'దళితుడి సీటు లాక్కున్న కేసీఆరే సారీ చెప్పాలి'
తెలంగాణకు అమిత్ షా క్షమాపణ చెప్పడం కాదని.. దళితుడి సీటు లాక్కుని అందులో ముఖ్యమంత్రిగా కూర్చున్నందుకు కేసీఆరే క్షమాపణ చెప్పాలని బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మూడేళ్లలో 2వేల ఇళ్లు కూడా పూర్తిచేయనందుకు కూడా ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకు తాము కచ్చితంగా సమాధానం చెబుతామన్నారు. ముఖ్యమంత్రి చేసే తాటాకు చప్పుళ్లకు తాము బెదిరేవాళ్లం కామని, కేంద్రంలో ఉన్నది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు.. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాల్లో బీజేపీ ముందుందని చెబుతూ.. ''సాగరహారంలో నువ్వెక్కడ, రైల్‌రోకోలో నువ్వెక్కడ, మిలియన్ మార్చ్‌లో నువ్వెక్కడ కేసీఆర్'' అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడినే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేస్తానని, లేకుంటే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్.. ఆ తర్వాత రాష్ట్రం రాగానే ఆ సీట్లో తానే కూర్చుండిపోయారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. అలా దళితులను అవమానించింది, దళిత వర్గాలను మోసం చేసింది ఆయనేనని చెప్పారు. అసోం లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తాము గెలిచామని, అలాంటిది హైదరాబాద్‌లోను, తెలంగాణలోను ఎందుకు గెలవలేమని ప్రశ్నించారు. హిందూ ముస్లింల సమైక్యతతోనే తాము హైదరాబాద్‌లో గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు. 2019లో అధికారాన్ని సాధించుకునేందుకు కార్యర్తలంతా ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు.