
చంద్రబాబు కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: కాపుల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్వంద్వ నీతిని అనుసరిస్తున్నారని, బీసీలను ధర్నాలు చేయాల్సిందిగా కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఓ వైపు ముఖ్యమంత్రి స్వయంగా రిజర్వేషన్లు కల్పిస్తామని కాపులతో చెబుతూ మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేతోనే అందుకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలంతా ఆయన మోసపూరిత వైఖరిని గమనించాలని కోరారు.
ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే (ఆర్.కృష్ణయ్య) కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ధర్నాలు చేయండని పిలుపునిస్తూ ఉంటే ఆయనకు నచ్చజెప్పుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు.
కృష్ణయ్యకు సూటి ప్రశ్న
‘నేనూ బీసీనే.. మీరూ (కృష్ణయ్య) బీసీనే.. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా.. మీరు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో తూర్పు కాపు, కొప్పుల వెలమ, గౌడ్లు, కాళింగ వంటి 23 బీసీ కులాలను బీసీల జాబితా నుంచి తొలగిస్తే ఎందుకు కిమ్మనకుండా ఉండి పోయారు. కనీసం నిరసన కూడా ఎందుకు తెలపలేదు. మీ సొంత రాష్ట్రంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో ఎప్పటి నుంచో 1953 నుంచి బీసీలుగా గుర్తింపు పొందిన కాపులు తమ రిజర్వేషన్లను పునరుద్ధరించాలని ఉద్యమం నడుపుతూ ఉంటే అందుకు నిరసనగా ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? చంద్రబాబు కుటిలనీతిలో భాగంగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నట్లు కాదా?’ అని ప్రశ్నించారు.
చంద్రబాబు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. కాపులు మంచోళ్లు అంటూనే బైండోవర్లు తీసుకుంటారా!? చంద్రబాబు కాపులు మంచోళ్లని మాటలు చెబుతూ చేతల్లో మాత్రం వారిని సంఘ విద్రోహశక్తులుగా, దుండగులుగా చిత్రీకరిస్తున్నారని, దీన్ని బట్టి ఆయన బుద్ధి తెలిసిపోతోందని బొత్స చెప్పారు. రాష్ట్రంలో అన్ని పోలీసు స్టేషన్లలోను ఆ పరిధిలోని ఓ మోస్తరు కాపు నేతలను, చురుగ్గా ఉండే వారిని పోలీసులు పిలిపించి తాము ధర్నాలు, రాస్తారోకోలు చేయబోమని, శాంతిభద్రతలకు భంగం కలిగించబోమని, ఒకవేళ అలా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలకు బాధ్యులమవుతామని ‘బైండోవర్లు’ తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా బైండోవర్లను తీసుకోవడాన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. తునిలో రైలును తగులబెట్టిన విధ్వంస ఘటనల వెనుక టీడీపీ వాళ్లే ఉన్నారని సాక్షాత్తు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభమే చెబితే ఇంతవరకు ప్రభుత్వం అందుకు సమాధానం ఇవ్వలేదని గుర్తుచేశారు. తూర్పు గోదావరి జిల్లాలోకి ఇతర నేతలెవ్వరూ వెళ్లకూడదని ఆ జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలు రాచరిక వ్యవస్థను గుర్తుకు తెస్తున్నాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇటువంటిది ఉంటుందిగానీ ఇప్పుడెందుకు ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించారు.