LB nagar MLA
-
టీఆర్ఎస్లో చేరేముందు హామీయిచ్చా..
సాక్షి, హైదరాబాద్: ‘నేను టీఆర్ఎస్లో చేరేముందు బీఎన్‌రెడ్డినగర్ రిజిస్ట్రేషన్స్, ఆస్తిపన్ను తగ్గింపు తదితర సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చాను. లేని పక్షంలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించాను. నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాన’ని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా మాట్లాడారు. జూన్ 7 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సమస్యలపై చర్చించేందుకు వీలుకాలేదన్నారు. కోడ్ ముగిసిన తర్వాత సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచానన్నారు. ఈ ఆరు నెలల్లో సమస్యలు పరిష్కారం కాని పక్షంలో రాజీనామాకు వెనుకాడబోనన్నారు. ఇప్పటికే ఈ సమస్యలపై అధికారులతో పలుసార్లు చర్చించానని, ఈ నెల 16న మంత్రి కేటీఆర్ సమక్షంలో మరోసారి సమీక్ష సమావేశం జరగనుందని చెప్పారు. దాదాపు 90శాతం సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయని పేర్కొన్నారు. -
ఆర్. కృష్ణయ్య తొలగింపు
సీతమ్మధార (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను పదవి నుంచి తొలగించాలని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్ణయించింది. ఆయన స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏ రాజకీయ పార్టీకి చెందని వ్యక్తిని నియమించాలని తీర్మానించింది. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు పోలాకి శ్రీనివాసరావు అధ్యక్షతన విశాఖలోని ఇంజనీరింగ్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం జరిగిన రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం గౌరవాధ్యక్షుడిగా ఆర్.కృష్ణయ్యను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆర్. కృష్ణయ్య హైదరాబాద్‌లోని ఎబీ నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. -
'హే కృష్ణా'.... ఇందిరా పార్కే బెటర్!
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే ....అన్నట్లుగా ఉంది ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పరిస్థితి. అనవసరంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టానురా కృష్ణా..అని మధనపడుతున్నారట. ఎన్నికల ముందు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి మీద ఆశపడి రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎరక్కపోయి వచ్చాను ...ఇరుక్కుపోయాను అని అనుచరుల వద్ద వాపోతున్నారట. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎర చూపి రంగంలోకి దింపిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ...ఆ తర్వాత తూచ్ అంటూ చివరకు పార్టీ శాసనసభా పక్ష నేతగా కూడా అవకాశం ఇవ్వకుండా మొండి చేయి చూపించటమే కృష్ణయ్య అసంతృప్తికి కారణమైంది. కనీసం తెలంగాణలో పార్టీ ప్రెసిడెంట్ పదవైనా దక్కుతుందేమో అనుకుంటే ఎన్నికలు జరిగి ఆరు నెలలు దాటినా ఆ ఊసే లేదు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే సీఎంను చేస్తామన్న బాబు... ఆఖరుకు శాసనసభా పక్షనేత పదవి కూడా ఇవ్వలేదని కృష్ణయ్య గత కొంత కాలంగా టీడీపీతో అంటీ ముట్టనట్లుగా ఉండడమే కాకుండా ఎక్కడా కనీసం పచ్చ కండువాను కూడా ఇష్టపడటంలేదు. దాంతో కొద్దిరోజుల క్రితం కృష్ణయ్య సైకిల్ దిగి ...కారు ఎక్కుతారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఏం జరిగిందో కానీ ఆయన తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వచ్చినా.. ఆయన మాత్రం తనదారి...సపరేట్ అన్న చందంగా వ్యవహరించారు. సభలో టీడీపీ గందరగోళం సృష్టించినా కృష్ణయ్య మాత్రం నిమ్మకునీరెత్తినట్లే ఉండటం విశేషం. పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తే...వారినే అనుసరించేవారు అంతే. సమావేశాలకు హాజరైనా..పార్టీ సభ్యులతో సంబంధం లేనట్లు రావటం, వెళ్లడం సైలెంట్‌గానే జరిగాయి. ఈ వ్యవహారమంతా గమనించిన టీడీపీ శాసనసభపక్షనేత ఎర్రబెల్లి...ఉండబట్టలేక కృష్ణయ్యను కదిలించారట. దాంతో కడుపు చించుకుంటే కాళ్లమీద పడ్డట్టుగా..'సభలో మాట్లాడే అవకాశమే రాలేదు. ఇంతకన్నా ఇందిరా పార్క్ దగ్గరే నయం...ఉద్యమాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరిగినప్పుడు మాట్లాడేవాడిని. నేను మాట్లాడాలనుకుంటే...ఇందిరా పార్క్ వద్దకు వెళ్లటమొక్కటే మార్గం' అని వాపోయారట. -
ఓయూలో ఘనంగా పూలే వర్థంతి
హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు పూలే 124వ వర్థంతి శుక్రవారం ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షడు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఓయూ ఆర్ట్ కళాశాల నుంచి ఎన్సీసీ గేట్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ రన్లో భారీ సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
రీయింబర్స్‌మెంట్‌ను అడ్డుకునేందుకు ఐఏఎస్‌ల కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందకుండా ప్రభుత్వంలోని కొందరు ఐఏఎస్‌లు కుట్ర పన్నుతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం ఆయన సచివాలయంలో ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వారికి వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం సుమారు రూ.1200 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వాటిని ప్రభుత్వం చెల్లించని కారణంగా పీజీ మెడికల్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాలల యాజమాన్యాలు వేధిస్తున్నాయని తెలిపారు. ఇదే సమయంలో ఇప్పట్లో డీఎస్సీ వేయబోమని ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ప్రకటనను కృష్ణయ్య తప్పుపట్టారు. పంతుళ్లు లేక ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతుంటే డీఎస్సీ ఎందుకు వేయరని ఆయన ప్రశ్నించారు. -
ప్రజల పక్షాన పోరాడుతా: ఆర్.కృష్ణయ్య
మన్సూరాబాద్, న్యూస్‌లైన్: శాసనసభలో నాయకుడిగా అసెంబ్లీ బయట ఉద్యమ నాయకుడిగా దమ్మున్న నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడుతానని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ ఎల్బీనగర్ వార్డు కార్యాలయం నుంచి ఎల్బీనగర్ టీఎన్టీయూసీ అధ్యక్షుడు కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ర్టంలో లక్షా డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇళ్లులేని పేదలకు 125 గజాల స్థలం, రూ.3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన ఎన్నికల హామీని నేరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. డ్వాక్రా, రైతు రుణాల మాఫీకి ప్రభుత్వంపై పోరాడుతానని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పౌర సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, ఇళ్ల పట్టాలు లాంటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. ఎల్బీనగర్లో రోడ్లపై తోపుడుబండ్లు పెట్టుకుని జీవనం సాగించే చిరువ్యాపారులపై పోలీసుల వేధింపులు లేకుండా పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తానని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ తోపుడు బండ్ల అధ్యక్షుడు మల్లేష్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్యను పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ర్ట కార్యనిర్వహక కార్యదర్శి సామ రంగారెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల లతానర్సింహ్మరెడ్డి, నాయకులు మల్లారపు శ్రీనివాసరావు, నాంపల్లి శంకరయ్య, విశ్వేశ్వర్రావు, ఎగమయ్య, యంజాల జగన్, గుండె గిరిబాబు, రాము, కాసాని అశోక్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.