో ఈ అంశాలను చేర్చినవాటికే మద్దతిస్తామని బీసీ సంఘం తెలిపింది. బీసీలను గెలిపించుకుందాం: ఆర్.కృష్ణయ్య జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్నిరంగాల్లో వాటా దక్కాలని ఆర్.కృష్ణయ్య అన్నారు. టికెట్లు పొందడానికి బీసీలకు అర్హత లేదనట్లు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని, వివక్ష చూపే పార్టీలకు బీసీలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీసీ అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీల కంటే అధ్వానం: దత్తాత్రేయ ఎస్సీ, ఎస్టీల కంటే అధ్వానంగా బీసీలు బతుకుతున్నారని ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీలకు చట్టపరమైన రిజర్వేషన్లు లేకపోవడంతో ఇప్పటికీ వెనుకబడ్డారన్నారు. రన్నింగ్ బస్ దిగేశారు: జస్టిస్ చంద్రకుమార్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొందరపాటు చర్యలకు త్వరలో మూల్యం చెల్లించాల్సి వస్తుందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. బస్టాప్ రాకముందే రన్నింగ్ బస్ దిగారని, దీంతో గమ్యస్థానం పోకుండా దెబ్బతినడం ఖాయమన్నారు. బడుగులకు రాజ్యాధికారం దిశగా: తమ్మినేని బడుగులకే రాజ్యాధికారం రావాలనే దిశగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ముందుకు సాగుతోందని తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆర్.కృష్ణయ్య ఒప్పుకుంటే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామన్నారు. దొరల రాజ్యాన్ని అంతం చేయాలి: చెరుకు సామాజిక మార్పుతోనే బీసీ వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని చెరుకు సుధాకర్ అన్నారు. బీసీలు తమ ఓటుతో దొరల రాజ్యాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. మామ, అల్లుడి సంపాదన రూ.50 వేల కోట్లు: రమణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనకు బీసీలు చరమగీ తం పాడతారని ఎల్.రమణ అన్నారు. 20 ఏళ్ల క్రితం మంత్రి హరీశ్ హవాయి చెప్పులేసుకునే వారని, ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టుల్లో భారీగా సం పాదించారన్నారు. మామ, అల్లుళ్లు రూ.50 వేల కోట్లు సంపాదించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన బీసీ అభ్యర్థులకు పార్టీ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడంలేదన్నారు. బీసీ బహిరంగసభ తీర్మానాలు ♦ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి ♦ అసెంబ్లీ, పార్లమెంటులో సీట్లను రెట్టింపు చేసి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించని కులాలకు నామినేటెడ్ పద్ధతిలో ప్రాధాన్యత ఇవ్వాలి ♦ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి ♦ రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ♦ బీసీలకు విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు -
నేడు బీసీ సింహగర్జన సభ
సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ సంఘం నిర్వహించనున్న బీసీ సింహగర్జన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో సభ ప్రారం భం కానుంది. ఎన్నికలు సమీపించిన తరుణం లో భారీ ఎత్తున తలపెట్టిన ఈ సింహగర్జనకు ప్రాధాన్యం ఏర్పడింది. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు, సంక్షేమ ఫలాలు అందించాలనే డిమాండ్‌ను బీసీ సంఘాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయని, ప్రస్తుతం ఎన్నికలు నేపథ్యంలో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో బీసీ డిమాండ్లు చేర్పించాలనే లక్ష్యంతో సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. బీసీలకు 50శాతం సీట్లు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేంతవరకు ఉద్యమాన్ని ఆపబోమన్నారు. -
జడ్జీల నియామకంలో రిజర్వేషన్లు కల్పించాలి
హైదరాబాద్: హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కోటా కల్పించాల ని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సభ్యులుగా గెలుపొందిన బీసీలకు అభినందన సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. గత 70 ఏళ్లుగా న్యాయస్థానాల్లో మెజారిటీ తీర్పులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా వస్తున్నాయన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఈ వర్గాల అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీస్తున్నారని విమర్శించారు. చట్టసభల్లో రిజ ర్వేషన్లు లేకపోవడం వల్ల ఈ కులాలకు న్యాయం జరగడం లేదని అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పంచా యతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచాలని, ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్టును తీసుకురావాలని డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్‌కు ఎన్నికైన సిరికొండ సంజీవరావు, చలకాని వెంకట్ యాదవ్, శంకర్, డి.