'సీఎంకు అంత దమ్ము లేదు'
భువనగిరి: ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేసే దమ్ము తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు లేదని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గెలవలేరని వ్యాఖ్యానించారు.
విద్యార్థులకు ఫీజుల చెల్లింపులో జాప్యం వెనుక కుట్ర దాగుందని, పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీ ఇంతవరకు అమలు కాలేదని విమర్శించారు. విద్యా రంగ సమస్యలపై ఈ నెల 21న తలపెట్టిన విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఆర్. కృష్ణయ్య ఈ సందర్భంగా కోరారు.