
సాక్షి, కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ టక్కుటమార విద్యలు మొదలు పెట్టారని వైఎస్సార్ సీపీ నాయకులు కన్నబాబు విమర్శించారు. బుధవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటు బ్యాంక్ కోసం చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల పేరుతో కాపులను ఎన్నిసార్లు మోసం చేస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. రిజర్వేషన్ల అంశంపై గతంలో ముంజునాథ కమిషన్‌ను ఎందుకు వేశారో సమాధానం చెప్పాలన్నారు. ఈబీసీ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అవకావశం ఉందా అని నిలదీశారు.
అగ్రవర్ణ పేదలంతా కాపులకు వ్యతిరేకమవ్వాలనే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాపు నేతలపై చంద్రబాబు అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టు తిరిగేలా చేశారని అన్నారు. కాపు కార్పొరేషన్‌కు ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తుచేశారు. అయితే చంద్రబాబు కాపు కార్పొరేషన్‌కు ఇప్పటివరకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని తెలిపారు. ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని సాగనంపై రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment