'హే కృష్ణా'.... ఇందిరా పార్కే బెటర్!
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే ....అన్నట్లుగా ఉంది ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పరిస్థితి. అనవసరంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టానురా కృష్ణా..అని మధనపడుతున్నారట. ఎన్నికల ముందు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి మీద ఆశపడి రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎరక్కపోయి వచ్చాను ...ఇరుక్కుపోయాను అని అనుచరుల వద్ద వాపోతున్నారట.
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎర చూపి రంగంలోకి దింపిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ...ఆ తర్వాత తూచ్ అంటూ చివరకు పార్టీ శాసనసభా పక్ష నేతగా కూడా అవకాశం ఇవ్వకుండా మొండి చేయి చూపించటమే కృష్ణయ్య అసంతృప్తికి కారణమైంది. కనీసం తెలంగాణలో పార్టీ ప్రెసిడెంట్ పదవైనా దక్కుతుందేమో అనుకుంటే ఎన్నికలు జరిగి ఆరు నెలలు దాటినా ఆ ఊసే లేదు.
తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే సీఎంను చేస్తామన్న బాబు... ఆఖరుకు శాసనసభా పక్షనేత పదవి కూడా ఇవ్వలేదని కృష్ణయ్య గత కొంత కాలంగా టీడీపీతో అంటీ ముట్టనట్లుగా ఉండడమే కాకుండా ఎక్కడా కనీసం పచ్చ కండువాను కూడా ఇష్టపడటంలేదు. దాంతో కొద్దిరోజుల క్రితం కృష్ణయ్య సైకిల్ దిగి ...కారు ఎక్కుతారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఏం జరిగిందో కానీ ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వచ్చినా.. ఆయన మాత్రం తనదారి...సపరేట్ అన్న చందంగా వ్యవహరించారు. సభలో టీడీపీ గందరగోళం సృష్టించినా కృష్ణయ్య మాత్రం నిమ్మకునీరెత్తినట్లే ఉండటం విశేషం. పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తే...వారినే అనుసరించేవారు అంతే. సమావేశాలకు హాజరైనా..పార్టీ సభ్యులతో సంబంధం లేనట్లు రావటం, వెళ్లడం సైలెంట్గానే జరిగాయి.
ఈ వ్యవహారమంతా గమనించిన టీడీపీ శాసనసభపక్షనేత ఎర్రబెల్లి...ఉండబట్టలేక కృష్ణయ్యను కదిలించారట. దాంతో కడుపు చించుకుంటే కాళ్లమీద పడ్డట్టుగా..'సభలో మాట్లాడే అవకాశమే రాలేదు. ఇంతకన్నా ఇందిరా పార్క్ దగ్గరే నయం...ఉద్యమాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరిగినప్పుడు మాట్లాడేవాడిని. నేను మాట్లాడాలనుకుంటే...ఇందిరా పార్క్ వద్దకు వెళ్లటమొక్కటే మార్గం' అని వాపోయారట.