జనార్దన్, సునీల్ గౌడ్, ఫణీంద్ర భార్గవ్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడ్వకేట్ నాగుల శ్రీనివాస్ యాదవ్, కొండూరు వినోద్‌కుమార్, జనార్దన్ గౌడ్, విజయ్ ప్రశాంత్, కోల జనార్దన్, వేల్పుల బిక్షపతి, నర్సింహ గౌడ్, నీల వెంకటేశ్ జి.అంజి, అనంతయ్య, జైపాల్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలను మోసగిస్తున్న టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: వెనకబడిన తరగతులను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే కేబినెట్ బీసీ సబ్ కమిటీ రెండొందల అంశాలతో రూపొందించిన ప్రణాళికను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమావేశమందిరంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. 2017 డిసెంబర్లో సీఎం కేసీఆర్ హడావుడిగా బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక కమిటీనైతే ఏర్పాటు చేశారే కానీ.. ఆ కమిటీకి కనీస గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. కమిటీ చేసిన రెండొందల ప్రతిపాదనల్లో ఏ ఒక్కదాన్ని ఆమోదించలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి బీసీలంటే చులకన భావముందని, ఇందుకు బీసీ కమిటీకి ఇచ్చిన ప్రాధాన్యతే నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే బీసీలకు న్యాయం జరిగిందని, పీసీసీ అధ్యక్షుడిగా నియమించి గౌరవం ఇచ్చామన్నారు. జనాభా ప్రతిపాదికన ఎన్నికల్లో రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీసీ జనాభా 54 శాతం ఉందని చెప్పారు. కార్పొరేటు విద్యా సంస్థల ఫీజు దోపిడీని అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్నారు. అనంతరం ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీల సంక్షేమాన్ని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. జనాభా ప్రకారం బీసీలకు నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. నిధుల్లేక నీరసించిన కార్పొరేషన్లు: ఆర్.కృష్ణయ్య బీసీ విద్యార్థులకు ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య అన్నారు. గత మూడేళ్లుగా కార్పొరేషన్లు నిధులు లేక నీరసించాయని, ఈ సారైనా సంతృప్తికర స్థాయిలో నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కులను సాధించుకోవాల్సిన అవసరముందని.. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలన్నారు. త్వరలో బీసీ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామని, ప్రభుత్వాలు స్పందించేవరకు పోరాటం ఆపమని చెప్పారు. సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రత్యేక అభివృద్ధి నిధితోనే బీసీల అభ్యున్నతి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక అభివృద్ధి నిధితోనే బీసీల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. వచ్చే బడ్జెట్లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. గురువారం సచివాలయంలో శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో సంఘం ప్రతినిధులు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో సమావేశమయ్యారు. బీసీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభా 52 శాతం దాటిందని, ఆ మేరకు నిధులు ఖర్చు చేయాలన్నారు. ప్రధాన శాఖల ద్వారా అమలు చేసే సంక్షేమ పథకాలకు ఒకే చోట కేటాయించి ఖర్చు చేయాలని, దీంతో బీసీల్లోని అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు చెరో రూ.2 వేల కోట్లు కేటాయించి నిరుద్యోగులకు పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని సూచించారు. కులవృత్తులు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, దీనికి కార్యాచరణ తయారు చేయాలన్నారు. బీసీ ఫెడరేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటిని సకాలంలో మంజూరు చేయాలని కోరారు. ర్యాంకుతో నిమిత్తంలో లేకుండా విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, గురుకులాల సంఖ్యను పెంచాలన్నారు. కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన బీసీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. భేటీలో సంఘ ప్రతినిధులు గుజ్జ కృష్ణ, రమేష్, బీఆర్ కృష్ణ, నర్సింహగౌడ్ తదితరులున్నారు. -
ఫీజు బకాయిలు విడుదల చేయండి
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: ఫీజు బకాయిలు 8 రోజుల్లోగా చెల్లించక పోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. మంగళవారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ జి. అంజి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. ప్రభుత్వం రూ.1800 కోట్ల ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజులు చెల్లిం చకపోవడంతో యాజమాన్యాలు మెమోలు ఇవ్వడంలేదని, కొత్తగా కోర్సుల్లో చేరాలంటే అడ్మిషన్లు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్నట్లుగా బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, కుట్ల శ్రీనివాస్, పి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.