సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డు(ఓఆర్‌ఆర్)ను ప్రైవేటు సంస్థకు అప్పగించాలనే నిర్ణయం తెలంగాణ ప్రజల గొంతు కోయడమేనని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రజలను నమ్మించి గొంతుకోయడంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కుటుంబం ఆరితేరిందని ఆయన ఆరోపించారు. ఓఆర్‌ఆర్ ప్రైవేటీకరణతో కల్వకుంట్ల కుటుంబం కొత్త నాటకానికి తెర తీసిందని, వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై మొసలి కన్నీరు కారుస్తున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఓఆర్‌ఆర్‌ను ప్రైవేటు పరం చేయడంలో అర్థం లేదని మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందువరుసలో ఉందని, ఈ క్రమంలో నగరంలో వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని, ఇలాంటప్పుడు ఓఆర్‌ఆర్‌కు ఆదాయం పెరగడమే తప్ప తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. 30 ఏళ్లలో హెచ్‌ఎండీఏ టోల్ ఆదాయం కనిష్టంగా రూ.75వేల కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.
నిబంధనలు తుంగలోకి తొక్కి...
హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031 వరకు మాత్రమే ఆమోదం పొంది ఉందని, కానీ ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లకు లీజు ఇచ్చేందుకు టెండరు చేపట్టాల్సిన అవసరం ఏమిటో అర్థం కాలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలన్నీ తుంగలోతొక్కి ఈ టెండరు ప్రక్రియ జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టు విధంగా ఐఆర్‌బీకి టెండరు కట్టబెట్టినట్లు ఆయన ఆరోపించారు. ఓఆర్‌ఆర్‌పై ప్రైవేటు సంస్థ చేసిన అధ్యయనం నివేదికను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మణిపూర్‌లో కులాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. హింస ద్వారా ప్రజల, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతాయని తెలిపారు. మణిపూర్‌లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, అందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లను ఖర్చు చేసిందని వెల్లడించారు. మణిపూర్ యువతను, అక్కడి ప్రజలను కోరుకునేది ఒక్కటేనని, హింసను పక్కనపెట్టి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
‘ఓఆర్‌ఆర్ ప్రైవేటు’కు నిర్ణయం ప్రజల గొంతుకోయడమే
Published Mon, May 8 2023 1:50 AM | Last Updated on Mon, May 8 2023 7:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment