చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం రెండు రోజుల ప్రదర్శన
పోరాటాలతోనే బీసీ హక్కుల సాధన: మీడియాతో ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే చట్టసభల్లో వెనుకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టాలన్న డిమాండ్‌తో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. టీడీఎల్‌పీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది బీసీలతో మే 5, 6 తేదీల్లో పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. రాజ్యాంగ రచన సమయంలోనే వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితే దేశంలో సామాజిక న్యాయం జరిగి ప్రగ తి పథాన నడిచేవాళ్లమని అన్నారు.
తెల్ల దొరల పాలనలో 1921లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు రోస్టర్ పద్ధతిలో జనాభా నిష్పత్తితో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఛలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా బీసీ వర్గానికే చెందిన ప్రధాని మోఢీకి జరిగిన అన్యాయాన్ని తెలియజే సి, చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించుకుంటామని అన్నారు. అలాగే ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల నేతలను కలిసి బీసీలకు రాజ్యాంగ బద్ధమైన వాటా ఇవ్వాలని ఒత్తిడి తెస్తామన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయిస్తామన్నారు. లేఖ రాయని పార్టీలను బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటించి ప్రచారం చేస్తామని చెప్పారు.
ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు ప్రతిపక్ష నేతలు సోనియాగాంధీ, ములాయం సింగ్ యాదవ్, శరద్‌యాదవ్, లల్లూ ప్రసాద్ యాదవ్, దేవగౌడ, సీపీఐ, సీపీఎం, బీఎస్‌పీ, ఆమ్‌ఆద్మీ మొదలైన 36 పార్టీల నేతలను కలుస్తామన్నారు. దేశంలో 56 శాతం జనాభా గల బీసీలకు చట్టసభల్లో 12 శాతం ప్రాతినిథ్యం కూడా లేదని, 2600 బీసీ కులాల్లో 2560 కులాలు పార్లమెంటు గేటు కూడా దాటలేదని చెప్పారు. 29 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ కూడా పార్లమెంటుకు రాలేదని వివరించారు. ఈ నేపథ్యంలో పోరాటాలతోనే బీసీ హక్కులను సాధించుకోవాలని నిర్ణయించి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
5,6 తేదీల్లో ఢిల్లీలో బీసీల ఆందోళన
Published Fri, May 1 2015 1:36 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement